సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, ఏప్రిల్ 2021, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 5

 

అయిదవ భాగము

అష్టాక్షరపరంజ్యోతిర్విద్యా పూజా విధానం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - ఇప్పుడు శ్రీకోశవిద్య యొక్క నాలుగు భేదములను చెబుతాను. దీనిని తెలుసుకోవడం వలన పునర్జన్మ ఉండదు. కోశవిద్యలు 1. శ్రీవిద్యా 2. పరంజ్యోతి 3. పరనిష్కలదేవత 4. అజపా 5. మాతృకా.

మంత్రోద్దారణ: ప్రణవము, పరా బీజం హ్రీం, హంసః, సోహం, స్వాహా| (మంత్ర స్వరూపం: ఓం హ్రీం హంసః సోహం స్వాహా). ఈ మంత్రము వసువర్ణము అనగా ఎనిమిది వర్ణముల మంత్రము. ఈ మంత్రములోని ఓంను చిత్కళగా తెలుసుకోవాలి. మాయా బీజమును వ్యాప్తిస్వరూపిణిగా, హంసఃను సాక్షాత్ ఆత్మస్వరూపిణిగా, ఇందులోని మూడు బిందువులనూ సృష్ఠి, స్థితి, లయాత్మకములుగా భావించాలి. ఈ బిందువులను వేరువేరుగా విచారిస్తే, ప్రథమ బిందువు బ్రహ్మ స్వరూపము మరియు వామాశక్తి. ఇది రజోగుణాత్మికము. ద్వితీయ బిందువు మూడులోకములనూ పాలించు జ్యేష్ఠాశక్తి. ఇది విష్ణు మాయా శక్తి మరియు సత్త్వ గుణాత్మకము. ఈ శక్తినే వైష్ణవ శక్తి అని కూడా అంటారు. మూడవ బిందువు రౌద్రీశక్తి, తమోగుణాత్మకము మరియు సంహార శక్తి.

ఈ మూడు బిందువులూ ఒక్కటే అయినప్పుడు ఒక్కటే శక్తి అవుతుంది. అవి సంఘటితము అయినప్పుడు అది హంసః అవుతుంది. ఇది స్వరూప దర్శనము కలిగిస్తుంది. అప్పుడు అది జ్యోతిర్మయి. మంత్రములోని స్వాహాకారములోని రెండు వర్ణములూ పరమ జ్యోతులు. ఏ సాధకుడు ఈ ప్రకారంగా మంత్రజపము చేస్తాడో అతడు సాక్షాత్ బ్రహ్మ అవుతాడు.

ఈ మంత్ర ఋషి - బ్రహ్మ| ఛందస్సు - గాయత్రి| దేవత - పర జ్యోతిర్మయి గాయత్రి| ఓం - బీజం| హ్రీం - శక్తిః| హంసః సోహం - కీలకం| స్వాహా - హృదయే| సోహం - శిరసే| హంసః - శిఖా| హ్రీం - కవచం| ఓం - నేత్రత్రయాయ| ఓం హ్రీం హంసః సోహం స్వాహా - అస్త్రాయ ఫట్|

జ్ఞానరూపమైన అగ్నియందు మాతృకా వర్ణములతో అనగా యాభై ఆహుతులను మంత్రంతో హోమం చెయ్యాలి. ఈ విధంగా చెయ్యడం వలన ఒక్క క్షణంలోనే సాధకుడు నిర్వాణగామి అవుతాడు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన అష్టాక్షరపరంజ్యోతిర్విద్యా పూజా విధానం అను ఐదవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: