సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, డిసెంబర్ 2020, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 03

తాంత్రిక సంధ్యావిధి

ఈ క్రింది మంత్రంతో శిఖాబంధనం చెయ్యాలి -

మణిధారిణివజ్రిణిమహాప్రతిసరే రక్ష-రక్ష హుంఫట్స్వాహా

ఆచమనవిధి

కఏఈలహ్రీం - విద్యాతత్త్వాయస్వాహా| హసకహలహ్రీం - శివతత్త్వాయస్వాహా|

సకలహ్రీం - మాయాతత్త్వాయస్వాహా|

ప్రాణాయామము చేసి సంకల్పము చెప్పాలి.

పంచపాత్రజలమునందు శ్రీచక్రమును కల్పించుకోవాలి. అంకుశముద్రతో సూర్యమండలము నుండి తీర్ధమును ఆకర్షించి ఆ జలమునందు ఆవాహన చెయ్యాలి. ఆవాహనాది ముద్రలు చూపించాలి. తర్వాత కుడి చేతిలోకి నీళ్ళుతీసుకొని ఎడమచేతితో కుడిచేతిని మూసి పంచభూతాక్షరములతో క్రమంగా అభిమంత్రించాలి. ఆ జలమును ఎడమ చేతిలోకి తీసుకొని స్వరములతో మూర్ధ్ని స్థానమున మార్జనము చెయ్యాలి. మూర్ధ స్థానమునకు వెనకాల కూడా మార్జనం చెయ్యాలి. ఆ తర్వాత కుడి చేతిలోకి నీళ్ళు తీసుకొని మూలవిద్యా సహితంగా క నుండి మ వరకు స్పర్శవర్ణములతో మంత్రించి ఆ జలమును ఎడమ చేతిలోనికి తీసుకొని ఎడమ చేతినుండి క్రిందవరకు య నుండి క్ష వరకు వర్ణములతో మార్జనము చెయ్యాలి. ఇడ ద్వారా శ్వాసను తీసుకొని కల్మషములను పోగొట్టాలి. పింగళా మార్గము ద్వారా శ్వాసను నల్లరంగుగా భావించి చేతిలోని నీళ్ళలో ఆ శ్వాసను వదలిపెట్టి ఆ నీళ్ళను ఎడమవైపున వదలిపెట్టాలి. తర్వాత చేతులు జలముతో శుద్ధిపరచుకొని ఆచమనం చెయ్యాలి. మళ్ళీ చేతులు కడుక్కొని అంజలిలోకి జలము గ్రహించి గాయత్రిమంత్రంతో సూర్యునికి మూడుసార్లు అర్ఘ్యప్రదానము చెయ్యాలి. ఆ తర్వాత ఆసనము మీద కూర్చోవాలి.

శ్రీచక్రావృత దేవికి విధివిధానంగా తర్పణములు వదలాలి. మూలమంత్రోచ్చారణ సహితంగా ఇరవైఅయిదుసార్లు ఇష్టదేవతకు తర్పణము ఇవ్వాలి. తిరిగి ఆచమనము చేసి గాయత్రీ మంత్రముతో మూడుసార్లు ప్రాణాయామము చెయ్యాలి.

గాయత్రీ మంత్ర ఋషి - బ్రహ్మ| ఛందస్సు - గాయత్రి| దేవత - గాయత్రి| గాయత్రీ మంత్రము యొక్క మూడు పాదములతో షడంగన్యాసము చెయ్యాలి.

ధ్యానమంత్రము:

భాస్వద్రత్నౌఘముకుటస్ఫురచ్చంద్రకళాధరామ్| సద్యః సంతప్త హేమాభాం సూర్య మండల రూపిణీం|| పాశాంకుశాభయవరాన్ధారయంతీం స్మరన్ బుధః||

కులార్ణవమునందు ఈవిధంగా చెప్పబడినది -

ధర్మార్ధకామముల గురించి ప్రాతః సంధ్య చెయ్యాలి. మూలాధార వ,,, స నాలుగు దళముల కమలమునందు ఎర్రని కాంతిగల హ్రీం ను ధ్యానించాలి. సూర్యమండలము నుండి ఉద్భవించిన రక్తయుక్త చతుర్భుజ కుమారిని అగ్నిమండలములో భావించాలి. కుమారి చేతులందు పుస్తకము, మాలా, వర మరియు అభయ ముద్రలుంటాయి. బాలసూర్యుని కాంతిగల అంబగా ధ్యానిస్తూ జపము చెయ్యాలి. (కుమారి = బాలా త్రిపురసుందరి?)

మధ్యాహ్న సమయమునందు అనాహతమునందున్న ద్వాదశదళ పద్మమున ( క నుండి ఠ వరకు) శ్వేతవర్ణ హ్రీం బీజమును ధ్యానించాలి. సూర్యమండల మధ్యన త్రినయన, శుక్ల విగ్రహ, నవయువతి చేతుల్లో శంఖము, చక్రము, గదా, పద్మము ఉన్న జ్యేష్ఠాదేవిని ధ్యానము చేస్తూ మంత్ర జపము చెయ్యాలి.

సాయం సంధ్యాకాలమునందు ద్విదళ(హ-క్ష) భ్రూమధ్య ఆజ్ఞా చక్రమునందు కృష్ణవర్ణ హ్రీం ను ధ్యానించి సోమమండల మధ్యన చతుర్భుజి రౌద్రీదేవిని ధ్యానిస్తూ మంత్రజపం చెయ్యాలి. రౌద్రీ దేవి ఎడమ చేతుల్లో అభయ మరియు త్రిశూలము, కుడి చేతుల్లో కపాలము మరియు తర్జనీ ధరించి ఉంటుంది. మూడు కన్నులు కలిగి చిత్రవిచిత్ర ఆభరణములను ధరించిఉంటుంది.

అష్టబీజములతో బాటుగా వాగ్భవ కూటమును ఉచ్చరించి "వాగీశ్వర్యైవిద్మహే" అని చెప్పాలి. తర్వాత కామకూటమును ఉచ్చరించి "కామేశ్వర్యైధీమహి" అని చెప్పాలి. తర్వాత శక్తికూటమును ఉచ్చరించి "తన్నఃశక్తిప్రచోదయాత్" అని చెప్పి బీజ పంచకమును చెప్పాలి.

పైవిధముగా గాయత్రీ మంత్రము మరియు మూలవిద్యా మంత్ర జపము అయిన తర్వాత గుహ్యాతిగుహ్య మంత్రముతో జప సమర్పణ చెయ్యాలి.

తంత్రాంతరమునందు సంక్షిప్తమైన సాయం, ప్రాతః, మధ్యాహ్న సంధ్యాదేవీ ధ్యానము చేసి మంత్ర వివేచన చేసి జపము చెయ్యాలి.

సంధ్యావశ్యకత

కులార్ణవము నందు ఈవిధంగా చెప్పబడినది -

సంధ్యావందన లోపము చేయరాదని శివుని ఆజ్ఞ. సంధ్యాహీనుడైన దీక్షితుడికి ఫలము లభించదు. కారణాంతరము చేత సంధ్యావందన లోపము జరిగితే పాప నివారణ కోసం పదిసార్లు జపము చెయ్యాలి.

సౌత్రకంటకీ ధ్యానము ఈ విధంగా చెప్పబడినది -

ఆరుముఖములు, పన్నెండుచేతులు, మూడు నేత్రములు కలిగి, కంఠమునుండి శిరస్సుదాక శ్వేతవర్ణముగాను, కంఠమునుండి నడుముదాక పసుపువర్ణముగానూ నడుము నుండి పాదముల వరకు నీల వర్ణముగాను పదహారు సంవత్సరముల వయస్సు కలిగి అన్నిఆభరణములతో శోభిల్లుచుండును. స్వర్ణ, రత్న ప్రభలతో అలంకరింపబడినది. అన్ని పాపములను పోగొట్టునది, ఎర్రని సింహాసనములో శ్వేతకమలము మీద త్రిఖండా మండిత దేవి కూర్చున్నట్లుగా భావించాలి. ఆమె రత్న మకుటము ఉజ్జ్వలముగా ఉండి ఎల్లప్పుడూ దివ్యనాదమును పూరిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండి దక్షిణోదయగామినిగా ఉండును. ఈమె మహాసమయ యాగమునందు నిత్య నిష్కలగామిని.

సంధ్యావందన లోపము వలన కలిగిన మహాపాప నివృత్తికై ఈ క్రింది మంత్రము జపించాలి.

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కఏఈలహ్రీం పరదుష్కరం కర్మచ్ఛేదనకారిణీ అఘోరే వరదేవిచ్ఛే మాయా త్రైలోక్యరూపే సహస్రపరివర్తిని మాతృగణే  హ్స్రూం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం

ఈ మంత్రమును పదిసార్లు జపించి యథావిధిగా మూలమంత్ర జపము చెయ్యాలి.

స్వయం జ్యోతిర్మయరూపునిగా భావించుకొని మూలవిద్యను హృదయమునందు స్మరిస్తూ పూజకొరకు జలమును తీసుకొని యాగమండప ప్రవేశము చెయ్యాలి.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: