సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, మార్చి 2021, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 3

 త్రిశక్తి మహాలక్ష్మి పూజా విధానం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు -

హే దేవీ! ఇప్పుడు మనుష్యులకు సమస్త సిద్ధులను ప్రసాదించునదైన త్రిశక్తి యజనమును చెప్పుచున్నాను.

శ్రీబీజము - శ్రీం, పరాబీజం - హ్రీం, కామబీజం - క్లీం| ఈ మూడు త్రిశక్తులు. ఇవి మూడు లోకములందు దుర్లభములు. ఈ త్రిశక్తులకు -

ఋషి - బ్రహ్మ| ఛందస్సు - గాయత్రి| దేవత - సర్వసమృద్ధదా దేవి

యంత్ర వర్ణన:

బిందు, త్రికోణ, షట్కోణ, అష్టదళ, త్రివలయ, చతుర్ద్వార భూపుర (చతురస్రము)

ధ్యానం:

నవహేమస్ఫురద్భూభౌ రత్నకుట్టిమమండపే|

మహాకల్పవనాంతఃస్థే రత్నసిహాసనే వరే||

కమలాసనాశోభాఢ్యాం రత్నమంజీరరంజితాం|

స్పురద్రత్నలసన్మౌళిమ్ రత్నకుండలమండితాం||

అనంతరత్నఘటితనానాభూషణభూషితామ్|

దధతీం పద్మయుగళం పాశాంకుశధనుఃశరాన్||

షడ్భుజామిందువదనామ్ దూతీభిః పరివారితాం|

చారుచామరహస్తాభాం రత్నదర్శసుపాణిభిః||

తాంబూలస్వర్ణపాత్రాభిర్భూషాపేటిసుపాణిభిః||

ఆ తర్వాత బంగారు కాంతి వంటి కాంతితో దేదీప్యమానమైన దేవీ మండలములో పూజ చెయ్యాలి. ఉపచారపూజ చేసిన తర్వాత ఆవరణాంగ దేవతలను అర్చించాలి. లక్ష్మి, విష్ణు, పార్వతి, శివ, రతి, కామదేవలను క్రమంగా షట్కోణ అగ్రకోణములందు పూజించాలి. ఆతర్వాత, షట్కోణ పార్శ్వములందు శంఖము, పద్మము అను రెండు నిధులను పూజించాలి. ఆతర్వాత, అష్టదళ పత్రములందు బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మీలను పూజించాలి. ఆతర్వాత, భూపురమునందు ఇంద్రాది అష్టదిక్పాలకులను పూజించాలి. ఈ అంగదేవతలు ఎత్తైన ఆకారము కలవారు, యౌవనముతో ఉన్మత్తము గలవారు, దేవీ పూజ వలన గర్వితులైనవారుగా ఉంటారు. ఆ తర్వాత మంత్రమును నియమ పూర్వకంగా మూడు లక్షలు జపించాలి. ఆ తర్వాత, పలాస (=మోదుగ?) పూలతో జపములో దశాంశము అనగా ముఫైవేలు హోమము చెయ్యాలి. ఈ విధంగా సాధన చేసినవాడు పురశ్చరణ చేసిన ఫలితము కలుగుతుంది.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన త్రిశక్తిమహాలక్ష్మీ పూజావిధి అను మూడవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: