సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, జులై 2022, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 35

 

భువనేశ్వరీద్వాదశగుణితోద్ధారవివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – హే ప్రియే! ఇప్పుడు త్రిగుణిత యంత్రమునకు మూడురెట్లు ఫలమునిచ్చే యంత్రమును చెబుతాను. దీనిని తెలుసుకున్నంతనే సాధకుడు భువనములకు స్వామి అవుతాడు. ముందు షట్కోణము గీసి ఆ షట్కోణము సంధులను భేదించే విధంగా రెండవ షట్కోణమును గీసినచో ద్వాదశ కోణములు ఏర్పడును. ఆ యంత్ర మధ్యన శక్తిని లిఖించి ఠఃఠః లతో సంపుటీకరించి వాటి బయట విలోమ క్రమంలో వ్యాహృతీలతో వేష్టితము చెయ్యాలి. షట్కోణ సంధులలో ద్వాదశ స్థానములలో భువనేశ్వరీ బీజమును లిఖించాలి. బయట 12 సార్లు శక్తి బంధనము చెయ్యాలి. ద్వాదశకోణములలో హుం ను లిఖించాలి. దానిని పైన బయట కోణములలో సర్వకామసిద్ధి కొరకు బిందు సహిత తురీయ స్వరము ఈం ను లిఖించాలి.

     ఆ తర్వాత 12 కోణముల సంధిబీజములలో ఒకొక్క అంతరాలములో త్రిశూలము నిర్మించాలి. ఆ తర్వాత కోణముల కపోలములందు గాయత్రిని లిఖించాలి. తత్, సవితుర్వ్, ణియం, రే లను వ్యతిరేక క్రమంలో లిఖించాలి. భర్గోదేవస్య ధీమహి ధీయోయోనః ప్రచోదయాత్ – ఈ పదహారు అక్షరములు గుహ్య చివరన చెప్పబడ్డాయి. వేదమాత గాయత్రిని 24 అక్షరములలో తెలుపబడెను. గాయత్రి వర్ణములలో రెండేసి వర్ణములను విపరీత క్రమంలో లిఖించాలి. బయట కోణముల పార్శ్వములందు ఆగ్నేయ మంత్రమును విపరీత క్రమంలో లిఖించాలి. ఆ తర్వాత ప్రణవము, భూః, భువః, స్వః లను లిఖించాలి. జాతవేదః లిఖించి “వహ సర్వ” అని లిఖించి, “కర్మాణి సాధయ స్వాహా” అని లిఖించాలి.

(మంత్ర స్వరూపము: ఓం భూః భువః స్వః ఓం జాతవేదః వహసర్వకర్మాణి సాధయ స్వాహా) – ఈ అగ్ని విద్య దుర్లభము.

హే దేవీ! పై మంత్రమును లిఖించిన తర్వాత సమస్త కార్యసిద్ధి కొరకు మాతృకలను అనులోమ క్రమంలో లిఖించాలి. ఆ తర్వాత భూపుర బీజమండితం లిఖించాలి. దాని చుట్టూ షోడశదళ కమలము నిర్మించాలి.

     హే దేవీ! నిగమాగమ రూపమైన ఆ మందిర పీఠమును 24 దళపత్రములతో నిర్మించి పూజించాలి. దేవిని ఆహ్వానించి అంగపూజ, పరివార పుజ్జ చెయ్యాలి. వర్గ సహితంగా హృల్లేఖాది అయిదు వర్గములనూ పూజించాలి. బ్రహ్మాది ఆరు జోడీలను వేరువేరుగా 12 సార్లు పూజించాలి. కోణములందు పూర్వాదిగా 16 కళలను అనగా అస్త్రములను పూజించాలి.  అవి క్రమముగా కరాళీ, వికరాళీ, ఉమా, సరస్వతీ, దుర్గా, శచీ, సుధా, లక్ష్మీ, శ్రుతి, స్మృతి, ధృతి, శ్రద్ధా, మేధా, కీర్తి, కాంతి, గౌరి.

దళముల అగ్రభాగము మరియు సంధులందు పూర్వాది క్రమంలో ఈ క్రింది దేవతలను పూజించాలి.

శ్రీ, హ్రీం, పుష్టి, ప్రజా, సినీవాలీ, కుహూ, రుద్రా, వీర్యా, ప్రమానందా, పోషణీ, ఋద్ధదా, కాలరాత్రి, మహారాత్రి, భద్రకాళీ, కపాలినీ, వికృతి, నందినీ, ముండనీ, ఇందుఖండనీ, అతిఖండనీ, నిశుంభమథనీ, మహిషమర్దనీ, ఇంద్రాణీ, రుద్రాణీ, పార్వతీ, శరీరిణీ, నారీ, నారాయణీ, త్రిశూలినీ, పాలినీ, అంబికా, హ్లాదినీ – ఈ ముఫైరెండు శక్తి మండలములను తెలుసుకోవాలి. ఈ మండలముల అర్చన తర్వాత 64 మహాశక్తులను అర్చించాలి.

పింగలాక్షీ, విశాలాక్షీ, సంబుద్ధి, వృద్ధి, వసుధా, స్వాహా, శ్రద్ధా, స్కందమాత, చ్యుత, ప్రీతి, విమలా, అమలా, అరుణి, వారుణీ, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్య, మాతా, సనాతనీ, హంసీ, వజ్రికా, వజ్రీ, పరా, వేదాదిమాతృకా (ఋక్ మాతృకా), యజుః మాతృకా, సామ మాతృకా, అథర్వ మాతృకా, భగవతీ, దేవికా, కమలాననా, త్రిముఖి, సప్తముఖీ, దేశికా, వందితా, సురాసురాదిసహితా, మర్దినీ, లంబోష్ఠీ, ఊర్ధ్వకేశీ, బహుశీర్షా, వృకోదరీ, వృద్ధోదరీ, ఆదిరేఖా, శశిరేఖా, గగనవేగా, పవనవేగ, భువనపాలీ, మదనతురా, అనంగా, అనంగమదనా, అనంగమేఖలా, ఆనంగకుసుమా, విశ్వరూపా, భయంకరీ, క్షోభ్యా, మహాక్షోభ్యా, స్త్యవాదినీ, రసతరా, రూపతరా, పరేశ్వరీ, వరదా, వాగీశీ.

సర్వ కామములసిద్ధికొరకు వీరిని ప్రదక్షిణ పూజించాలి. దీని బయట భూపురములో పూజచేసి మళ్ళీ దేవిని పూజించి నైవేద్యము సమర్పించాలి. ఈ ప్రకారంగా నేను దేవతలకు కూడా దుర్లభమైన విషయము నీకు తెలిపాను.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన భువనేశ్వరీద్వాదశగుణితోద్ధారవివరణం అను ముఫైఅయిదవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: