సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, ఆగస్టు 2022, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 36

 

ఘటార్గళయంత్రసాధనవివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – హే ప్రియే! బిందు నాద కళతో యుక్తమైన ముఖవృత్తము (ఆ) ను పాశము అని అంటారు. కామ (క), అగ్ని, (ర), తార (ఓం)లతో యుక్తమైన అంకుశమును క్రోం అంటారు. ఈ రెండింటి మధ్య హ్రీం ను చేర్చి సురేశ్వరిని పూజించాలి. మంత్ర స్వరూపము “ఆంహ్రీంక్రోం”. దీనినే ఘాటార్గలోద్దారము అని అంటారు. వృత్తము, రెండు భూపురముల సంయోగముతో అష్టకోణము నిర్మించాలి. ఆ అష్టకోణముల అగ్రభాగమున రేఖలను సాగదీయాలి. అప్పుడు రెండు రేఖలతో ఒక సుందరమైన అర్గళము (=ద్వారము, గడియ) ఏర్పడుతుంది. మొదటి అర్గళము ఎంత పరిమాణంలో ఏర్పడుతుందో మిగతావి కూడా అంతే పరిమాణంలో ఏర్పరచాలి. ఆ తర్వాత చంద్రబింబము వంటి సుందరమైన ఒక బింబమును (వృత్తమును) నిర్మించాలి. మళ్ళీ రేఖలను సాగదీసి ఉత్తమ వృత్తమును నిర్మించి క్రమంగా రెండు అష్టకోష్టములను నిర్మించాలి. ఇది ఎలా చేయాలంటే 16 కేసరములు స్పష్టంగా కనిపించాలి. దీని అగ్రభాగము ఎంత సుందరముగా ఏర్పరచగలమో అంత సుందరముగా దానిని ఏర్పరచాలి. ఇది త్రిలోకములను ఆకర్షించబడును.

శక్తిబీజము (=హ్రీం), సాధ్యుని పేరు, సాధకుని పేరు – వీటిని పాశ (=ఆం) అంకుశ (క్రోం), రెండు మహాబీజములతో (=క్ష్రూం)లతో సంపుటీకరించి పూజించాలి. ఈ బీజములను వృత్తము మధ్య కర్ణికలో లిఖించాలి. ఆ తర్వాత ఎనిమిది దళముళలో క్రమంగా షడంగములను లిఖించాలి. వాటితో బాటు అగ్ని, ఈశాన, నైఋతి మరియు వాయవ్య కోణములందు హృదయము నుండి కవచము వరకు లిఖించాలి. మధ్యలో నేత్రత్రయమును లిఖించాలి. నాలుగు దిశలు మరియు నాలుగు కోణములందు అస్త్రమును నాలుగు సార్లు లిఖించాలి. వృత్తము నుండి అష్టకోణము వరకు ఎవరెవరి సంప్రదాయము ప్రకారము బీజాక్షరములను లిఖించాలి. ఆ తర్వాత శక్తి మరియు అగ్నిలను వదలిపెట్టి పృథ్వీ బీజము (లం) ను లిఖించాలి. ఋ, ఋ(2),, ఌ(2) లతో తప్ప మిగిలిన స్వరములతో యుక్తము చెయ్యాలి. ఈ ప్రకారం 12 స్వరములతో యుక్తమైన పృథ్వీ బీజమును నాలుగు భాగములగా చేసి మొదటి త్రికమును తూర్పు - ఉత్తరం వైపు, రెండవ త్రికమును తూర్పు – దక్షిణం వైపు, మూడవ త్రికమును పశ్చిమం – దక్షిణం వైపు, చతుర్థ త్రికమును పశ్చిమం – ఉత్తరం వైపు లిఖించాలి.

అర్కబీజము (=సః) ను వదలి, వాయు బీజము (యం) ను జోడించాలి. పూర్వదిక్కున మూడు అగ్ని అర్గళములను (=రం రం రం) రాయాలి. అదే ప్రకారం పశ్చిమం వైపున కూడా మూడు అగ్ని అర్గళములను, మూడు వాయు అర్గళములను లిఖించాలి. సమస్త కార్యముల సిద్ధికొరకు పూర్వదిక్కున కూడా మూడు వాయు అర్గళములను లిఖించాలి.

హే దేవీ! ఇప్పుడు ఘంటార్గళమును చెబుతాను.

వాయు బీజమును వదలి అర్క బీజము (సః), వరుణ బీజము (వం) లను లిఖించాలి. ఈ బీజ సముదాయమును సంప్రదాయము ప్రకారము రాయాలి. శక్తి, అగ్ని బీజములను వదలి భూ బీజమును లిఖించాలి. ఈ భూబీజమును ఋ, ఋ(2),, ఌ(2) లతో తప్ప మిగిలిన స్వరములతో యుక్తము చెయ్యాలి. ఈ విధంగా 12 రూపములు అవుతాయి (=లం, లాం, లిం, లీం, లుం, లూం, లేం, లైం, లోం, లౌం, లం, లః). మొదటి త్రికమును తూర్పు వైపు లిఖించాలి. రెండవ త్రికమును దక్షిణం నుండి తూర్పువైపు, మూడవ త్రికమును దక్షిణం దిక్కున, నాల్గవ త్రికమును పశ్చిమం నుండి ఉత్తరం వైపు లిఖించాలి.

     పృథివీ బీజమును వదలి వాయు బీజమును లిఖించాలి. అగ్ని (=ర), ఈశాన (=అం), అనార్య (=క్షం) ఈ మూడింటితో బాటుగా ఇంతకు ముందులాగే మొదట మూడు వాయు బీజములను తూర్పువైపు లిఖించాలి. రెండవ కూటమును పశ్చిమం వైపు లిఖించాలి. ఉత్తర అర్గళను పశ్చిమం వైపునుండి మొదలుపెట్టి రాయాలి. నాల్గవ త్రికమును తూర్పువైపునుండి మొదలు పెట్టి రాయాలి. వీర (=వాయు) బీజమును వదలి ఆ 12 కోణములందు రేఫను లిఖించాలి. రాక్షస (నైఋతి) దిశలో ప్రథమ అర్గళమును లిఖించాలి. రెండవ త్రికమును దక్షిణం నుండి ఉత్తరం వైపు రాయాలి. ఆ తర్వాత ఈశాన కోణములో లిఖించాలి. ముందు ఉత్తరము నుండి ఆ తర్వాత దక్షిణంలో లిఖించాలి. కేసర అష్టకోణములలో పాశ (=ఆం), శ్రీ (=శ్రీం), తురగ (=ఫట్), ఈశానీ (=ఈం), నాలుగు కామబీజములు (కం) లిఖించాలి. ఈ ఎనిమిది బీజములను విపరీత క్రమంలో రాయాలి. అంత్య పాశమును వదలిపెట్టి సృణి (=క్రోం)ను జోడించాలి. ఈ కేసర అష్టకోణములకు బయట ఉన్న అష్టకోణములలో క్రమంగా పై ఎనిమిది బీజములను లిఖించాలి. కామినీ చివర రంజనీ (=అం) ఉండాలి. ఆ తర్వాత అగ్నివల్లభ ఉండాలి. మళ్ళీ కేసరములలో పై ఎనిమిది వర్ణములను లిఖించి చివ్ర కోష్ఠములో చండకాత్యాయనీ శక్తి” మరియు “గౌరి” అని లిఖించి “రుద్రదయితే” అని లిఖించాలి. మళ్ళీ యోగేశ్వరి అని లిఖించి కవచ (హుం), అస్త్ర (=ఫట్), అగ్నివల్లభ లిఖించాలి. దీనిని చండకాత్యాయనీ విద్య అని అంటారు.

     ఆ తర్వాత హంస పదమును ఈంతో జోడించాలి. మళ్ళీ హంస పదమును లిఖించాలి. ఈ ప్రకారం పంచ వర్ణముల మంత్రమును లిఖించాలి. (మంత్ర స్వరూపము – హంసః ఈం హం సః). యం యం వర్ణముల మధ్యలో ఈ మంత్రమును ఉంచితే సప్తవర్ణ మంత్రము అవుతుంది. వీటికి ఓం జోడించితే అష్టవర్ణ మంత్రము అవుతుంది. (మంత్ర స్వరూపము – ఓం యంహంసఃఈంహంసఃయం). యంత్రము బయట అతిసుందర అష్టదళ కమలము నిర్మించాలి. అష్టదళములలో కర్ణికా మంత్రము మూడు వరసలలో లిఖించాలి. పాశ(=ఆం), అంకుశము (=క్రోం) లను వృత్తాకారముగా దాని చుట్టూ రాయాలి. దాని బయట అనులోమ క్రమంలో మాతృకలను చుట్టూ రాయాలి. మళ్ళీ అదే ప్రకారం విలోమ క్రమలో మాతృకలను చుట్టూ రాయాలి. మళ్ళీ, వీటన్నిటినీ మహా ఠకారముతో చుట్టాలి. ఈ విధంగా నిర్మించిన ఘటార్గళ మహాయంత్రము చతుర్విధ పురుషార్థ ప్రదాయకము. ఈ యంత్రములో దేవిని ఆహ్వానించి ఉపచారములతో పూజించాలి. పూజకు ముందు తర్వాత దేవీ అంగన్యాస, కరన్యాసములు చెయ్యాలి. సాధకుడు కూర్చొని ఆనందరూపిణీ దేవీని ధ్యానించి, ఆమె పరివారమును పూజించాలి.

     ప్రథమ ఆవరణమును ఇప్పుడు చెప్పబడుచున్నది.  హృల్లేఖ (=హ్రీం) మరియు అయిదు ప్రథమ బీజములను (=ఆం) పూజించాలి. ద్వితీయ ఆవరణములోని ఎనిమిది కోణములలో ముందు చెప్పిన విధంగానే పూజించాలి. ఆ తర్వాత షడ్దళములలో అష్ట మాతలను పూర్వాది క్రమంలో పూజించాలి. దీనికి బయట లోకపాలకులను మరియు ఆద్యాను పూజించాలి. ఈ పూజ మనోహరమైన ఉపచారముల నుండి తాంబూలము సమర్పించు వరకు చెయ్యాలి. మళ్ళీ నియమపూర్వకంగా యథాశక్తి జపము చెయ్యాలి. ఇది నిత్య పూజా విధి.

ఇప్పుడు పురశ్చరణ విధి చెప్పబడుచున్నది. మంత్రమును 12 లక్షలు జపము చెయ్యాలి. ఇందులో దశాంశము హోమము చెయ్యాలి. ఆ హోమము క్షీరవృక్ష సమిధలను త్రిమధురములతోను, తిలలతోనూ చెయ్యాలి. వశీకరణమునకు మల్లెపువ్వులు, సంపదలకు కమలములు, పుష్టి కొరకు పొడలమ్రాను (=కాచు చెట్టు) సమిధలతో హోమము చెయ్యాలి.

     ఏకాక్షరము ఈం లోకూడా భువనము కలదు. వ్యోమబీజము హం నందు కైలాసాదులు ఉన్నాయి. వహ్ని బీజము రం నుండి అనేక సువర్ణాదులు ఉత్పన్న మవుతాయి. చతుర్థ స్వరము ఈం ద్వారా శేషనాగు రూపంలో పాతాళ లోకమును ధరించినది. మహాభూమండలము కూడా దీనిద్వారా ధరించబడుచున్నది. ఈ ప్రకారం ఈమె భువనేశ్వరీ అనబడుచున్నది. హకారములో వ్యోమమున్నది. చతుర్థ స్వరము ఎప్పుడు వివృతమవుతుందో అప్పుడు వాయు బీజము ఉత్పన్నమవుతుంది. రేఫము సాక్షాత్ అగ్నిరూపము. వహ్నిబీజమును వసువు అని తెలుసుకోవాలి. అందువలననే రేఫము కూడా వహ్ని బీజము. బిందువు చంద్రామృతము. ఈ అమృతము మూడు లోకములనూ ఆప్లావితము చేయును. అర్థమాత్రా రూపంలో అది సృష్టిని చేయును. ఇందువలననే ఈమెను భువనేశ్వరి అని అంటారు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన ఘటార్గళయంత్రసాధనవివరణం అను ముఫైఆరవ భాగము సమాప్తము.   

కామెంట్‌లు లేవు: