మాతృకాచక్రము
అక్షరముల సిద్ధాంతమే మాతృకాచక్రము. ఈ చరాచర జగత్తు అంతా భగవంతుడు అయిన శివుని ద్వారా సృష్టించబడినది అని సిద్ధాంతము ద్వారా నిరూపించబడుతుంది. అతడు తన ఇచ్ఛామాత్రముననే ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ విశ్వమంతా అతని ప్రతిబింబము మాత్రమే.
ఇంతకు ముందు
చెప్పినట్లు ఈ విశ్వమంతా 36తత్త్వముల సమాహారము. ఈ తత్త్వములను అవరోహక్రమంలో చూస్తే
ముందుగా శివ తత్త్వము, ఆ తర్వాత
శక్తి, సదాశివ, ఈశ్వర, శుద్ధవిద్య.... ఈవిధంగా ఉంటాయి. అయితే
విశ్వము ఈ అవరోహణ క్రమంలో ప్రతిబింబచడం లేదు. కానీ ఆరోహణ క్రమంలో అనగా పృథ్వీ
నుండి శక్తి తత్త్వము అనగా కింద నుండి పైకి ప్రతిబింబిస్తోంది. పుటాకార (=concave) దర్పణంలో మన
ప్రతిబింబము తలకిందులుగా ఏవిధంగా కనిపిస్తుందో అదే విధంగా ఈ విశ్వము శక్తి
తత్త్వముతో ప్రారంభమైనా పృథ్వీ తత్త్వము నుండి ప్రారంభమైనట్లుగా కనిపిస్తుంది.
అనగా పృథ్వీ తత్త్వము ముందుగా ప్రతిబింబించి అక్కడ నుండి వరుసగా తత్త్వములు కింద
క్రమం నుండి పైకి ప్రతిబింబించును.
ప్రతిఫలింపచేయు
భగవంతుడు శివునకు అయిదు శక్తులు కలవు. అవి చిత్ శక్తి, ఆనంద శక్తి, ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి.
పై అయిదు
శక్తులు వర్ణమాలలోని 16 స్వరములలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ 16 స్వరములూ శివ
తత్త్వములు. అ చిత్ శక్తిని, ఆ ఆనందశక్తిని సూచించును. అయితే ఈ రెండింటికీ అవినాభావ సంబంధము కలదు. చిత్
శక్తి ఉన్నచోట ఆనంద శక్తి ఉంటుంది. అలాగే ఆనంద శక్తి ఉన్న చోట చిత్ శక్తి ఉంటుంది.
ఒకటి లేకపోతే రెండోది లేదు. ఈ దశలో విశ్వము ఇంకా రూపును సంతరించుకోలేదు. అది ఇంకా
ఆనంద శక్తిలోనే ఉన్నది.
ఆ తర్వాత
శక్తి ఇచ్చాశక్తి. ఇక్కడ ఇచ్చ అంటే కోరిక అని అర్థం కాదు. ఇచ్చ అంటే సంకల్పం అని
అర్థం. ఈ శక్తి స్వరములలో మూడవవ ఇ, నాల్గవ ఈ వర్ణములను సూచిస్తుంది. ఈ ఇచ్చాశక్తి రెండు
విధములుగా ఉంటుంది. 1) కలవరపడనిది 2) కలవరపడ్డది. మొదటిదానిలో ఇచ్చాశక్తి ప్రశాంతంగా
ఉండి తన స్వభావంలో తాను ఉంటుంది. ఈ స్థితినే ఇ సూచిస్తుంది. ఇక రెండవడానిలో కలవరపడిన
శక్తి అయినా అది శివుని స్వభావం నుండి మాత్రం వేరవదు. అది ఇంకా శివుని స్వంత
చైతన్యము, జ్ఞానము, ఆనందములోనే ఉంటుంది. ఈ స్థితిని ఈ
వర్ణము సూచిస్తుంది.
ఇక్కడ శివుని
చైతన్యములో ఒకానొక భావము (సంకోచము) అనగా “నేను” ఇంకా ముందుకు వేడితే నా స్వంత
స్వభావమును కోల్పోవచ్చు అని ఏర్పడుతుంది. ఈ భావము శివుని జ్ఞానశక్తిలో కలుగుతుంది.
ఈ జ్ఞానశక్తిని వర్ణములు ఉ ఊ సూచిస్తాయి. ఉ ను ఉన్మేష అని ఊ ను ఊన అని అంటారు. ఉన్మేష
అనగా వికసనము అని ఊన అనగా తక్కువచేయుట అని అర్థము. విశ్వము పుట్టబోచున్నది అని
ఉన్మేష తెలియచేస్తుంది. కానీ అది పూర్తిగా రచింపబడలేదు. విశ్వరచన పూర్తిగా ఎప్పుడు
మొదలవుతుందో అప్పుడు శివుని యొక్క చిత్శక్తి, ఆనందశక్తి తగ్గుతాయన్న భావన
కలుగుతుంది. ఆ తగ్గుదల అన్న భావననే ఊనతా అని అంటారు. ఈ భావన వలన అతడు స్థిరంగా
ఉండి ముందుకు కదలకుండా ఉంటాడు.
అందువల్ల అతను
విశ్వరచనా పనిని వదలిపెట్టి, విశ్వమును తన స్వభావం నుండి తప్పించి తన చిత్శక్తి, ఆనందశక్తులలో ఉండిపోతాడు. శివుని
యొక్క ఈ స్థితిని ఋ, ఋ(2), ఌ, ఌ(2) సూచిస్తాయి. ఈ పరిస్థితి వలన
విశ్వము రూపు సంతరించుకోలేకపోతుంది. ఇక్కడ విశ్వరచనా పని పూర్తిగా ఆగిపోతుంది.
అనగా శివుడు పూర్తిగా తన ఆనంద స్వరూపంలో ఉండిపోతాడు. అందువలననే ఈ నాలుగు
అక్షరములనూ అమృతబీజములని అంటారు. శివుడిని ఇక్కడ అనాశ్రిత శివ అని అంటారు. విశ్వము
యొక్క ఉనికిని అంగీకరించని శివుడినే అనాశ్రిత శివ అని అంటారు. ఈ స్థితిలో శివుడు
ఎల్లప్పుడూ ఉండిపోతాడు.
“విశ్వమును రచించితే
నా స్వభావము తగ్గుతుంది” అన్న ఏ భావన (బంధము) ఉందో అదే ఊనతా. ఈ బంధాని మొదటి రెండు
శక్తులైన చిత్శక్తి, ఆనందశక్తి
గుర్తించలేవు. విశ్వరచన అనేది ఈయన స్వభావము యొక్క ప్రకాశము. కనుక ఇక బంధానికి
చోటెక్కడిది? అసలు శివునికి
బంధమనేది ఏదీ ఉండదు. అందువలన అతడు ఎందుకు భయపడతాడు? బయటకి రావడం (ఆనంద స్థితి నుండి)
లోపలకి పోవడం అన్నవి ఆయనకు సమానము. ఈ విధమైన ఆలోచనవలన ఈ రెండు శక్తులూ (చిత్శక్తి, ఆనందశక్తి) మళ్ళీ విశ్వరచనకు
కొత్తగా పూనుకొంటాయి.
కనుక అ ఆ లతో
సూచించిన చిత్శక్తి, ఆనందశక్తులు ఇచ్ఛాశక్తితో
కలిసి సంకల్ప శక్తులు ఇఈలతో కూడి ఏ ఐ అక్షరములను సృష్టిస్తున్నాయి. చిశక్తి, ఆనందశక్తులు జ్ఞానశక్తితో (ఉ, ఊ) కూడినప్పుడు ఓ అక్షరము
సృష్టించబడుతుంది. అదేవిధంగా ఆ రెండు శక్తులు ఓ ను స్పర్శితే ఔ సృష్టించబడుతుంది. అ
లేదా ఆ ఇ లేదా ఈ ని స్పర్శితే ఏ, ఐలు, అదేవిధంగా ఉ, ఊలను స్పర్శిస్తే ఓ, ఔలు సృష్టించబడుచున్నాయి.
చిత్శక్తి, ఆనందశక్తులు - ఇచ్ఛా, జ్ఞాన శక్తులను స్పర్శించడం వలన
ఏర్పడిన ఈ నాలుగు అక్షరాలు ఏ ఐ ఓ ఔలు క్రియాశక్తి యొక్క నాలుగు స్థితులు.
క్రియాశక్తినే శివుని క్రియాశీల శక్తి అని అంటారు. మొదటి అక్షరం ఏ ను అస్ఫుట
(అస్పష్టమైన) క్రియాశక్తి అని, రెండవ అక్షరము ఐ ను స్ఫుట క్రియాశక్తి (స్పష్టమైన) అని, మూడవ అక్షరము ఓను స్ఫుటతరమైన
క్రియాశక్తి అని, నాల్గవ
అక్షరము ఔను స్ఫుటతమ క్రియాశక్తి అని అంటారు. ఈ నాలుగు శక్తుల చర్యల ద్వారా విశ్వము
యొక్క ప్రతిబింబము ఏర్పడుతున్నది. ఈ నాలుగు శక్తులలో శివుని విశ్వప్రతిబింబము ఏర్పడుతున్నట్లు కనబడుతున్నా, ప్రధానంగా అది అతని నాల్గవ
శక్తియైన ఔలో మాత్రమే ఏర్పడుతున్నది.
ఇక్కడ
గమనించవలసినది ఏమిటంటే, విశ్వము అతని (శివుని) నుండే ఏర్పడుతున్నా అతని నిజ స్వభావములైన చిత్తము, ఆనందములు ఎంతమాత్రమూ తగ్గడం లేదు.
నిజానికి ఏమీ జరగలేదు. అతడు తన స్వభావంలోనే ఉన్నాడు. శివుని యొక్క ఈ స్థితిని
అనుస్వారము అం సూచిస్తుంది. ఈ అక్షరము శివుని నుండి ఈ విశ్వము సృష్టించబడినా అతని
యొక్క ఉనికి ఎంత మాత్రమూ అతని సహజ స్వభావము నుండి కదలలేదు అని సూచిస్తుంది.
పైన వివరించిన
విశ్వ ప్రతిబింబము ఒక గిన్నె రూపాకార అద్దముగా ఉండును. ఆ రూపమును విసర్గగా
సూచింపబడును. అది రెండు బిందువులు : గా కనపడును. ఈ రెండు బిందువులు రెండు
గిన్నెలుగా వాటిలో విశ్వము ప్రతిబింబిస్తున్నట్లుగా తెలుసుకోవాలి. ఈ రెండు
బిందువులు ఒకటి శివబిందు, రెండవది శక్తిబిందు.
పైన వివరించిన
అనుత్తరము అ నుండి విసర్గ వరకు గల స్వరములను శివతత్త్వము అని అంటారు. మిగిలిన
అక్షరములను శక్తి తత్త్వములు అని అంటారు. (35తత్త్వముల జగత్తు). ఈ విశ్వము అతని
యొక్క స్వాతంత్ర్య ప్రతిఫలనము మాత్రమే. ఈ విశ్వము సృష్టించబడలేదు కానీ ప్రతిబింబము
మాత్రమే. సృష్టించబడకపోతే అవి (అక్షరములు) ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి సంభవించాయి? అవి అక్షరముల
ప్రతిబింబములా లేక వాటంతట అవే ఉత్పన్నమయ్యాయ? అన్న అనుమానం కలుగుతుంది. నిజానికి
అవి శివుని స్వాతంత్ర్య ప్రతిబింబము నుండి ఒకదాని తర్వాత ఒక ఉదయించాయి. చిత్శక్తి, ఆనందశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులలో శివుని
స్వాతంత్ర్యత ప్రతిఫలిస్తోంది. అన్ని తత్త్వములూ శివుని యొక్క ఈ అయిదు శక్తుల
ప్రతిబింబములు మాత్రమే. సర్వమూ ఈ అయిదు శక్తుల నుండి మాత్రమే పుట్టుచున్నవి. అది
అతని స్వాతంత్ర్యము. ఈ అయిదు శక్తుల నుండి ముందుగా పంచ మహా భూతములు, తర్వాత పంచతన్మాత్రలు, ఆ తర్వాత పంచ కర్మేంద్రియములు....ఆ విధంగా జనిస్తున్నవి.
వీటన్నింటిలో ముందు చెప్పిన అయిదు శక్తులూ ఉంటాయి. ఉదాహరణకు, చిత్శక్తిలో చిత్శక్తి, ఆనందశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు ఉంటాయి. అదేవిధంగా
మిగతా వాటిలో కూడా అన్ని శక్తులూ ఉంటాయి. ఒక శక్తిలో మిగతా శక్తులు ఉన్నా వాటిల్లో
ఒక శక్తి మాత్రమే ప్రధానమైనదని అర్థం చేసుకోవాలి. ఈ అయిదు శక్తుల్లో అయిదేసి శక్తులు
కలిపి మొత్తం 25శక్తులు అవుతున్నాయి. అవే మొదటి 25 తత్త్వములు. (పృథ్వి నుండి
పురుష వరకు)
శివుని అయిదు
శక్తుల్లో చిత్శక్తి, ఆనందశక్తులైన
అ, ఆలు కలిసినప్పుడు
పంచమహాభూతములైన, ఙ,ఘ,గ,ఖ,క లు ఉత్పత్తి అవుతాయి. ఙ (ఆకాశము)
చిత్శక్తి యొక్క ప్రతిబింబము, ఘ (వాయువు) ఆనందశక్తి యొక్క ప్రతిబింబము, ఇచ్ఛాశక్తి యొక్క ప్రతిబింబము గ
(అగ్ని), జ్ఞానశక్తి యొక్క
ప్రతిబింబము ఖ (జలము), క్రియాశక్తి
యొక్క ప్రతిబింబము క (పృథ్వి).
శక్తితత్త్వము శివతత్త్వము యొక్క ప్రతిబింబము. అందువలన ప్రతిబింబ
ప్రకాశము ప్రతి సందర్భంలో విలోమ క్రమంలో ఉంటుంది. కనుకనే అక్షరములు విలోమక్రమంలో
చెప్పబడుచున్నవి.
పైన వివరించిన
మహాభూతముల ఆవిర్భావంలాగే పంచతన్మాత్రలు కూడా ఇ,ఈల రూపమైన ఇచ్ఛాశక్తి ద్వారా
ఉత్పన్నమవుతున్నాయి. పంచతన్మాత్రలను ఞ,ఝ,జ,ఛ,చ సూచిస్తాయి. ఞ (శబ్దము)
చిత్శక్తి యొక్క ప్రతిబింబము, ఝ (స్పర్శ) ఆనందశక్తి యొక్క ప్రతిబింబము, ఇచ్ఛాశక్తి యొక్క ప్రతిబింబము జ
(రూప), జ్ఞానశక్తి యొక్క
ప్రతిబింబము ఛ (రస), క్రియాశక్తి
యొక్క ప్రతిబింబము చ (గంధ-వాసన).
పై విధంగా
పంచకర్మేంద్రియములు (ణ,ఢ,డ,ఠ,ట) అనాశ్రితశివ ఐన ఋ,ఋ(2) లనుండి, పంచజ్ఞానేంద్రియములు (న,ధ,ద,థ,త) అదే తత్త్వమైన ఌ, ఌ(2) నుండి ఉత్పన్నమవుతున్నాయి.
పంచకర్మేంద్రియముల
ప్రతిబింబము ఈ విధంగా ఉంటుంది. ణ (వాక్) చిత్శక్తి యొక్క ప్రతిబింబము, ఢ (పాణి) ఆనందశక్తి యొక్క
ప్రతిబింబము, ఇచ్ఛాశక్తి యొక్క
ప్రతిబింబము డ (పాద), జ్ఞానశక్తి
యొక్క ప్రతిబింబము ఠ (పాయు), క్రియాశక్తి యొక్క ప్రతిబింబము ట (ఉపస్థ).
పంచజ్ఞానేంద్రియముల
ప్రతిబింబము ఈ విధంగా ఉంటుంది. న (ఘ్రాణ) చిత్శక్తి యొక్క ప్రతిబింబము, ధ (రసన-రుచి) ఆనందశక్తి యొక్క
ప్రతిబింబము, ఇచ్ఛాశక్తి యొక్క
ప్రతిబింబము ద (త్వక్), జ్ఞానశక్తి యొక్క ప్రతిబింబము థ (చక్షు), క్రియాశక్తి యొక్క ప్రతిబింబము త
(శ్రోత్ర).
జ్ఞానశక్తి
ఉ-ఊలు అయిదు శక్తులతో కలిసినప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి, పురుష తత్త్వములు జనిస్తున్నవి. ఇవి
వరసగా ప,ఫ,బ,భ,మ. వీటి ప్రతిబింబము ఈ విధంగా
ఉంటుంది. మ (పురుష) చిత్శక్తి యొక్క ప్రతిబింబము, భ (ప్రకృతి) ఆనందశక్తి యొక్క
ప్రతిబింబము, ఇచ్ఛాశక్తి యొక్క
ప్రతిబింబము బ (అహంకారము), జ్ఞానశక్తి యొక్క ప్రతిబింబము ఫ (బుద్ధి), క్రియాశక్తి యొక్క ప్రతిబింబము ప
(మనస్సు).
పురుష యొక్క
ఆరు అంతర్గత స్థితులైన మాయ, కలా, విద్యా, రాగ, కాల, నియతులలో రాగ నియతిలోని, కాల కలాలోనూ కలిసి నాలుగు అంతర్గత
స్థితులుగా రూపొందుతున్నాయి. ఈ నాలుగూ వర్ణమాలలోని ముందు చెప్పిన వర్ణముల తర్వాత
నాలుగు వర్ణములను ప్రతిబింబిస్తాయి. అవి కాల-కలా (limitation of time & creativity) య ను, విద్యా (పరిమిత జ్ఞానము) ర ను, రాగ-నియతి (limitation of attachment
& space) ల
ను, మాయ (self ignorance &
objectivity [=విషయ
నిష్ఠత] వ ను సూచించును.
పైన చెప్పబడిన
పరిమితులు (limitations) పురుష తత్త్వములోనే
ఉండడం వలన వీటిని శివుని పంచశక్తుల ద్వారా సృష్టించబడ్డాయని అర్థంచేసుకోరాదు.
శుద్ధవిద్య, ఈశ్వర, సదాశివ, శక్తి తత్త్వాలు కూడా శివుని పంచ
శక్తుల ద్వారా సృష్టించబడలేదు. కానీ అవి అతని స్వంత స్వభావం యొక్క వేడి నుండి
తెలియబడుచున్నాయి. శుద్దవిద్య అహం-అహం (నేను-నేను)/ ఇదం-ఇదం (ఇది-ఇది) అన్న స్థితిని
సూచిస్తుంది. ఈ తత్త్వం శ అనే అక్షరం ద్వారా తెలియబడుతుంది. ఇదం-అహం అన్న స్థితి ఐన ఈశ్వర తత్త్వము
ష అక్షరం ద్వారా తెలియబడుతుంది. అహం-ఇదం అన్న సదాశివ తత్త్వము స అక్షరం ద్వారా
తెలియబడుతుంది. అహం (నేను) అన్న శక్తి తత్త్వము హ ద్వారా తెలియబడుతుంది. ఈ కారణం
వలననే ఈ నాలుగు అక్షరములను వ్యాకరణములో ఊష్మ (=వేడి) అని అంటారు.
వ్యాకరణ సిద్ధాంతాచార్యుడు పాణిని కూడా వర్ణములను పై
విధంగానే వివరించాడు.
మొత్తం విశ్వమంతా మొదటి అక్షరమైన అ మరియు చివరి అక్షరమైన హ
లలో నిక్షిప్తమై ఉంది. అ అక్షరమును ప్రపంచ రచనా శక్తికి మొదటి అడుగుగా, హ ను విశ్రాంతి స్థానముగా
చెబుతారు. మిగిలిన అన్ని అక్షరాలు అ-హ ల మధ్య ఉన్నట్టే మొత్తం విశ్వమంతా ఈ
రెండింటి మధ్యలోనే ఉంది. దీనినే ప్రత్యాహార సిద్ధాంతము అని అంటారు. అనగా
ఆద్యంతములను గ్రహించడం.
ఈ అహ లకు మ్ కారమును చేర్చగా అది అహం అవుతుంది. అదే శివుని
యొక్క మంత్రము. ఇక్కడ మ్ యొక్క ప్రాముఖ్యత ఏమనగా, ప్రత్యాహారము (అ నుండి హ వరకు గల
అక్షరములు), 36తత్త్వములు, పంచకలలు ఇవేవీ నిజానికి సృష్టించబడలేదు.
అది ఒక స్థానము మాత్రమే అని సూచిస్తుంది. ఈ మ్ ను అనుస్వారము అని అంటారు.
శక్తి ప్రత్యాహారకు, శివ ప్రత్యాహారకు తేడా ఉంది.
శక్తి ప్రత్యాహారలో రెండు శక్తులు కలిసి వాటంతట అవే ప్రపంచాన్ని సృష్టిస్తాయి. నిజానికి
శక్తి సృష్టించబడిన జీవి యొక్క ఉనికి. సృష్టించేవాడు శివుడు. ఇక్కడ శక్తి శివుని
నుండి ప్రత్యేకంగా ఉండాలని కోరుకొంటుంది. అలా చెయ్యడానికి ఆమె తన సొంత ప్రపంచాన్ని
సృష్టించుకోవాలి. తేనెటీగల వలె. ఒకసారి రాణి ఈగ గుడ్లు పెట్టడం ఆపివేస్తే, అప్పుడు పనిచేయు ఈగలు వాటంతట అవే
కలయిక లేకుండానే గుడ్లు పెడతాయి. దీనినే శక్తుల సంయోగము అని అంటారు. శక్తి
ప్రపంచమును సృష్టించడానికి శివుడిని పక్కన పెట్టి తనతో తను కలిస్తుంది. దీనిని
శక్తుల విస్తరణము అని అంటారు. అప్పుడు హల్లుల్లోని మొదటి అక్షరమైన క తో ఈ సృష్టి
మొదలై చివరి అక్షరమైన స తో ముగుస్తుంది. ఇక్కడ శక్తికి హ చివరి అక్షరము కాదు.
ఎందుకనగా అది శివాక్షరము. అందువలన హ అక్షరము శక్తి యొక్క సృష్టిలో గుర్తింపబడదు. ఈ
విధంగా శక్తి సృష్టి జరిగి శక్తి మంత్రము క్ష జనిస్తున్నది.
మాతృకా
చక్రములో మొత్తం మూడు రకాలైన విసర్గలు ఉంటాయి. అవి శాంభవ విసర్గ, శాక్త విసర్గ, ఆణవ విసర్గ. మొదటి విసర్గ అయిన
శాంభవ విసర్గ ‘అ’ అక్షరంతో సూచించబడుతూ ఆనంద శక్తి
స్థితిలో ఉంటుంది. ఈ విసర్గ యొక్క రీతిని చిత్తప్రళయముగా చెప్పబడుతుంది. మనసు
పనిచేయని స్థితినే చిత్తప్రళయము అని అంటారు. ఇక్కడ ఆలోచనలు ఎంత మాత్రమూ ఉండవు. ఈ
శాంభవ విసర్గను పరా విసర్గ అని కూడా అంటారు. ఇది శివునికి సంబంధించినది.
రెండవ విసర్గ
అయిన శాక్త విసర్గను పరాపర విసర్గ అని అంటారు. ఇది మద్యస్థ విసర్గ. మాతృకలలో చివరి
అక్షరమైన హ ను ఈ విసర్గ సూచిస్తుంది. ఈ అక్షరమును విసర్గలాగే పలుకుతారు. ఈ విసర్గ
యొక్క రీతిని చిత్తసంబోధ అని అంటారు. ఇక్కడ చిత్తసంబోధమనగా ఒకే విషయముమీద
ఏకాగ్రతగా మనసును నిలపడం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి