సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, జనవరి 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - పరిచయం

 

శ్రీదక్షిణామూర్తి సంహిత

      క్తిఉపాసనను తెలుపుటకు చాలా తంత్ర గ్రంథములు కలవు. వాటిలో శ్రీదక్షిణామూర్తి సంహిత ఒకటి. భగవంతుడు శివుని మరొక రూపమైన దక్షిణామూర్తి మరియు పార్వతి సంవాదములో ఈ తంత్రము సాగుతుంది. తాంత్రిక వాఙ్మయము అత్యంత విశాలము. దక్షిణామూర్తి సంహిత ఆ విశాల వాఙ్మయమునకు ఒక చిన్న కొమ్మ. అరవైఅయిదు భాగములున్న ఈ తంత్రమునందు  శివపార్వతులు విభన్నమైన, నిగూఢమైన ఆధ్యాత్మిక శక్తులను, వారి స్వరూపములను, వారి ఉపాసనా పద్ధతులను చర్చించారు. ఏకాక్షర లక్ష్మి, మహాలక్ష్మి, త్రిశక్తి, సామ్రాజ్యప్రదావిద్యా, అష్టాక్షరపరంజ్యోతివిద్యా, మాతృకా, త్రిపురేశ్వరి, పంచకోశ, లలితా, భైరవి, కల్పలతా, మహావిద్యా, నిత్యాదుల మంత్రములు వారి ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము వినియోగములతో బాటుగా న్యాసవిధి, యంత్ర రచన, ధ్యాన, జప, హోమద్రవ్యములు, హోమవిధి మొదలగునవి శాస్త్రోక్తముగా విశదీకరించబడినవి.

      ఈ తంత్రములో చెప్పబడిన మంత్రములు, యంత్రములు మొదలగునవి పాఠకులకు ఒక సూచన మాత్రమే. వీటిని సాధన చెయ్యదలచినవారు ఈ మార్గంలో నిష్ణాతులైన సద్గురువును ఆశ్రయించి వారిద్వారా వీటిని నేర్చుకొని ఆచరించాలని సవినయంగా తెలియపరచుకొంటున్నాను.

      ఈ గ్రంథములు చాలా పురాతనములు. నాకు లభ్యమైనంత మరియు చేతనైనంత వరకు పైన సూచించిన విషయములను సంస్కృతము మరియు హిందీ భాషలు రాని నేను తెలుగు భాషలో చెప్పుటకు సాహసిస్తున్నాను. ఇందు దొర్లే తప్పులకు నా అజ్ఞానమే కారణమని పాఠకులకు, పండితులకు, ఉపాసకులకు సవినయపూర్వకంగా నేను విన్నవించుకొంటున్నాను.

      నా గురుదేవులు శ్రీశ్రీశ్రీప్రకాశానందనాథ (శ్రీ శ్రీపాద జగన్నాథస్వామి) గారికి మరియు నా తల్లిదండ్రులకు (శ్రీ ఆయలసోమయాజుల సుబ్బారావు గారు మరియు శ్రీమతి సాయిలీల గారు) సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ ఈ గ్రంథమును ఆరంభిస్తున్నాను.

భువనానందనాథ

(ఆయలసోమయాజుల ఉమామహేశ్వర రవి)

కామెంట్‌లు లేవు: