పరనిష్కళదేవతాసమారాధన విధానం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే మహేశాని! ఇప్పుడు పరనిష్కల దేవతా వర్ణన చెబుతాను. ఈమెను స్మరించినంత మాత్రముననే శరీరము అత్యంత ఆనందదాయకము అవుతుంది.
ఈమె అనుగ్రహమును కురుపించును. బిందు, నాద మరియు కళాత్మకము. ఈ దేవి పరనిష్కల మరియు పరబ్రహ్మస్వరూపిణి. శ్వేత వస్త్రములను, శ్వేతమాలను ధరించి, శ్వేత చందనమును లేపనముగా కలిగిఉండును. జ్ఞానముద్రను ప్రదర్శించుచూ, యోగీపతిసమూహముతో సేవించబడుచూ ఉండును. ఈ దేవతా మంత్రమునకు ఋషి - బ్రహ్మ| ఛందస్సు - గాయత్రి| దేవత - బ్రహ్మ| శక్తి అనగా అం బీజం| మ - కీలకం| ఈమె జ్ఞానరూపిణీ మరియు మోక్ష ఫలదాయకము. ఋ, ఋ(2), ఌ, ఌ(2) ఈ నాలుగు వర్ణములను వదలి అనగా మిగిలిన పద్నాలుగు స్వరములతో ఈ క్రిందివిధంగా షడంగ న్యాసం చెయ్యాలి. అం ఆం అంగుష్ఠాభ్యాం నమః| హృదయాయ నమః|
ఇం ఈం తర్జనీభ్యాం నమః| శిరసే స్వాహా|
ఉం ఊం మాధ్యమాభ్యాం నమః| శిఖాయై వషట్|
ఏం ఐం అనామికాభ్యాం నమః| కవచాయ హుం|
ఓం ఔం కనిష్ఠికాభ్యాం నమః| నేత్రత్రయాయ వౌషట్|
అం అః కరతలకరపృష్ఠాభ్యాం నమః| అస్త్రాయ ఫట్|
త్రికోణ, అష్టదళ, చతుర్ద్వారయుక్త చతురస్ర యంత్రమును నిర్మించాలి. ఈ యంత్రము జ్ఞానప్రదము
అవుతుంది. ఈ యంత్రమును బ్రహ్మరంధ్రమున ధ్యానము చేసి అక్కడే పరమేశ్వరిని ఆహ్వానము
చెయ్యాలి. గంధ, పుష్పాదులతో ఉపచార పూజ చెయ్యాలి. అగ్ని, ఈశాన, నైఋత్య, వాయవ్య
కోణములందు, వీని మధ్యన దిక్కులందు అంగ దేవతలను పూజించాలి.
హకార ఋగ్వేద స్వరూప బ్రహ్మను దేవీ సమీపమున పూజించాలి. సామవేద స్వరూప విష్ణువును
సకారము ద్వారా దేవీ దక్షభాగమున పూజించాలి. అంతిమ కోణమున శివుడిని పూజించాలి.
నాలుగు దిక్కులందు
ఆత్మ, పరాత్మా, పరమాత్మా మరియు జ్ఞానాత్మలను తూర్పు దిక్కుగా మొదలు పెట్టి పూజించాలి. నాలుగు
విదిక్కులందు నివృత్తి, ప్రతిష్ఠా,
విద్యా, శాంతాలను పూజించాలి. ఆ తర్వాత బ్రహ్మాదులను
అష్టదళమునందు పూజించాలి. ఆ తర్వాత చతుష్కోణము నందు ఇంద్రాది లోకపాలకులను పూర్వాది
క్రమంలో పూజించాలి. గంధ, పుష్పాదులు మరియు నైవేద్య
తర్పణములతో వారిని సంతుష్టులను చెయ్యాలి. ఈ విధంగా చెయ్యడం వలన మంత్ర సాధకుడు
బ్రహ్మరూపమవుతాడు. మోక్షము అతడి చేతుల్లోకి వస్తుంది.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు
(సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్
వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి
శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి
తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన పరనిష్కళదేవతాసమారాధన విధానం అను ఆరవ భాగము
సమాప్తము.
3 కామెంట్లు:
శ్రీగురుభ్యోం నమః 🙏
ఆత్మ ,పరాత్మ, పరమాత్మ, మరియు జ్ఞానాత్మ ల భేధమేమి? వివరించ వలసింది గా కోరుతున్నాను🙏 తెలుపగలరు.
ధన్యవాదములు గురువుగారు 🙏
ఆత్మ అనగా మనసు, బుద్ధి అని అర్థం.
పరమాత్మ అనగా కార్యకారణాలకంటే భిన్నమై, క్షరాక్షరాల కంటే కూడావేరుదై, స్వాభావికంగా నిత్యమై, శుద్ధమై, బుద్ధమై, ముక్తమైన పదార్థం.
జ్ఞానాత్మ అనగా ఏది తెలుసుకున్న తర్వాత మరిక తెలుసుకోవడానికి ఏదీ లేదో ఆ జ్ఞానమును తెలుసుకున్న ఆత్మ.
జీవాత్మ అనగా ప్రాణి, దేహి, జీవుడు.
పరాత్మ గురించి అవగాహన లేదు. ఎవరైనా చెబుతారేమో చూద్దాం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి