సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, మార్చి 2023, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 57

 యజన న్యాస ముద్రా వివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు –

సాధకుడు మనస్సులో శ్రీవిద్యా మంత్రమును ధ్యానిస్తూ తన వామభాగమున ఒక చతురస్ర మండలమును నిర్మించాలి. ఆ మండలమును గంధ, పుష్ప, అక్షింతలతో పూజ చెయ్యాలి. ఆ మండలము మీద కారణము (=మద్యము), నీళ్ళతో నింపిన శంఖమును స్థాపించాలి. ఆ శంఖమును బాగా పూజించి దానితోనే త్రిపురామండలమును పూజించాలి. ఒక చతురస్రమును నిర్మించి దానిమీద యంత్రమును స్థాపించాలి. త్రికోణ, వృత్త, షట్కోణములు క్రమంగా పూజించాలి. సాధకుడు త్రికోణములో సామూహికంగా మరియు వేరువేరుగా పూజ చెయ్యాలి. షట్కోణములో రెండుసార్లు షడంగపూజ చెయ్యాలి. ఆద్యబీజము (=క్రీం) ద్వారా వహ్నిని యంత్రాకార రూపంలో అర్చించాలి.

      స్వర్ణాదులతో నిర్మింపబడిన లేదా కొబ్బరితో చేసిన లేదా మానవ కపాల పాత్రలు భోగమోక్షములను ఇచ్చును. కొబ్బరి పాత్ర సమస్త ఐశ్వర్యమును, సుఖమును ఇచ్చును. ఇది ముక్తిప్రదము మరియు విశేష రూపంలో సమస్త కర్మల ప్రయోగములందు ఉపయుక్తము. గంధాదులతో పూజింపబడినది, ధూపముతో ధూపింపబడినది అయిన పాత్ర ఉత్తమము. యంత్రము మీద ఈ పాత్రను పెట్టి దానిమీద ముందు చెప్పబడిన యంత్రమును లిఖించాలి. కామకూటము (=హసకహలహ్రీం) ఉచ్చరించుచూ ఆ యంత్రమును పూజించాలి. అక్కడ విశేషంగా సూర్య పాత్రను పెట్టాలి. దానిలో సగభాగం జలము నింపాలి. దానిలో పూర్వ విధంగానే యంత్రములు లిఖించి పూజించాలి.

      త్రికోణములో శ్రీవిద్యను పూజించాలి. మధ్య త్రికోణములోని మూడు కోణములందు మూడు కూటములతో పూజించాలి. శ్రీవిద్యా విషయంలో సంపుట పూజ చెయ్యాలి. దేవీ పూజా విషయంలో కూడా అదే క్రమం ఉంటుంది. దేవీ మూలమంత్రంలోని ఆరు కూటములతో అంగపూజ చెయ్యాలి. శక్తికూట (=సకలహ్రీం)ను ఉచ్చరించి జలమును చంద్రరూపంగా పూజించి మధ్యలో మాతృకాత్మక త్రికోణమును పూజించాలి. త్రికోణములో పంచకోశ మహావిద్యను ధ్యానం చెయ్యాలి. శ్రీగురు యొక్క మూడవ బీజము “హంస” విద్యా మంత్రమును జపించాలి. సాధకుడు స్వయంగా రుద్రస్వరూపంగా భావిస్తూ శ్రీవిద్యను ఏడుసార్లు జపించాలి. ఆ తర్వాత అర్ఘ్యపాత్రను స్పర్శించి గంధ, పుష్పాదులతో పూజించాలి. ఆ అర్ఘ్యజలముతో సంపూర్ణ పూజా ద్రవ్యములను, సాధకుడు తనను ప్రోక్షణ చెయ్యాలి. ఈ ప్రోక్షణ వలన సర్వమూ శ్రీవిద్యా రూపము అయిపోతాయి. ఆ ప్రోక్షణ అనామికా, అంగుష్ఠ ద్వారా వామమార్గంలో చెయ్యాలి. దానిని మహాపాపనికృంతని తత్త్వముద్రా అని చెబుతారు. అంగుష్ఠ, తర్జనీలను జ్ఞాన ముద్రా అని అంటారు. ఈ ముద్రతో పుష్పపూజ మరియు తర్పణ పూజ చెయ్యాలి.

      ఆ తర్వాత సాధకుడు దేహ శుద్ధి కొరకు భూతశుద్ధి చెయ్యాలి. వాయుబీజము (=యం) ద్వారా దేహములో ఉన్న పాపయుక్త ధాతువులను ఎండిపోయినట్లు చేసి వహ్ని (=రం) ద్వారా పాపసహిత ఆ ధాతువులను కాల్చివెయ్యాలి. ఆ తర్వాత పాపరాహిత ఆ దేహమును అమృతీకరణ చేసి జలబీజము (=వం)తో ఆ శరీరమును జీవింపచెయ్యాలి. దానిని పృధ్వీ బీజముతో స్థిరము చెయ్యాలి. ఆ తర్వాత దేహమునందు న్యాసము చెయ్యాలి. కరశుద్ధి చేసిన తర్వాత చతురాసన దేవతల రెండు పాదములు, రెండు జంఘములు, రెండు జానువులు, మూలాధారము నందు న్యాసము చెయ్యాలి. మధ్యమ, అనామికలతో శిరస్సునందు న్యాసము చెయ్యాలి. అంగుష్ఠముతో శిఖను, దశఅంగుళీకములతో కవచ న్యాసము, తర్జనీ, మధ్యమలతో అస్త్ర న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత ఆత్మరక్షాకరీ విద్యను రెండుసార్లు ఉచ్చరించి శరీర సిద్ధికొరకు వ్యాపక న్యాసం చెయ్యాలి.

      ఇప్పుడు ఉత్తమ శ్రీవిద్యా న్యాసము చెప్పబడుచున్నది. అరుణప్రభలు కలిగే శ్రీవిద్యను బ్రహ్మరంధ్రము నందు ధ్యానించాలి. 16 వర్ణములు మహాసౌభాగ్యదాయిని ఆ విద్య అమృత శ్రవణము చేయును. ఆ తర్వత ఎడమ అంసమున సౌభాగ్యదండినీ ముద్రను చూపించాలి. శత్రువుల జిహ్వను పట్టుకొనే ముద్రను పాదముల మూలమున చూపించాలి. నేనే త్రైలోక్య కర్తను – అని భావించుచూ మస్తకమున న్యాసము చెయ్యాలి. శరీరమున సంపూర్ణ విద్యను వేష్టితము చెయ్యాలి. అనగా వ్యాపక న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత యోనిముద్రను ముఖమున ఉంచి ప్రణామము చెయ్యాలి. న్యాసము ద్వారా పూర్ణ ఆబద్ధ శరీరముగల సాధకుడు  త్రైలోక్యమును శీఘ్రముగా క్షోభించగలడు. పిడికిలి బిగించి తర్జనీని దండినీగా చేసి మంత్రమును ఉచ్చరించాలి. సౌభాగ్యదండినీ ముద్ర అను ఈ ముద్ర శత్రువులను ఒక్క క్షణంలో దండించుతుంది. అంగుష్ఠను పిడికిలిలో ఉంచితే అది రిపుజిహ్వాగ్ర ముద్ర అవుతుంది. చేతులను కలిపి తర్జనీ, అనామికలను కలపాలి. ఆ ప్రకారం ఎడమచేతి వేళ్ళను కూడా కలిపి యోని ఆకారంగా చెయ్యాలి. పైన అంగుష్ఠములను కలపాలి. అలా ఏర్పడిన ముద్రను యోని ముద్ర అని అంటారు. ఈ ముద్రతో సాధకుడు త్రైలోక్యమును వశపరచుకోగలగుతాడు.

      అనామికను శిరస్సుమీద నాలుగు వైపులా చుట్టూ తిప్పి బ్రహ్మరంధ్రము మీద ఉంచాలి. ఆ తర్వాత మణిబంధము మీద ఉంచాలి. ఆ తర్వాత అనామికను లలాటము మీద ఉంచాలి. షోడశార్ణమును (=హ్రీం క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం) ధ్యానించాలి. మూడులోకములనూ రక్తవర్ణంగా ధ్యానించాలి. దీనినే సమ్మోహన న్యాసం అంటారు. రెండు పాదములు, రెండు జంఘములు, రెండు జానువులు, రెండు కటిప్రదేశములు, అంధు (=కూప, గుహ్య), పీఠ, నాభి, రెండు పార్శ్వములు, రెండు స్తనములు, రెండు కంధములు, రెండు చెవులు, బ్రహ్మరంధ్రము, ముఖము, గుహ్యప్రదేశము, కర్ణప్రదేశము, కరతలకర పృష్ఠములందు న్యాసము చెయ్యాలి. ఇది సంహార మహాన్యాసము. వీటిని 16 బీజాక్షరములతో చెయ్యాలి. ఆ తర్వాత గోలక అనగా వ్యాపక న్యాసము చెయ్యాలి. ఈ న్యాసములు త్రైలోక్యములను క్షోభింపచేయును.

      ఆ తర్వాత మాతృకా న్యాసము చెయ్యాలి. శిరస్సు, లలాటము, భ్రూమధ్య, కంఠము, హృదయము, నాభి, మూలాధారము, వ్యూహకము (=సర్వాంగము)ల వరకు రహస్త్య యోగినీల న్యాసము చెయ్యాలి. బ్రహ్మరంధ్రము, మస్తంకము నేత్రము, కర్ణము, నాసికా, ఓష్ఠములు, ఊర్ధ్వదంతములు, అధోదంతములు, జిహ్వా, ఉత్తరకర్షక (=?), పృష్ఠ, సర్వాంగ, హృదయ, స్తన, కుక్షి, లింగములందు శ్రీవిద్యా వర్ణములతో సర్వసమృద్ధి కొరకు న్యాసము చెయ్యాలి. క=హృదయము, ముఖము/నోరు, నేత్రము, చెవులు, నాసిక, జిహ్వా, గండములు (చెక్కిళ్లు), పెదవులు, గళపృష్ఠము, రెండు నేత్రములు, ముఖము నందు సౌభాగ్య వర్ణముల న్యాసము చెయ్యాలి. క, సీమంత, లలాట, నుదురు, నాసిక, వక్త్రము, కరసంధి, నఖాగ్రములందు 16 వర్ణములతో న్యాసము చెయ్యాలి. శిరస్సు, లలాటము, హృదయము, ముఖము, జిహ్వా, పాదముల సంధి, పాదముల వ్రేల్ల అగ్రభాగములందు 16 వర్ణములతో న్యాసము చెయ్యాలి.

      లలాటము, గళము, హృదయము, నాభి, మూలాధారాది అయిదు స్థానములు, బ్రహ్మరంధ్రము, ముఖము లందు మూడు వహ్నిబీజముల న్యాసము చెయ్యాలి. మూలాధారము, హృదయము, బ్రహ్మరంధ్రము మూడుబీజములతోనూ, పాదము మరియు హృదయమున కులమును కలిపి అయిదు బీజములతో న్యాసము చెయ్యాలి. మహాసౌభాగ్యము కొరకు వ్యాపకన్యాసము చెయ్యాలి. హృదయమున సంపూర్ణ శ్రీవిద్యతో న్యాసము చెయ్యాలి. ఈ న్యాసము పుష్పములు, అనామికా లేదా మనస్సుతో చెయ్యాలి. ఈ విధంగా శరీర న్యాసములు అయిన తర్వాత ముద్రలను ధరించాలి.

     యోని ముద్రను వేరువేరుగా మూడు ఖండములుగా అనగా రెండు అంగుష్ఠలు, రెండు మధ్యములు, రెండు కనిష్ఠికలుగా చేస్తే అది త్రిఖండ ముద్ర అవుతుంది. ఈ ముద్ర త్రిపురను ఆవాహన చేయుటకు ప్రయుక్తము. అనామిక మరియు కనిష్ఠికలతో రెండు మధ్యములనూ కలపాలి. రెండు అంగుష్ఠములనూ అంజలిలో ఉంచి రెండు తర్జనీలను దండ లాగా తిన్నగా ఉంచితే అది క్షోభినీ ముద్ర అవుతుంది. ఈ ముద్ర ప్రకారం ఉన్న మాధ్యమాలను తర్జనీతో కలిపితే సర్వవిద్రావిణీ ముద్ర అవుతుంది. ఈ ముద్ర ప్రకారం ఉన్న తర్జనీ మరియు మధ్యమాలను అంకుశ ఆకారంలో ఉంచితే అది త్రైలోక్యాకర్షణీ ముద్ర అవుతుంది. రెండు హస్తములనూ ముకుట ఆకారములో చెయ్యాలి. రెండు తర్జనీలనూ అంకుశాకారములో ఉంచాలి. పరస్పర క్రమలో రెండు మధ్యమములనూ వాటి కింద ఉంచాలి. అదే క్రమంలో కనిష్ఠ, అనామికలను జోడించి అంగుష్ఠములను అగ్రభాగమునకు తీసుకువచ్చి అన్ని వ్రేల్లనూ ఘర్షణ చేయగా అది సర్వవశంకరీ ముద్ర అవుతుంది. రెండు చేతులనూ దగ్గరదగ్గరగా చేర్చాలి. మధ్యమా గర్భమున ఉండాలి. రెండు తర్జనీలు బయటన ఉండాయి. అనామికా తిన్నగా ఉండాలి. రెండు అంగుష్ఠలూ దండినీ రూపంలో ఉండాలి. అది సర్వోన్మాదినీ ముద్ర అవుతుంది. పంచ బాణ బీజము ద్రాం. దీనిని పంచ మంత్రము అని అంటారు. రెండు తర్జనీలను మధ్యమతో బాటు మహా అంకుశ ఆకారములో జోడించాలి. అది మహా అంకుశముద్ర అవుతుంది. అంకుశ నామక బీజము క్రోంను ఈ ముద్ర మంత్రముగా చెప్పబడినది.

      ఎడమ మరియు కుడి చేతుల నుండి కుడి చేతిని ఎడమ చేతిలో ఉంచాలి. రెండు కనిష్ఠికలను, రెండు అనామికలను మాధ్యమా వెనకన పెట్టాలి. రెండు తర్జనీలను మాధ్యమతో కలిపి ఉంచాలి. అంగుష్ఠలను తిన్నగా ఉంచి కనిష్ఠికతో కలపాలి. ఇది త్రైలోక్యక్షోభకారిణీ ఖేచరీ ముద్ర. దీని మంత్రము హ్స్ఖ్ఫ్రేం. రెండు హస్తములనూ అర్ధచంద్రాకారముగా చేసి తర్జనీ, అంగుష్ఠలను ఒకేసారి కిందకు తీసుకొని రావాలి. కనిష్ఠ, మధ్యమలను మరింత కిందకు తెచ్చి అనామికలను కొంచెం వంకరగా కిందకు పెట్టాలి. దీనిని బీజ ముద్రా అని అంటారు. దీని మంత్రము హ్సౌం. యోనిముద్రను ఇంతకు ముందే వివరించబడినది. దీని మంత్రము వాగ్భవ బీజము. అందువలననే దీనిని విశ్వమాతగా చెబుతారు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన యజనన్యాసముద్రావివరణం అను యాభైఏడవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: