సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, డిసెంబర్ 2022, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 13

 శ్రీచక్రనిర్మాణ ప్రకారము

శ్రీచక్రము మూడు ప్రకారములుగా ఉంటుంది. అవి భూప్రస్తారము, మేరుప్రస్తారము, కైలాసప్రస్తారము. మేరు ప్రస్తారము నిత్యాతాదాత్మికము. కైలాసప్రస్తారము మాతృకాత్మకము. భూప్రస్తారము వశిన్యాత్మకము. మేరుప్రస్తారము నందు పూజ సృష్టిక్రమము నందు, కైలాసప్రస్తారము నందు సంహారక్రమములోను, భూప్రస్తారము నందు స్థితిక్రమములో, కైలాసప్రస్తారము నందు అర్ధమేరుక్రమములో పూజ చెయ్యాలి. ప్రత్యేక చక్రము నందు పూజ మూడు భేదములుగా ఉండును. కౌళమతములో సృష్టి మరియు సంహారక్రములలో రెండింటిలోనూ పూజ జరుగుతుంది. సమయమతము నందు సృష్టి మరియు స్థితి క్రమములలో పూజ జరుగుతుంది. శుద్ధ పూజ అతిరహస్యము. మేరు చక్రము నందు సంహారక్రమములో పూజ జరగదు. అందువలన మేరుప్రస్తారములో జాగ్రత్తగా పూజ చెయ్యాలి. కైలాసప్రస్తారమునందు సంహారక్రమములో పూజ చెయ్యాలి. భూప్రస్తారము నందు స్థితిక్రమంలో పూజ ఉత్తమం అవుతుంది. గృహస్థులు స్థితి క్రమములోను, వానప్రస్థులు మరియు యతులు సంహారక్రమంలోను పూజ చెయ్యాలి. బ్రహ్మచారులు సృష్టి క్రమంలో పూజ చెయ్యాలి.

రుద్రయామళమునందు ఈ విధంగా చెప్పబడినది – యోగులు కుంకుమ మరియు సిందూరములతో యంత్రమును నిర్మించాలి. బంగారం, వెండి, రాగి, స్ఫటిక మరియు ముద్గర యంత్రమును యథోక్త విధిగా పూజించాలి.

తంత్రరాజము నందు ఈ విధంగా చెప్పబడినది – రత్నములు, బంగారము, వెండి, రాగి వీటితో యంత్రమును నిర్మించి స్థాపించి పూజ చేస్తే లక్ష్మీ, కాంతి, యశస్సు, పుత్రులు, ధనము, ఆరోగ్యము మొదలగునవి ప్రాప్తించును. దక్షిణామూర్తి సంహితననుసరించి గండకీ నది నందు ఉత్పన్నమైన సాలగ్రామము, బంగారము, వెండి, రాగి – వీటితో నిర్మించిన యంత్రమును పూజించాలి.

రత్నసాగరము ప్రకారము, బంగారు శ్రీయంత్రమునకు పూజ జీవితాంతము, వెండి యంత్రమునకు పూజ 22 సంవత్సరములకు, రాగియంత్రమునకు పూజ 12 సంవత్సరములకు భోజపత్రము మీద యంత్రమునకు ఆరు సంవత్సరముల వరకు పూజ చెయ్యవలెను. స్ఫటికముతో నిర్మించిన యంత్రమునకు సర్వదా పూజ చెయ్యవచ్చును. స్ఫటిక శ్రీయంత్ర పూజ వలన సర్వసిద్ధులూ లభించును.

లక్షసాగరము నందు ఈ విధంగా చెప్పబడినది – పదిభాగముల బంగారము, పదహారు భాగముల వెండి, పన్నెండు భాగముల రాగి కలిపి మనోహరమైన పీఠమును తయారుచేసి దాని మీద శ్రీయంత్రమును ఉంచితే శాంతి మరియు పుష్టి కలిగి, శత్రువులందరూ నాశనమవుతారు. అంతే కాకుండా అది ఆయురారోగ్యములను, కాంతి మరియు పుష్టి ప్రసాదించును. పాతాళవాసులకు రేఖాత్మక శ్రీచక్రము, మర్త్యలోకవాసులకు సమ ఊర్ధ్వరేఖాత్మకము, స్వర్గలోకవాసులకు మేరుప్రస్తారము ఉత్తమము. మేరుప్రస్తారము భూపురము నుండి ప్రారంభమై బిందువు వరకు క్రమంగా ఉంటుంది. సమఊర్ధ్వ నవ రేఖలందు ఊర్ధ్వరేఖలు ప్రకీర్తములు. సమాన ఊర్ధ్వరేఖలతో భూప్రస్తారము అవుతుంది.

శ్రీతంత్రరాజము నందు ఈ విధంగా చెప్పబడినది –

చతురస్రము నుండి ప్రారంభించి నవచక్రముల అనుక్రమంలో ఉన్నతోన్నత చక్రము వలన దరిద్రులకు ధనము ప్రాప్తిస్తుంది. మూడేసి క్రమంలో శ్రీ ప్రాప్తిస్తుంది. ఒకటి-రెండు-ఆరు క్రమంలో పూజ వలన శ్రీ మరియు కీర్తి ప్రాప్తిస్తాయి. నవచక్రముల సమరూపము వలన అభీష్టసిద్ధి కలుగుతుంది.

సీసము, కాంస్యము, లోహము మొదలగువానితో నిర్మితమైన ఫలకము మీద, వస్త్రము మీద శ్రీచక్రము స్థాపించరాదు. మోహము చేత గాని, లోభము చేత గాని, అజ్ఞానము చేత గాని ఆ విధంగా చేస్తే ధనము మరియు కులము నిర్మూలమవుతాయని తంత్రరాజమునందు చెప్పబడినది.

వంగ (=తగరము/సత్తు/నూలిచీర), సీస, లోహములతో శ్రీచక్రమును ఎన్నడూ నిర్మించరాదని లక్షసాగరమునందు చెప్పబడినది.

శ్రీచక్రమునకు పూర్వ-పశ్చిమ-ఉత్తర-దక్షిణముల విస్తారము మూడు అంగుళములు ఉండవలెనని కులమూలావతారము నందు చెప్పబడినది.

సౌత్రామణితంత్రము ప్రకారము, శ్రీచక్రము యొక్క సరళరేఖవలన లక్ష్మి ప్రాప్తించును. వక్రరేఖ వలన దరిద్రము కలుగును. బంగారము, వెండి, రాగి చక్రముల విస్తారము మూడు అంగుళములు ఉండవలెను. మాణిక్యాది చక్రముల విస్తారము ఇచ్ఛానుసారము ఉండవచ్చును.

అంగుళీయముల ప్రమాణముతో శ్రీచక్రపీఠమును నిర్మించవచ్చును. ఇక్కడ బిందువు నుండి అష్టారము వరకు సంహారాత్మకము, దశారద్వయము మరియు చతుర్దశారము స్థిత్యాత్మకము. అష్టదళము నుండి భూపురము వరకు సృష్ట్యాత్మకము. ఈ విషయము కపిలపంచరాత్రము నందు చెప్పబడినది.

రుద్రయామాళము ప్రకారము బిందు, త్రికోణ, అష్టార, దశారద్వయ, చతుర్దశార, అష్టదళ, షోడశార, వృత్తత్రయ మరియు భూపురత్రయములతో పరదేవతయొక్క శ్రీచక్రము నిర్మితమవుతుంది.

నాలుగు శివచక్రములు, అయిదు శక్తి చక్రములతో నిర్మితమైన శ్రీచక్రము శివశక్త్యాత్మకమై శివశరీరముగా చెప్పబడునని సుభగోదయము నందు చెప్పబడినది. ఎవరైతే దీనియందు కేసర కల్పన చేస్తారో వారిని యోగినీ సహిత భైరవుడు దండిస్తారని శ్రీభూత భైరవమునందు చెప్పబడినది. ఒక హస్త పరిమాణముగల స్థండిలము నందు సుందర శ్రీచక్రమును నిర్మించాలని స్వచ్ఛంద సంగ్రహమునందు చెప్పబడినది.

తంత్రరాజము ప్రకారము, తొమ్మిది మరియు మూడు హస్తముల పరిమాణముగల శ్రీచక్రము నిర్మించాలి. నిత్యపూజకు ఒక హస్తపరిమాణ స్థండిలము ప్రశస్తము. ఎర్రని చూర్ణముతో భూపురమును నిర్మిస్తే అన్ని విఘ్నములను నాశనము చేస్తుంది మరియు వాంఛిత ఫలములను తీరుస్తుంది. పదిభాగముల బంగారము, పన్నెండు భాగముల రాగి మరియు పదహారు భాగముల వెండితో చేసిన శ్రీచక్రము శుభప్రదము. ఈ త్రిలోహములతో నిర్మితమైన శ్రీచక్రమును పూజిస్తే సౌభాగ్యము మరియు అల్పకాలములోనే అష్టసిద్ధులూ కలుగుతాయి.

పగడము, నీలము, వైడూర్యము, స్ఫటికము, మరకతము, గోమేధికములతో నిర్మితమైన యంత్రమును పూజిస్తే ధనము, పుత్రులు, శ్రీ, యశస్సు లాభములు నిశ్చయంగా కలుగుతాయి. రాగి యంత్రము వలన కాంతి కలుగుతుంది. బంగారు యంత్రము వలన శతృనాశనము కలుగుతుంది. వెండి యంత్రము వలన క్షేమము, స్ఫటికయంత్రము వలన అన్ని సిద్ధులూ కలుగుతాయి. ఖండితమైన, పగిలిన (బీటలు వారిన), భగ్నమైన, భ్రష్టుపట్టిన, దగ్ధమైన, పశువుల చేత స్పర్శించబడిన, దుష్టభూమిలో పడిన, అన్యమంత్రార్చన చేసిన, భ్రష్టుపడిన స్త్రీతో స్పర్శించబడిన యంత్రములందు దేవతాహ్వానము చెయ్యరాదు. యంత్రము దగ్ధమైనా, పగిలినా, దొంగలించబడినా ఒక రోజంతా ఉపవాసము ఉండి ఒక లక్షజపము చేసి హోమము, తర్పణము, మార్జనము యథావిధిగా చెయ్యాలి. భక్తిగా గురువును పూజించి సంతృప్తిపరచాలి. బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి. చక్ర చిహ్నము లుప్తమైనా, ముక్కలు అయినా, దూషితమైనా ఒక లక్షగానీ, పదివేలు గాని జపము చెయ్యాలి. ఎవరి చక్రము విరిగిపోవునో వారికి మృత్యువు నిశ్చయము అయినదని అర్ధము. అందువలన దోషపూరితమైన యంత్రమును తీర్థరాజములందు గానీ, గంగాది నదులలో గానీ, సముద్రములో గానీ వదలిపెట్టాలి. లేనిచో దుఃఖములు కలుగును.

దక్షిణామూర్తి సంహిత ప్రకారము ఎర్రని ఆసనము మీద కూర్చొని యంత్రోద్ధారము చెయ్యాలి.

కేసరితో భోజపత్రము మీద అర్చాపీఠము నిర్మించాలి. లేదా కేసరి, కర్పూర మిశ్రమముతో బంగారు లేఖినితో ధాతువుల ఫలకము మీద యంత్రమును నిర్మించాలి. లేదా సిందూరము లేదా కుంకుమతో భూమి మీద యంత్రము నిర్మించాలి. సర్వార్థ సిద్ధి కొరకు చక్రమును సిందూరముతో అలంకరించాలి. అప్పుడు చక్రములో ఉన్న బిందువు విరాజమానమవుతుంది. ఆ తర్వాత త్రికోణ, అష్టార మొదలగు చక్రములను నిర్మించాలి. శ్రీచక్రములో 43 త్రికోణములు ఉంటాయి. ఆ తర్వాత అష్టదళ, షోడశదళ, భూపురములను నిర్మించాలి. అప్పుడు శ్రీచక్రము నవాత్మికము అవుతుంది.

జ్ఞానార్ణవము నందు ఈ విధంగా చెప్పెను – చక్రము మేరు రూపములో కూడా ఉండును. పృథ్వీ బీజమైన ల కారముతో భూపురము, చంద్ర బీజము సకారముతో షోడశదళము, శివ బీజము హకారముతో అష్టదళపద్మము ఏర్పడతాయి. ఈకారము మహామాయ, చతుర్దశభువనాత్మకము. వీటిని పరాంబ పాలించును. ఈ బీజముతో చతుర్దశారము ఏర్పడుతుంది. ఏ ఒక శక్తి పదిస్థానములలో ఉండి మూడులోకములనూ నిర్మించునో ఆ శక్తిని విశ్వయోని అని అంటారు. ఆమె విష్ణువు యొక్క దశార రూపములో ఏర్పడును. రకారము వ్యాప్తమవడం వలన రెండవ దశారము పది జ్యోతుల రూపంలో ఏర్పడును. అగ్ని తన దశ కళలతో దశ కోణములందు ప్రవర్తకమవును. కకారము మదనశివుని యొక్క ఎనిమిది రూపములు. వీరితో అష్టయోన్యాత్మకము అయిన అష్టారము ఏర్పడుతుంది. అర్ధమాత్రా మూడు గుణముల జనని మరియు భేదరూపములో అవి త్రికోణముగా ఏర్పడును. బిందువు నుండి బైందవ చక్రము ఏర్పడును. కామేశ్వరుడు బిందువు యొక్క విశ్వాధార స్వరూపము. ఇదియే శ్రీవిద్యార్ణవము నుండి ఏర్పడిన శ్రీచక్రము.

పూర్వముఖముగా కూర్చొని శ్రీచక్ర రాజమును నిర్మించాలి. సమతల భూమి మీద సిందూరము లేదా కుంకుమలతో శ్రీచక్రమును నిర్మించాలి. మనోహర సరళరేఖా, సమసంధి భేదములతో శ్రీచక్రమును నిర్మించాలి. బంగారం, వెండి, రాగి, ధాతు లేదా శ్రీకాష్ఠ లేదా ఎర్ర చందన ఫలకముల మీదా కూడా బంగారు లేఖినితో గోరోచనము, కుంకుమ, కస్తూరీ, చందన, కర్పూరమిశ్రమములతో శ్రీచక్రము నిర్మించాలి. ఈశానము నుండి అగ్నికోణము వరకు తిన్నగా ఒక రేఖగీయాలి. ఈ రేఖాంతము నుండి రెండు రేఖలు గీసి పశ్చిమాన్న కలపాలి. దీనితో ఒక శక్తి త్రికోణము ఏర్పడుతుంది. ఈ త్రికోణము తర్వాత మరియొక శక్తి త్రికోణము నిర్మించాలి. దీనితో రెండు శక్తి త్రికోణములు ఏర్పడతాయి. ముందు శక్తి త్రికోణ అగ్రభాగము నుండి వాయవ్యము నుండి నైరుతి వరకు ఒక కోణ గామిని రేఖను సంధి భేదముతో గీయవలెను. దీనితో మరియొక శక్తి త్రికోణము ఏర్పడుతుంది. ఈ శక్తి త్రికోణ అగ్రభాగము నుండి పూర్వగామిని రేఖలను గీసి కలపాగా వహ్ని త్రికోణము ఏర్పడుతుంది. ఈ ప్రకారం మూడు త్రికోణములు ఏర్పడతాయి. పూర్వశక్తి త్రికోణము యొక్క ఈశానము మరియు అగ్ని కోణముల నుండి ప్రశ్చిమం వరకు రేఖలను పెంచాలి. ఆ తర్వాత, వాయవ్య-నైరుతి కోణముల నుండి పాచిమగామిని రేఖలను పొడిగించాలి. శక్తిభేదముల క్రమంలో ఆ రెండు యోనుల (కోణముల) అగ్రభాగము యొక్క పూర్వ-దక్షిణ-ఉత్తర క్రమంలో యోని యొక్క పశ్చిమ దిశా క్రమంలో కోణము యొక్క అగ్ర భాగమున కలిపితే దశారము ఏర్పడుతుంది.

ఈ విధంగానే రెండవ దశారమును నిర్మించాలి. పూర్వ త్రికోణము యొక్క ఈశాన, అగ్ని, కోణాగ్రముల నుండి రేఖలను పొడిగించి పశ్చిమం నందు కలపాలి. వాయు-నైరుతి కోణాగ్రరేఖలను పొడిగించి పశ్చిమాగ్రమున పూర్వదిశాగతముగా కలపాలి. ఏకాగ్ర పూర్వ కోణాగ్ర చుంబినీ రేఖలను నిర్మించాలి. దీనికి దగ్గర్లో రెండు త్రికోణములు ఏర్పడును. దశ కోణములలో నాలుగు కోణములను వదలి కోణాంతము నందు మధ్య రేఖను గీయాలి. దక్షిణ ఉత్తర భాగము నందు ఒక రేఖ గీయాలి. అప్పుడు షట్కోణము నందు సంధిభేద క్రమంలో యోని-వహ్ని సంయుక్తములో చతుర్దశారము ఏర్పడును. కక్షాగత మధ్య రేఖలను కలపాలి. ఆ సరళ రేఖ అతి మనోహరముగా ఉంటుంది. అయిదు శక్తి త్రికోణముల అగ్రభాగములు సాధకునికి ఎదురుగా ఉంటాయి. నాలుగు వహ్ని త్రికోణముల అగ్రభాగములు పూర్వాగ్రమున ఉంటాయి. బిందు త్రికోణమును అష్టారాము యొక్క మధ్య చక్రము అని అంటారు. దశార ద్వయ, చతుర్దశారము బాహ్య మధ్యగతము అవుతుంది. ఆ చక్రము మహా సౌభాగ్యదాయకము అవుతుంది. అది సర్వసామ్రాజ్యదాయకము మరియు అన్ని ఉపద్రవములను నశింపచేయును. అనేక సంపదలనిచ్చును. ఆ చక్రము మహామోక్షదాయకము మరియు వాణీవిలాసకారకము.

పై విధంగా నిర్మించిన చక్రమునకు బాహ్యమున పూర్ణచంద్రుని బోలు మూడు వృత్తములు గీయాలి. వీటికి బయట అష్టదళమును, షోడశదళమును నిర్మించాలి. వీటికి బయట నాలుగు ద్వారముల చతురస్ర భూపురమును నిర్మించాలి. ఇందులో మహాప్రభావంతమైన 64 కోట్ల యోగినులు నివాసముండును. సాధకులకు వీరు అత్యంత మాననీయములు. మాతృకా వర్ణములతో అలంకరించబడిన చతురస్రము సిద్ధి దాయకము. ముక్తా మాణిక్యములతో నిర్మితమైన అతిశయ సుందర విరాజితమైన చక్త్రమును త్రైలోకమోహన చక్రము అని అంటారు. ఈ చక్రము కల్పవృక్షములాగ ఫలప్రదము. షోడశారము పదహారు చంద్రకళల స్వరూపము. దీనిని సర్వాశాపరిపూరక అమృతవర్షము అని అంటారు. అష్టపత్రము మందార పూలరంగులో ఉండును. దీనిని సర్వసంక్షోభణ చక్రం అని అంటారు. ఈ చక్రము సర్వ కామనలనూ తీర్చును. ఈ మూడు చక్రములను కలిపి సృష్టి చక్రమని అంటారు. ఇవి ధన ప్రదాయకములు. పూర్వామ్నాయ దేవతలతో అలంకరింపబడిన ఈ చక్రములు సర్వసిద్ధిదాయకములు. చతుర్దశారము దానిమ్మ పువ్వుల సమాన ప్రభాలు కలిగి ఉంటుంది. ఇది అనంత ఫలదాయకము మరియు సర్వ సౌభాగ్య దాయకము. బహిర్దశారము బంగారు వర్ణములో లేదా సిందూర వర్ణములో ఉంటుంది. ఇది సర్వార్థసాధక చక్రము మరియు మనోవాంఛిత ఫలదాయకము. అంతర్దశార ప్రబహ మందార పువ్వులకు సమానము. ఇది సర్వరక్షాకర చక్రము మరియు మహాజ్ఞానమయము. చతుర్దశారము, బహిర్దశారము, అంతర్దశారములను కలిపి స్థితి చక్రము అని అంటారు. ఇవి అతిశయమైన సుఖమును ఇచ్చును మరియు దక్షిణామ్నాయ ప్రకారముగా పూజ చెయ్యడం వలన యథేప్సిత ఫలదాయకములు అవుతాయి. శ్రీచక్రములోని అష్టకోణముల యొక్క ప్రభ బాలభానుని కిరణముల వలె ఎర్రగా ఉండును. పద్మరాగములలాగా మెరిసే ఈ చక్రము సర్వరోగహర చక్రము. ఈ చక్రము కళల యొక్క ఆలయము. త్రికోణము అన్ని విభూతులకు కారణము. బిందు చక్రము సర్వానందమయము మరియు సదాశివమయము. ఈ చక్రమునకు నాయకుడు సదాశివుడు. ఈ చక్రము సంహార రూపము, బ్రహ్మ మాయము. ఈ చక్రము పశ్చిమామ్నాయముతో సేవించబడును. ఈ చక్రము షఢధ్వములకు వాసము. చక్రదళములతో పదాధ్వము, పత్రముల యొక్క సంధి భేదముల నుండి భువనాధ్వము, మాతృకా రూపమును వర్ణాధ్వము, చక్రము యొక్క ఎనిమిది దిక్కుల సన్నిధియందు వర్గాష్టకముల వాసముగా చెప్పుదురు. షోడశారము కళాత్మకము. అష్టపత్రములో కవర్గము నుండి క్షవర్గము వరకు దిశ-విదిశలుగా ఉండును. క నుండి ఢ వరకు చతుర్దశారములో ఉండును. ణ నుండి భ వరకు వర్ణములు బహిర్దశారములో ఉండును. మ నుండి క్ష వరకు అంతర్దశారములో ఉండును. అష్టారములో వర్గాష్టకములుండును. త్రికోణమునందు అ-క-థ కోణాంతమునందు మరియు హ-క్ష మధ్యలో ఉండును. వీటినిని వర్ణాధ్వ అని అంటారు.ఇది మాతృకా పీఠ రూపము. 36 తత్త్వముల పూర్ణ చక్రము యొక్క మూల రూపము. ఇది పంచసింహాసనతో సమన్వితమైన చక్రపాలన యొక్క కళాధ్వము. ఈమే బాలాసహిత మహాత్రిపుర భైరవి. ఈమె త్రిపుర నుండి అంబికా వరకు మొత్తం చక్రము అంతా వ్యాపించి ఉండును. నిశ్చయము నుండి మంత్రాధ్వము అవుతుంది. ఈ విధంగా షడధ్వలచే నిర్మితమైన విమల శ్రీచక్రమును ధ్యానించాలి.

సుభగోదయము ప్రకారము, భూతలము మీద 96 అంగుళముల చతురస్రమును నిర్మించాలి. 24-24 అంగుళములుగా దానిని నాలుగు భాగములుగా విభజించాలి. అందులోని 6-6-3-4-3 భాగములను చేరపివేయాలి. 12-3-1.4.1, 1, 18, 1.16, 1.3, 1.4.3 భాగముల అంతరము నుండి రేఖాయుగ్మములను 1,12,1 భాగములతో నియోజితము చెయ్యాలి. కేతు, ఊధ్వ 1,1,12 మాన నుండి రవి నుండి చంద్ర, చంద్ర నుండి కేతు, శుక్ర, సోమ, బుధ, రాహు, గురు, మంగళ, కేతు, బుధ, రవి రూపములతో ఆరు చక్రములు ఏర్పడతాయి. ఎనిమిది అంగుళముల పరిమాణముతో బయట మూడు చక్రములను నిర్మించాలి. వీటిలో అష్టదళ, షోడశదళ, భూపురత్రయము ఏర్పడతాయి. భూపుర త్రయములో నాలుగు ద్వారములు ఏర్పరచాలి. ఆ తర్వాత గుణత్రయమైన మూడు వృత్తములు నిర్మించాలి. ఈ చక్రరాజము మహాసౌభాగ్య జనకము మరియు భోగమోక్ష ఫలప్రదాయకము. భూమి మీద సిందూరముతో చక్రమును నిర్మించాలి లేదా బంగారము, వెండి, రాగి మొదలగు పత్రముల మీదా కూడా చక్రమును నిర్మించవచ్చు. ఈ విధానము స్థితిచక్రము అనుసారము చెప్పబడినది. సృష్టి క్రమము ప్రకారము దక్షిణామూర్తి సంహిత మరియు జ్ఞానార్ణవములలో చెప్పబడినది.

తంత్రరాజములో సంహారక్రమము ప్రకారము యంత్రోద్దారము చెప్పబడేను. సమచతురస్రములో వృత్తమును నిర్మించాలి. ఆవృత్తము నందు అడ్డుగా దక్షిణ ఉత్తరములలో తొమ్మిదేసి సూత్రములను నిర్మించాలి. ఆ తొమ్మిది సూత్రములలో పశ్చిమం నుండి మూడవ సూత్రము మరియు ఏడవ సూత్రముల చివర నుండి రెండు వృత్తములను స్పర్శితున్నట్లుగా గీయాలి. ఆ రెండు వృత్తముల సూత్రముల యొక్క నాలుగు అగ్రముల నుండి ప్రాక్-ప్రత్యక్ బ్రహ్మసూత్రము యొక్క ప్రాగాగ్రాంతము, పశ్చిమాగ్రాంత నుండి వ్యత్యాసక్రమములో నాలుగు సూత్రములను నిపాతన చెయ్యాలి. దీని ద్వారా షట్కోణము ఏర్పడును. మూడవ, ఏడవ, ఎనిమిదవ సూత్రముల అగ్రాంతము నుండి ప్రారంభించి తొమ్మిదవ మరియు మొదట అంతరము యొక్క నాలుగు సూత్రములను నిపాతన చెయ్యాలి. మర్మములను అనురూపము చెయ్యాలి. తొమ్మిదవ మరియు మొదట అగ్రముల నుండి ఏడవ మరియు మొదట సూత్రముల వరకు ఎనిమిది మర్మములను భేదిస్తూ నిపాతన చెయ్యాలి. తర్వాత నాలుగు, ఆరు మరియు రెండవ అగ్రముల నుండి ప్రారంభించి ఎనిమిదవ, రెండవ సూత్రముల వరకు నిపాతన చేసి అయిదవ సూత్రము చివర వరకు ద్వితీయ సూత్రము వరకు రెండు సూత్రములు, రెండు మర్మములను కలుపుతూ నిపాతన చెయ్యాలి. మధ్యగత బ్రహ్మసూత్రమును మార్జితము చెయ్యాలి. ఈ విధముగా ఉత్తమ చక్రము నిర్మించబడుతుంది.

దీనికి బాహ్యమున సృష్ట్యాత్మక, పద్మద్వయ, చతుర్ద్వార యుక్త మూడు చతురస్రములను నిర్మించాలి. అది శ్రీలలితా దేవి యొక్క అర్చన క్రమౌ అవుతుంది.

శంకరాచార్యుని అనుసారము నాలుగు శ్రీకంఠములు మరియు అయిదు శివయువతి రూపములోను భిన్నంగా కనపడినప్పటికీ అవి అన్నీ నవశివుల మూలప్రకృతులు మాత్రమే. అవి 44 కోణములు, అష్టదళము, షోడశదళము, మూడువృత్తములు, మూడు భూపురముల రూపములో ఉండును.

నాలుగు శ్రీకంఠ త్రికోణములు ఊర్ధ్వముఖములు. అయిదు శివయువతి త్రికోణములు అధోముఖములు. శివయువతి త్రికోణములను శక్తి త్రికోణములని అంటారు. శ్రీచక్రము నవయోన్యాత్మకము. సమయ మతములో శ్రీచక్ర నిర్మాణము సృష్టి క్రమములో ఉండును. ఇది ప్రకృతి ప్రపంచమునకు మూలకారణము. అందువలననే దీనికి యోని అని నామము. కామికాగమము ప్రకారము రక్తము, మాంసము, మేధ, అస్థి, ధాతువులు శక్తి మూలకములు. మజ్జా, శుక్ర, ప్రాణ, జీవలు శివ మూలకములు. పరాశక్తి ఈశ్వరి పదవ ధాతువు. యోని యొక్క స్థానము బిందువు. అది ఈశ్వరి యొక్క శరీరము.

చరాచర జగత్తు శివశక్త్యాత్మకము. పిండాండములు చారములు. బ్రహ్మాండములు అచరములు. నాలుగు శివచక్రములు, అయిదు శక్తి మూల ప్రకృతులు 44 రూపములలో పరిణితి చెంది ఉండును. ఈ చక్రములో 28 మర్మములు, 24 సంధులు ఉండును. రెండు రేఖల కలయిక వలన సంధి, మూడు రేఖల కలయిక వలన మర్మము ఏర్పడతాయి. అష్టకోణము, చతుర్దశారము, దశారద్వయములలో 28 మర్మములు, 24 సంధులు ఉంటాయని చంద్రజ్ఞాన విద్యలో చెప్పబడినది. బ్రహ్మాండము నుండి ఉత్పన్నమైన పిండాండములో 25 తత్త్వములు ఉంటాయి.

రుద్రయామాళములో ఈ విధంగా చెప్పబడెను – ఆ చక్రము సాధు, మునులకు సమాశ్రితము. ఆ చక్రము దేవ గంధర్వల చేత సేవితము. ఆ చక్రము అగ్నిసోమాత్మకము. మూడు లోకములూ సోమాగ్నిమాయము. సూర్యుడు అగ్నిలో అంతర్భూతుడు. అందువలననే ఈ చక్రమును సూర్యసోమాగ్నిమాయము అని అంటారు. ఈ మూడు ఖండములుగా శ్రీచక్రము ఉంటుంది. బిందువు, త్రికోణము, సోమమయము. అష్టకోణము మిశ్రితము. చతుర్దశారము అగ్న్యాత్మకము. చతురస్రము సూర్యాత్మకము. ఈ చక్రము ఇంద్రాది అష్టవసువులకు మరియు మరుద్గణములకు వాసము. ఈ భూమండలములో ఏది సమృద్ధమో అవి అన్నీ శ్రీత్రిపురా చక్రము యొక్క సేవకులు. చక్రము యొక్క మూడు పురములు సోమ-సూర్య-అగ్ని. మొత్తం చక్రములో మహాలక్ష్మి స్థిరంగా ఉండును. ఆ చక్రమే శివుడు.

భైరవయామళము యొక్క చంద్రజ్ఞానము నందు ఈ విధంగా చెప్పబడినది –

ఈ జ్ఞానము గుహ్యాతిగుహ్యము. ఈ విద్యను ఎవ్వరికీ ఇవ్వరాడు. కళావిద్య పరాశక్తి చక్రాకార రూపములో ఉండును. ఈ చక్రములో ఉండు బిందుస్థానము ఆమె యొక్క నివాసము. ఆమె సదాశివునితో కలసి ఉండును. త్రిపురసుందరి చక్రము బ్రహ్మాండాకారమునందుండును. ఆ చక్రము పంచభూతాత్మకము మరియు తన్మాత్రాత్మకము. ఆ చక్రము ఇంద్రియాత్మకము, మనస్తత్వాత్మకము, మాయాదితత్త్వరూపము, తత్త్వాతీయ బైందవము. బైందవ చక్రము జగత్తు, సృష్టి, స్థితి లయకారములు. ఆమె జ్యోతిరూప. ఆమె దేహము నుండి శివుడు ఉత్పన్నమయ్యేను. ఈమె కిరణములు అనంతములు. అగణితములు. ఆమె యొక్క ఈ కిరణముల వలననే చరాచరజగత్తు భాసిస్తున్నది. చరాచర జగత్తు శివశక్తి రూపము. అదే చిత్-చిత్తము.

ఆమె కిరణములు 360. ఈ వ్యాప్త కిరణములే బ్రహ్మాండములోని సోమసూర్యాగ్నిమయములు. సూర్యుని కిరణములు 1607, చంద్రుని కిరణములు 6300. బ్రహ్మాండ పిండాండములు వీటితో భాసిస్తున్నాయి. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, సంధ్యాకాలంలో అగ్ని కాలమును ప్రకాశింపచేయును. అందువలననే ఈ మూడూ కాలాత్మకములు. వీటి వలన 360 రోజులు ఏర్పడుచున్నవి. మహాదేవుడు ప్రజాపిత. ప్రజాపిత లోకకర్త. మరీచాది ప్రముఖ మునులను సృజించును. వీరు కూడా లోకములను పాలించును. అందువలననే వీరందరూ లోకరక్షకులు. శివుడు హర రూపములో సంహారము, భవరూపములో సృష్టి, మృడ రూపములో రక్షణ చేయును. ఇవన్నీ పరమేశాని చేత నియుక్తమై ఈ చరాచర జగత్తును ప్రాపర్తింపచేయుచుండును. అందువలననే వేదము నందు తమేవ భాంతమనుభాతి సర్వం తస్యభాసా సర్వమిదం విభాతి అని చెప్పబడినది.

ఇది శ్రీవిద్యారణ్యయతి రచించిన శ్రీవిద్యార్ణవతంత్రమునకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన ఎనిమిదవశ్వాస సమాప్తము.

కామెంట్‌లు లేవు: