సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, సెప్టెంబర్ 2022, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 37

 

పంచమీక్రమార్చనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – పంచమీ దేవి రత్నేశ్వరీ వర్ణన ఇప్పుడు చెయ్యబడుచున్నది. ఈ దేవతా మంత్రస్వరూపం ఈ క్రింది విధంగా ఉండును.

ఐం సౌం ఐం క్షం భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జంభే జంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వవాక్చిత్తచక్షుర్ముఖమతిజిహ్వాస్తంభం కురు కురు శీఘ్రం వశ్యం కురుకురు ఐం లం ఠఃఠఃఠఃఠః హుం ఫట్ స్వాహా|

ఈ విద్య110 మంత్రవర్ణములు కలది. ఈ విద్యా న్యాసము 44 పదములతో చెప్పబడినది. సాధకుడు మాతృకల పది పదములతో వక్త్రము, భుజములు, పాదములు, సంధులందు, ఇరవై పదములతో అగ్రభాగమున, తొమ్మిది పదములతో రెండు పార్శ్వముల అంకమున న్యాసము చెయ్యాలి. ఈ విధంగా మాతృకా న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత దేహ సిద్ధి కొరకు ఈ క్రింది విధంగా షడంగ న్యాసం చెయ్యాలి. వార్తాళీ వార్తాళీ – హృదయే| వారాహి వారాహి – శిరసే| వరాహముఖీ వరాహముఖీ – శిఖాయై వషట్| అంధే అంధిని నమః – కవచాయహుం|  రుంధే రుంధిని నమః – నేత్రత్రయాయ వౌషట్|

యంత్రోద్ధారము:

ఈ యంత్రము వలన త్రైలోక్యసమ్మోహనము అవుతుంది. రాగి, వెండి, బంగారం లేదా భోజపత్రము మీద గోరోచనము లేదా కుంకుమ, అగురు, చందనములు లేదా పసుపు లేదా మదిరాలతో మనోహర త్రికోణము, పంచకోణము, షట్కోణము, అష్టదళము, శతదళము లేదా సహస్రదళ కమలము నిర్మించాలి. వీనికి బయట నాలుగు ద్వారముల సుందర భూపురము నిర్మించాలి. ఈ యంత్ర మధ్యన సింహాసనమును పూజించాలి. సమస్త మాతలను వాణీ, భూ బీజములతో (ఐం, లం) పూజించాలి. మధ్యలో స్ఫటికాకారా పీఠమును ధ్యానించాలి. ఆ పీఠములోకి దేవిని ఆహ్వానించి ధ్యానించాలి.

ధ్యానము:

ప్రత్యగ్రారుణసంకాశాం పద్మాసనసుంసంస్థితామ్|

ఇంద్రనీలమహాతేజఃప్రకాశాం విశ్వమాతరం|

రుండంచముండమాలాఢ్యాం నవరత్నాదిభూషితామ్|

అనర్ఘ్యరత్నఘటితముకుటశ్రీవిరాజితాం|

కౌశికాద్ధోరుకాం చారుప్రవాళమణిభూషితామ్|

హలేన ముసలేనాపి వరదేనాభయేనచ|

విరాజితచతుర్బాహుం కపిలాక్షీం సుమధ్యమామ్|

నితంబినీముత్పలాభాం కఠోరఘనసత్కుచాం|

పై విధంగా దేవిని ధ్యానించి గంధ పుష్పాదుల ఉపచారములతో సమస్త కామముల సిద్ధి కొరకు దేవిని పూజించాలి. పురశ్చరణ సిద్ధికొరకు మూలమంత్రమును 7000 జపించాలి. జపంలో పదవవంతు తిలలు మరియు బన్ధూక పుష్పములతో హోమము చెయ్యాలి. లేదా మద్యముతో పసుపు కలిపి లేదా చందనముతో కలిపిన ద్రవ్యములతో హోమము చెయ్యవచ్చు. లాక్షా, అగురు, పురుద్రవ్యము (=పువ్వుల పుప్పొడి), అనేకవిధములైన మాంసములతో హోమము చేసినచో మంత్రసాధకునకు సిద్ధి లభిస్తుంది. ఇందులో సందేహము లేదు.

ఇప్పుడు సిద్ధి కొరకు పూజావిధానము చెప్పబడుచున్నది. ముందుగా అగ్ని, ఈశాన, నైఋతి, వాయవ్య కోణములందు, దిశల మధ్యన అంగరూప ఆవరణములను పూజించాలి. లోపల త్రికోణము యొక్క వామ, దక్షిణ, అగ్రభాగములన జంభిని, స్తంభిని, మోహినిలను సర్వసిద్ధికొరకు పూజించాలి. ఆ తర్వాత పంచకోణములలో అంధిని, రుంధిని, జంభిని, మోహిని, స్తంభినిలను పూజించాలి. షట్కోణములో తూర్పు దిక్కునుండి ఆరంభించి దక్షిణ క్రమంలో బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, మాహేంద్రీ, చాముండాలను పూజించాలి. ఆ విధంగానే షట్కోణములో డాకినీ, శాకినీ, లాకినీ, కాకినీ, రాకినీ, హాకినీలను కూడా పూజించాలి. షట్కోణము యొక్క పార్శ్వములందు క్రోధినీ మరియు స్తంభినీలను పూజించాలి. వీరు సర్వార్థసిద్ధిదాత్రులు. వామపార్శ్వములో హలము మరియు కపాలము ధరించిన క్రోధినీని, దక్షిణపార్శ్వములో ముసలము మరియు బాణము ధరించిన స్తంభినీని పూజించాలి. షట్కోణమునకు దగ్గర చండోచ్చండను పూజించాలి. ఇతడు క్రమంగా నాగ, కపాల, డమరు, త్రిశూలము ధరించి ఉంటాడు. ఈ పంచమీ పుత్రుడు నగ్నంగా ఉండి శిరస్సున నీల జటలతో శోభిల్లుచూ ఉంటాడు. ఆ తర్వాత అష్టదళ కమలముల పత్రములలో వార్తాళ్యాది (వార్తాళి, వారాహి, వరాహముఖి, అంధిని, రుంధిని, జంభిని, మోహిని, స్తంభిని) దేవతలను పూజించాలి. వారికి దగ్గర అష్టమహిషలను కూడా పూజించాలి. వీరు శత్రువులను భూమి మీద పడతోసేటంతటి సమర్ధులు.

ఆ తర్వాత శతదళములో పూజచెయ్యాలి. ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ద్విదస్రములను మొత్తము 33 దేవతలను (11+12+8+2) 33 దళములలో పూజించాలి. మిగిలిన పత్రములలో స్తంభినీ మరియు జృంభినీ సహిత దేవతలను పూజించాలి. శతపత్రముల అగ్రభాగమున మహాసింహమును పూజించాలి. సహస్రపత్రమున ఒక సహస్ర వారాహీలను పూజించాలి. ఆ పత్రములలో అంకుశబీజము (క్రోం) ను లిఖించి వారాహ్యై నమః అని లిఖించాలి. ఈ మంత్రముతో వెయ్యిసార్లు పూజ చెయ్యాలి. భూపురములో వటుకభైరవ, క్షేత్రపాలక, యోగినీ మరియు గణపతులను పూజించాలి. ఆ తర్వాత గంధ, పుష్పాది తృప్తికారీ ద్రవ్యములతో దేవిని పూజించాలి. కామ్యకర్మములలో పసుపుమాల స్తంబనము చేస్తుంది. స్ఫటిక, కమలగడ్డ, రుద్రాక్షాదిమాలలను కూడా ప్రయోగాదులందు ఉపయోగించవచ్చు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన పంచమీక్రమార్చనవిధివివరణం అను ముఫైఏడవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: