సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, ఆగస్టు 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 01

 1. కూటన్యాసము మరియు అక్షరన్యాసము

స్థితి శ్రీచక్ర న్యాసమునకు విద్యా, చక్రము, చక్రేశ్వరి అంగములు. ముందుగా కరశుద్ధి న్యాసము, ఆత్మరక్షాన్యాసము చేసి శ్రీదేవికి మరియు సాధకునకు భేదము లేదని భావించాలి. తంత్రరాజము నందు ఈ క్రింది విధంగా ధ్యానము చెప్పబడినది.

అరుణాం కరుణా తరంగితాక్షీమ్ ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపామ్|

అణిమాదిభిరావృతామ్ మయూఖైరహమిత్యేవ విభావయే భవానీమ్|

ధ్యానము తర్వాత శ్రీచక్రన్యాసము ప్రారంభించాలి. మూలవిద్యా న్యాసమును కూటాక్షర భేదముతో వ్యస్త-అవ్యస్త రూపంలో యథా క్రమంగా చెయ్యాలి. పంచదశీ యొక్క పదిహేను అక్షరముల న్యాసము మూర్ధా, గుహ్య, హృదయ, దక్ష-వామ-తృతీయ నేత్రా, కర్ణద్వయము, ముఖము, దక్ష-వామ హస్తములు, పీఠము, జానువులు, ఊరువులు, నాభి స్థానములందు చెయ్యాలి.

2. సమస్త విద్యా న్యాసము

మూర్థాది పదిహేను స్థానములందు వేరువేరుగా మూలవిద్యా న్యాసమునకు త్రితారి జోడించి చెయ్యాలి.

3. నవచక్రేశ్వరీ విద్యా న్యాసము

పాదములు, జంఘములు, జానువులు, ఊరువులు, గుదము, పార్శ్వములు, స్ఫిక్, మూలాధార అగ్రభాగము, మూలాధార స్థానములందు నవచక్రేశ్వరీ విద్యా న్యాసము చెయ్యాలి.

4. నవచక్ర న్యాసము

బ్రహ్మరంధ్రము, ఆధారము, స్వాధిష్ఠానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, లంబిక, ఆజ్ఞా, భ్రూమధ్యనుండు బిందుస్థానము లందు ఈ న్యాసము చెయ్యాలి.

5. చక్రేశ్వరీ న్యాసము

మూలమంత్రమును ఉచ్చరిస్తూ త్రిపురా, త్రిపురేశ్వరీ, త్రిపురసుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ, త్రిపురమాలినీ, త్రిపురాసిద్ధా, త్రిపురాంబా, మహాత్రిపురసుందరి న్యాసమును నవచక్రములందు చెయ్యాలి.

6. రక్షాషడంగ న్యాసము

తారాత్రయము "ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః నమః త్రిపురసుందరి మాం రక్ష రక్ష" అని చెప్పి ఈ న్యాసము చెయ్యాలి.

7. షడంగ యువతీ న్యాసము

ఐంక్లీంసౌః బీజములను రెండు ఆ వృత్తములతో షండంగ న్యాసము చెయ్యాలి. షట్ బీజములతో న్యాసమును షడంగ న్యాసమని అంటారు. వాగ్భవ, కామరాజ, శక్తి కూటముల ఆవృత్తముతో షడంగ న్యాసము చెయ్యాలి. దీనిని పంచదశీ మూల షడంగ న్యాసమని అంటారు. సర్వార్థ సిద్ధి కొరకు బాలాబీజ పూర్వకముగా సర్వజ్ఞత, నిత్యతృప్త, అనాదిబోధిని, స్వతంత్రానిత్యా, లుప్తశక్తి, అనంతశక్తి అను షండంగ యువతీ న్యాసము చెయ్యాలి. ప్రత్యేక కూటముతో "శ్రీమహాత్రిపురసుందరీ సర్వజ్ఞతా శక్తిధామ్నే" ఇత్యాదులుగా ముందు చెప్పిన విధంగా చెయ్యాలి.

ఈ న్యాసము మూలవిద్యా ప్రదీపకము. షడంగ యువతీ ధ్యానము:

కుందేందునీలాసితపీతరక్తప్రభా వరాభీతికరాః వరాంగ్యః|

లావణ్యలీలాఖిల యౌవనాఢ్యాః శ్రీదేవదేవ్యాస్తనవో యువత్యః||

8. శ్రీవిద్యాపూర్ణ న్యాసము

జ్ఞానార్ణవము ప్రకారము, భగవాన్ శంకరుడు మహేశ్వరితో ఈ విధంగా పలికాడు. మహేశీ! ఇప్పుడు ఉత్తమమైన శ్రీవిద్యా న్యాసమును చెబుతాను. సావధానంగా విను.

బ్రహ్మరంధ్రము నందు సంపూర్ణ విద్యను అరుణవర్ణంగా ధ్యానించాలి. పదహారు వర్ణముల వలన స్రవించు అమృతమును మహాసౌభాగ్యదగా స్మరణ చెయ్యాలి. వామాంస భాగమునందు సౌభాగ్యదండినీ ముద్రతో అంగుళిని తిప్పాలి. రిపుజిహ్వాగ్రముద్రతో పాదమూలమున న్యాసము చెయ్యాలి. తర్వాత సంపూర్ణ విద్యతో గళమునకు పైన న్యాసము చెయ్యాలి. తర్వాత సంపూర్ణదేవీ విద్యతో వ్యాపక న్యాసము చెయ్యాలి. వ్యాపకము తరువాత యోనిముద్రను ముఖమునకు సమానముగా పెట్టి వందనము చెయ్యాలి. ఈ న్యాసము సౌభాగ్యవర్ధకము.

బ్రహ్మరంధ్రమునందు దేవీ న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత మణిబంధ న్యాసము చెయ్యాలి. లలాటము నందు అనామికను ఉంచి షోడశార్ణమును స్మరించాలి. సమ్మోహన న్యాసము అని పేరుగల ఈ న్యాసము శోభకారకము.

మూడులోకములనూ రక్తవర్ణముగా భావించి శ్రీవిద్యను స్మరించాలి. పాదములు, జంఘములు, జనువులు, కటిభాగము, పీఠము, నాభి, పార్శ్వములు, స్తనములు, బాహువులు, కర్ణములు, బ్రహ్మరంధ్రము, ముఖము, కర్ణప్రదేశములందు క్రమముగా న్యాసము చెయ్యాలి. పదహారు బీజములతో చేసెడి ఈ న్యాసమును సంహారన్యాసమని అంటారు. షోడశవర్ణ శ్రీవిద్యా న్యాసము వలన సాధకుడు విశ్వేశ్వరుడవుతాడు. సృష్టిన్యాసము నందు మాతృకలతో పూర్వము చెప్పబడిన విధముగా న్యాసము చెయ్యాలి.

     షోడశార్ణవమునందు చాలా భేదములు కలవు. ఆద్యా (దుర్గ- తార- త్రిపురసుందరి-కాళీ-భువనేశ్వరి-మూలప్రకృతి) భేదములతో దీక్షితులయినవారు ఈ న్యాసము చెయ్యాలి. ఇక్కడ శ్రీతంత్రరాజ విహిత అర్చాక్రమమును గ్రహించాలి. శంభుదేవుడు పంచదశిని ఉద్ధరించెను. దీని విశేష పూజ ముందు చెప్పబడును. ఈ శ్రీవిద్య యొక్క ముఖ్య ఆమ్నాయము ఋగ్వేదము ప్రారంభమండలము (5-47-4)నందు ఈ విధంగా చెప్పబడినది - "చత్వార ఈం విభ్రతి క్షేమయంతి" - ఋగ్వేదము యొక్క ఈ మంత్రము ప్రసిద్ధమైనది. అధర్వణవేదము యొక్క శౌనకశాఖ ఉపనిషత్తునందు కూడా మూలవిద్యను చెప్పెను. ఇవి అనుసరణీయములు.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: