15. హ్రీమతి మాతుశ్రీజగత్ సంకోచవికాసతంత్రదీక్షాయాః|
అక్షరమేక ధ్యాయన్ జగదజ్ఞానస్య జయతి నా జేతా||
తంత్ర దీక్షితుడు హ్రీం అను అమ్మవారి బీజమును ఉపాసించి
అజ్ఞాన జగత్తును జయిస్తాడు. అనగా జ్ఞానవంతుడు అవుతాడని అర్థము. పంచదశీ
మహామంత్రములోని మొదటి కూటములో ఉండు హ్రీం బీజమును సాధన చేయు సాధకుడు మూడు లోకములనూ
జయించిన వాడు అవుతాడు. సాధారణ కంటికి కనిపించు ఈ జగత్తు సాధకుని కంటికి మాత్రము తన
ఉపాస్య దేవతగా కనిపిస్తూ ఉంటుంది. ఆ దేవతే ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహము అను
పంచకృత్యములను చేస్తుంది. ఈ చరాచర జగత్తును ఆ దేవతా రూపంగా దర్శిచడమే సాధకుని అంతిమ లక్ష్యము. ఆ విధంగా దర్శనము
చేయనంత దాకా ఆ సాధకునికి పరిపూర్ణ జ్ఞానము కలగలేదనే అర్ధము.
16. హసితాంగకురస్య
గర్భే విశ్వేద్భవమూలసంమదం దధతి|
సర్వజ్ఞహృదయారమణీ
కామాక్షీజయతి పరమవామాక్షీ||
ఆనందమే జగత్తుకు మూలకారణము. "ఆనందో బ్రహ్మేతివ్యజానాత్| ఆనందాద్ధ్యేవ ఖల్విమాని
భూతాని జాయన్తే|" అని శ్రుతి. శ్రీమాత నవ్వినప్పుడు
జగత్తులు వికసించి దృశ్యమానమవుతాయి. చిరునవ్వు ఆనందానికి,
సంతోషానికి ప్రతీక కదా. కనుక ఆమె ఆనందం వలనే ఈ చరాచర జగత్తులన్నీ పుట్టుతున్నాయని
చెప్పబడినది.
పరమేశ్వరుడు ఈ సృష్టి చెయ్యదలచాడు. తనకు తాను రెండుగా
విడిపోయాడు. ఆ రెండే కామేశ్వరుడు, కామేశ్వరి (కామాక్షి). కొరిన కోరికలు తన కంటి చూపుతో తీర్చునది కామాక్షి. ఆమెకు తెలియనది ఏదీ లేదు.
మొత్తం బ్రహ్మాండములన్నింటినీ తన కుక్షి/హృదయములో ఉంచి నడిపిస్తున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి