సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, మే 2023, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 65 (ముగింపు)

 

అరవైఅయిదవ భాగము

దమనకారోపణవిధివివరణం

 ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఈ క్రియను కూడా పవిత్రారోపణ క్రమంలోనే చెయ్యాలి. ఈ క్రియను ఆచరించుటకు చైత్రాది మూడు మాసములు మరియు శుక్లపక్షము ఉత్తమము. చైత్రము ఉత్తమం, వైశాఖం మధ్యమం, జ్యేష్ఠం అధమం. అష్టమీ, చతుర్దశీ, పౌర్ణమి తిథులలో అర్ధరాత్రి సమయంలో ముందుగా అధివాసము చెయ్యాలి. నాలుగు కల్పలతాదులతో బాటుగా ప్రథమ దమనమును ఆమంత్రితము చేసి “శివాప్రసాదసంభూత అన్న సన్నిహితో భవ| శివకార్యం సముద్దిశ్య ఛేత్తవ్యోసి శివాజ్ఞయా|” ఈ విధంగా ఆమంత్రణ చేసి రతి, కాములను పూజించాలి. ఆ తర్వాత సాధకుడు తనకు తానుగా గానీ, ఇతర మౌనుల ద్వారా గానీ పల్లవములు, మూలము సహితంగా తీసుకువచ్చిన దమనమును సర్వతోభద్ర కమలములో ఎడమవైపున స్థాపించాలి. ఆ తర్వాత ఎనిమిది అంగుళముల పొడవు, నాలుగు అంగుళముల వెడల్పు గల యంత్రమును స్థాపించి పూజించాలి. “ఓం హ్రీం రత్యై నమః” అను రతిమంత్రము మరియు “ఓం క్లీం కామాయ నమః” అను కామదేవ మంత్రముతో రతి, కామదేవులను పూజించాలి. దమనమును ఒక పవిత్ర పాత్రలో పెట్టి పూజించాలి.

      ఆ తర్వాత ఆ కమలములో పూర్వాది కమలముతో ప్రారంభించి ఈ అష్టద్రవ్యములతో ఈ క్రింది మంత్రములతో పూజించాలి.

ఓం కామయ నమః| ఓం భస్మశరీరాయ నమః| ఓం అనంగాయ నమః| ఓం మన్మథాయ నమః| ఓం వసంతాయ నమః| ఓం శశనామ్నే నమః| ఓం స్మరాయ నమః| ఓం ఇక్షుధనుర్ధరాయ నమః| ఓం పుష్పబాణాయ నమః|

      కర్పూరము, గోరోచనము, కస్తూరి, అగరు, కుంకుమ, ఉసిరి, చందనము, సుగంధము – వీటిని అష్టద్రవ్యములని అంటారు. గంధపుష్పఅక్షింతలతో దమనమును చక్కగా పూజించి ప్రసన్న మనస్సుతో కామగాయత్రిని యథాశక్తి జపించాలి.

కామగాయత్రి – వామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి| తన్నోనంగః ప్రచోదయాత్|

ఆ తర్వాత “నమోస్తు పుష్పబాణాయ జగదానందకారిణే| మన్మథాయ జగన్నేత్రే రతిప్రీతిప్రియాయచ” అని నమస్కరించాలి. ఆ తర్వాత చేతిలోకి దమనమును తీసుకొని “ఆమంత్రితాపి దేవేశీ సద్యః కాలే మయా శివే| కర్తవ్యంతు యథా లాభం పూర్ణం పర్వ త్వదాజ్ఞయా|” అను మంత్రంతో దేవికి విజ్ఞాపన చెయ్యాలి. ఈ మంత్రంతో త్రిపురా దేవిని సంతృప్తి పరచాలి.

      ఆ తర్వాత దేవేశ్వరీని గంధపుష్పాక్షతలతో పూజించి నైవేద్యము సమర్పించాలి. ఆ తర్వాత ఈ క్రింది విధంగా ప్రార్థించాలి.

షోడశార్ణే జగన్మాతర్వాంఛితార్థఫలప్రదే|

హృత్స్తాన్ పూరాయ మే దేవి కామాంకామేశ్వరేశ్వరీ||

పైవిధంగా ప్రార్థన చేసిన తర్వాత అనంగుని అవగుంఠన చెయ్యాలి. అస్త్రమంత్రంతో పరిరక్షణ చెయ్యాలి. రాత్రి జాగరణ చెయ్యాలి. ఆ తర్వాత ప్రాతఃకాలములో నిత్యపూజ చెయ్యాలి. నిత్యపూజ తర్వాత నైమిత్తిక పూజ చెయ్యాలి. ఆ తర్వాత మధ్యాహ్న కాలంలో పుష్పమిశ్రిత మహాపూజ చెయ్యాలి. అనేక రకముల నైవేద్యమును నివేదించి, కర్పూరయుక్త తాంబూలమును సమర్పించి అనంగుడిని ప్రార్థించాలి. “సమస్త చక్రచక్రేశీ సర్వవిద్యాశరీరిణి| దమనకం గృహాణేదం ప్రసీద పరమేశ్వరీ|” అను మంత్రముతో దేవికి దమనమును సమర్పించి నమస్కరించాలి. ఆ తర్వాత సామయికా సాధకులతో సహితంగా సుఖపూర్వక జలక్రీడ చెయ్యాలి. షడ్రుచోపేత అన్నదానము చెయ్యాలి. ఈ విధంగా దమనారోపణ క్రియను చేసిన సాధకుని వార్షిక పూజ శ్రీవిద్య ద్వారా ఉన్నతము అవుతుంది.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన దమనకారోపణవిధివివరణం అను అరవైఅయిదవ భాగము సమాప్తము.

ఇతి శివం

కామెంట్‌లు లేవు: