యాభైనాల్గవ భాగము
త్రిపురసుందరీవిధివివరణం
ఒక సర్వాత్మక శక్తి జాగ్రత్ అవస్థలో ఉండి శక్తిరూపమై సంసారత్రయ సృష్టిని చేస్తుంది. ఉత్పత్తి, జాగరణ, బోధ, మనః వ్యావృత్తి అను నాలుగు కళలు జాగ్రత్ అవస్థలో ఎల్లప్పుడూ ఉంటాయి. ఈమెనే త్రిపురా అని కూడా అంటారు. ఈ త్రిపుర తమస్సుతో యుక్తమైతే అప్పుడు శివరూప అని అంటారు. మరణ, విస్మృతి, మూర్ఛ, నిద్రా ఇవి సుషుప్తి కళలు. సుషుప్తి శివ స్వరూపిణి. ఎప్పుడైతే ఈ దేవి ద్వంద్వాత్మిక అవుతుందో అప్పుడు రజోరూప ఉభయాత్మిక అవుతుంది. సత్త్వ, తమముల సంయోగమును రజస్సు అంటారు. సుషుప్తి అంతములో అనగా జాగ్రత్ ఆదికాలంలో రజోమయి స్వప్నావస్థ ఉంటుంది. ఇందులో అభిలాషా, భ్రమ, చింతా మరియు చిత్తము యొక్క స్ఫురణ ఉంటుంది.
ఎప్పుడైతే
అన్ని అవస్థలూ లయమైపోతాయో అప్పుడు చతుర్థ అవస్థ ఉంటుంది. ఇదే పరమ కలా. దీనినే
భావాభావవినిర్ముక్తా లేదా గుణాతీతా అని అంటారు. వైరాగ్యము, మోక్షేచ్ఛ, శమాదుల ద్వారా మనస్సు నిర్మలత పొందడం, సత్-అసత్ వస్తువుల నిశ్చయము – ఇవి
తురీయావస్థ యొక్క కలలు. ఈ తురీయావస్థనే 17వ కలగా చెబుతారు. ఏ విధంగా మామిడి, అరటికాయలు పరిపక్వము చెంది మధుర రసములు
అవుతాయో ఆవిధంగానే ఈ తురీయావస్థ పరిపక్వము చెంది 17వ కలగా రూపొందుతుంది. ఏ
వర్ణములను ఉచ్చరించగలమో ఆ వర్ణములను వాచికములు అని అంటారు. వస్తువును ఉచ్చారహితంగా
మనస్సుతో చింతన చెయ్యాలి. చింతన వలన సమరస భావన కలిగి సాక్షాత్ కేవల బ్రహ్మము యొక్క
అనుభూతి అవుతుంది. శ్రీవిద్యా మంత్రములో 16 కళలు ఉంటాయి. ఏ విధంగా అగ్ని నుండి
మెరుపులు వస్తాయో ఆ విధంగా శ్రీవిద్యా వర్ణముల నుండి మహామంత్రము పుడుతుంది. ఆ
విధంగా వాగ్భవ బీజము ఐం నుండి మాతృకా విద్యా (అ-క్ష) పుడుతాయి. అందువలననే ఈ
విద్యకు ఐం ను బీజముగా చెబుతారు. ఆ వాఙ్మయము నుండి ఈ చరాచరాత్మక త్రైలోక్యను
ఎప్పుడైతే శక్తి మొహంలో పడవేస్తుందో అప్పుడు బీజరూపిణీ దేవి కామేశ్వరి
పురుష-స్త్రీ రూపంగా విశ్వమాతగా స్ఫురించుతుంది.
దేవి
మహామోహము ద్వారా మూడు జగత్తులను నిష్క్రియం చేస్తుంది. అందువలననే రూపమును కీలకముగా
చెప్పబడేను. దీనితో ఈమె సౌభాగ్యగర్వితా అవుతుంది. ఎప్పుడు సంపూర్ణ జగత్తును
పాలిస్తుందో అప్పుడో శక్తి అని అంటారు. ఈమె మూడులోకములందు మహాసమ్రాజ్యదాయిని, లక్ష్మీమయి రూపంలో ప్రసిద్ధమవుతున్నది.
ఈమె మహాకోశేశ్వరీ సమూహంతో కలిసిఉండును. ఈమె పరాదేవీ కోశముతో సంపన్నమై కోరికలను నెరవేర్చును.
అ-క-థాది మహాపీఠ, హ-క్ష వర్ణస్వరూపిణి
అయినప్పుడు కల్పలతా, వాక్ జ్ఞాన రూప కలా
అవుతుంది. సౌభాగ్యదాయినీ ఈ నిత్య రత్నతేజముతో విభూషితమురాలు. జీవులను
అనుగ్రహించడానికి సృష్టి చేసి విశ్వమాతగా ప్రకటించబడుచున్నది. చతురామ్నాయముల
ద్వారా పూజించబడు ఈమెను వేదములు కూడా నమస్కరించును. ఆ సమయంలో దేవి ఆమ్నాయసహిత
భువనానంద మందిర స్వామిని అవుతుంది. అనగా ఆమె యోని యందు సమస్త భువనములు
సమాహితమవుతాయి. ఇందువలననే ఈమె త్రైలోక్య సామ్రాజ్యమును ఇచ్చునది. వీటన్నింటినీ
దగ్గర ఉంచుకొని త్రిపుర,
శివ ప్రపంచ మధ్యమున విరాజమానులవుతున్నారు. ఈమె 16 వర్ణముల విద్య మరియు 16 నిత్యల
స్వరూపము.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు
విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు,
శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల
ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ
శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన
అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన త్రిపురసుందరీవిధివివరణం
అను యాభైనాల్గవ భాగము సమాప్తము.
యాభైఅయిదవ భాగము
త్రిపురాపూజావిధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు –
ప్రాతఃకాలముననే నిద్రలేచి సహస్రారములో
శ్వేతకమలమును ధ్యానించాలి. ఆ కమలముమీద కర్పూర సమానమైన నిజ గురువును స్మరించాలి.
అతను సుప్రసన్న, ప్రకాశించు ఆభూషణములతో
అలంకరించబడి, తనశక్తితో కూడి, వరద-అభయ ముద్రలను చూపుతూ ఉండును.
అతనికి నమస్కరించి “హ్స్రోం హసక్షమలవయరాం హసక్షమలవయరీం హసక్షమలవయరూం హ్రీం పావక
సర్వారాధ్య సర్వమూర్ధపురనాథ సర్వగురు స్వయం గురుశ్రీగురునాథ రహసక్షమలవయరూం హ్స్రౌం
హసక్షమలవయరూం హ్స్రోం హసక్షమలవయరీం హసక్షమలవయరాం శ్రీ శంభు గురు హ్స్రౌం
హసక్షమలవయరూం హ్స్రోం హసక్షమలవయరీం”
అను మంత్రంతో ధ్యానించాలి.
మూలాధారము నుండి సహస్రారము
వరకు విద్యుల్లతకు సమానమైనవటువంటి,
ఉదయించు సూర్యుడి ప్రభలు కలిగినటువంటి దేవిని అశుభ శాంతి కొరకు ధ్యానించాలి. ఆ
తర్వాత “క్లీం సర్వజనప్రియాయ నమః” అను మంత్రంతో దంత శుద్ధి చెయ్యాలి. ముఖమును
పసుపు పొడితో నాలుగుసార్లు శుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత శిరస్సు నుండి మొత్తం
శరీరము తడుపునట్లు స్నానము చెయ్యాలి. ఆ తర్వాత ఆత్మ (అం), విద్యా (ఇం), శివతత్త్వ (ఉం) లతో మూడుసార్లు ఆచమనం
చెయ్యాలి. ఆ తర్వాత దేవ,
ఋషి, పితృ తర్పణములు వదలాలి. ఆ
తర్వాత సాధకుడు మంత్రమును ఉచ్చరిస్తూ అలంకారములను ధరించాలి. రక్తవస్త్రములు, రక్త అంగరాగములు ధరించి, రక్తగృహములో రక్తాసనము మీద కూర్చోవాలి.
మూలమంత్రము ద్వారా మూడుసార్లు ఆచమనము చెయ్యాలి. దోసిట్లోకి నీళ్ళు తీసుకొని ఆ
నీటిని ఇడానాడి ద్వారా లోపలికి తీసుకొని హృదయములో నల్లని రంగులో ఉండు పాప
పురుషుడిని ధ్యానం చెయ్యాలి. బ్రహ్మహత్య అతడి శిరస్సు, బంగారం దొంగలిచుట అతని చేతులు, సురాపానము అతని హృదయము, అనేక పాతకములు అతని అంగములు, ఉపపాతకములు అతని రోదనలు. ఈ విధంగా
పాపపురుషుడిని ధ్యానం చెయ్యాలి. ఖడ్గము, డాలు ధరించి ఉండు ఇతడిని సాధకుడు తన మనస్సులో ధ్యానించాలి.
ఆ తర్వాత సాధకుడు భూమి మీద వజ్రశిలను భావించి పాపపురుషుడిని ఆ శీలమీద పడవేసినట్లు
భావించాలి. ఆ తర్వాత మూలమంత్రమును మూడుసార్లు స్మరించి మూడు అర్ఘ్యములు
ఇవ్వాలి. ఆ తర్వాత “హ్రీం నమః స్వాహా
హంసః” అను మంత్రమును ఉచ్చరించాలి.
దేవిని
ఈ విధంగా ధ్యానించాలి.
భాస్వద్రత్నౌఘముకుటాం స్ఫురచ్చంద్రకలాధరాం|
సద్యః సంతప్తహేమాభాం సూర్యమండలరూపిణీం||
పాశాంకుశాభయవరాం స్మేరదను జపేత్తతః|
ఆ తర్వాత దేవీ గాయత్రిని యథాశక్తి జపించాలి.
“ఐం వాగ్భవే విశ్వవిగ్రహే క్లీం కామినీశ్వరి
ధీమహి సౌః తన్నః శక్తిః ప్రచోదయాత్”
పై గాయత్రీ జపము అయ్యిన తర్వాత శ్రీవిద్యా
మంత్రమును జపించాలి.
ఆ తర్వాత, పవిత్రమైనది, రంగురంగుల పువ్వులతో అలంకరించబడినది, ధూపములతో సువాసనలు వెదజల్లునది, దీపమాలలతో రమణీయంగా ఉండునది, ద్వారములను పూలమాలతో అలంకరించబడినది, అక్కడక్కడ పువ్వులు వెదజల్లబడి ఉన్న
రమణీయమైన మండపమును పూజించాలి. “త్రిపురార్చనమండపాయ నమః” అను మండపముతో పూజించాలి.
గణేశ, క్షేత్రపాలక, విధాత, గంగా, యమునా, శంఖనిధి, పద్మనిధీలను అర్చించాలి. చివరలో
వాస్తుపురుషుడిని కూడా అర్చించాలి. ద్వారశ్రీ, గణేశ, సరస్వతీ, దేహళీలను కూడా పూజించాలి. హ్రీం, శ్రీం లను ముందు జోడించాలి. మాతా
పేరుకు చివర శ్రీ, పాదుకాం పూజయామి అని కూడా
జోడించాలి. ఈ క్రమంలో సమస్త మాతలనూ
పూజించాలి.
ఎర్ర
ఆసనము మీద కూర్చొని యంత్రమును నిర్మించాలి. శక్తిపైన విస్తృతశక్తిని ఒకసారి లిఖించాలి.
చివర అగ్నిబీజముతో సంపుటీకరించాలి. అగ్ని, ఈశాన, నైరుతి, వాయవ్య రేఖలను సంధిభేదముతో గీసి కలపగా
పది కోణములు ఏర్పడతాయి. అదేప్రకారం నాలుగు మధ్య కోణములనుండి సంధి ఏర్పడునట్లుగా
రెండు రేఖలను గీయాలి. ఈవిధగా 14 కోణములు ఏర్పడతాయి. లంబ త్రికోణం నేత్రములకు
ఆహ్లాదము కలిగించేటట్ట్లుగా ఉండాలి. ఆ
త్రికోణము సంధి భేదముతో సుందరము మరియు సరళ రేఖలతో యుక్తమై ఉండును. దీనికి బయట ఒక
వృత్తము ద్వారా అష్టదలమును నిర్మించాలి. దానిపైన షోడశదళ పద్మమును కూడా
నిర్మించాలి. దాని బయట మూడు వృత్తములు, దాని బయట భూపురమును లిఖించాలి. ఆ భూపురము నాలుగు
ద్వారములతో సుశోభితము అవ్వాలి. ఆ ద్వారములందు పుష్పములు పెట్టాలి. ఈ యంత్రమును
గండకీ నదిలో ఉత్పన్నమైన రాయిమీద గానీ, బంగారము,
వెండి, రాగి పత్రములమీద గానీ, కాశ్మీరదర్పణము మీద గానీ, భోజపత్రము మీద గానీ, పూజా పీఠము మీదగానీ లిఖించాలి. యంత్రమును
గీసే శలాకా బంగారమునదై ఉండవలెను. కేశరి, కర్పూరము,
సిందూరములను కలిపి ధాతుమయ పత్రము మీద లిఖించాలి. లేదా, భూమి మీద కుంకుమము లేదా సిందూరముతో ఈ
యంత్రమును లిఖించవచ్చు.
ఈ
చక్ర మధ్యన బిందువు సుశోభితము అయ్యి ఉండాలి. బిందువు నుండి త్రికోణము, అష్టకోణము, అంతర్దశారము, బహిర్దశారము, చతుర్దశకోణములు చక్రమునకు మధ్యలో ఉండాలి.
ఈ నలభై భగములు (=శక్తి కోణములు)
మూడు భగములతో యుక్తమవుతాయి. చతుర్దశకోణమునకు బయట అష్టపత్రము, షోడశపత్రము, భూపురము క్రమంగా ఉంటాయి. ఈ భాగాత్మక యంత్రములో నవయోనులు ఉంటాయి.
సాధకుడు పూర్వాభిముఖంగా ఆసనము మీద కూర్చొని తన గురువుకు ప్రణామము చేసి
గురుమంత్రమును స్మరించాలి. సాధకుడు ఎడమకాలి మడమతో భూమిని చరచుచూ, చిటికలు వాయిస్తూ ఆకాశములో
చక్రాకారముగా చేతిని తిప్పుతూ భూమిమీద ఉండే భూతములను ప్రాలద్రోలి, కరశుధ్యాది విద్యలను పాటించాలి.
ఆద్య మరియు ద్వితీయ
వర్ణములను (అం, ఆం?) ‘త్రిపురాయ’ అంతమున లిఖించాలి. ప్రథమ రెండు
అక్షరములు, బిందువు, నాదము మరియు కలాతో యుక్తమై త్రిపుట
అవుతున్నది. ఈ విద్యా తంత్రము త్రిపురేశీకి సమానంగా ఉంటుంది. అన్య ప్రకారముగా
ఉండదు. కరశుద్ధి న్యాసంలో మధ్యమ నుండి ప్రారభించి కరతలం వరకు చెయ్యాలి. ఆ తర్వాత, సుందరీ దేవి కొరకు ఆత్మాసనము ఇవ్వాలి.
త్రిపురేశ్వరీ దేవీయొక్క వాగ్భవబీజమునకు బదులుగా హృల్లేఖా సుందరిని జోడించాలి. ఆ
తర్వాత పురవాసినీ ద్వారా అధిష్టించిన చక్రాసనమును సమర్పించాలి. సాధకుడు శివబీజమును
ముందు ఉంచి త్రిబీజములను తర్వాత ఉంచాలి. ఇది త్రిపురేశీ విద్య. ఈమె పూజ త్రిపురేశీ
క్రమంలో ఉంటుంది. త్రిపురేశీ ముందు హ, స అక్షరములు మళ్ళీ రెండు బీజములు చివరలో ఉంటాయి. శివ బీజము
తర్వాత ‘శ్రీ’, ఆ తర్వాత త్రిపురేశీ ఉండును. ఈమె పూజ
సర్వమంత్రాసనవిధి ప్రకారం చెయ్యాలి. త్రిపురసుందరి అంతిమ వర్ణమును వదలి ‘బ్లూం’ బీజమును జోడించితే సాధ్యసిద్ధాసనస్థిత
మాలినీ దేవి విద్య అవుతుంది. ఈమె తంత్రము త్రిపురేశీ తంత్ర క్రమంలో ఉండును. త్రిపురేశీ
ద్వారా ఆత్మరక్షా చెయ్యాలి. చివర విసర్గ యుక్తమయితే అది సంపత్ప్రద భైరవీ విద్య
అవుతుంది.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు
విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు,
శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల
ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ
శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన
అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన త్రిపురాపూజావిధివివరణం
అను యాభైఅయిదవ భాగము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి