సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 05

వర్ణవిభాగము - సృష్ట్యాది మాతృకా న్యాసములు

ఉత్తరతంత్రము ప్రకారము -

కామ్య కర్మములందు సంహారక్రమములో సానుస్వార మాతృకా న్యాసము చెయ్యాలి. పూర్వము చెప్పిన విధముగా ఋష్యాది షడంగ న్యాసములు చెయ్యాలి. సృష్ట్యాది మాతృకా న్యాసము విసర్గయుక్త మాతృకా న్యాసములతో చెయ్యాలి. బిందు, విసర్గ యుక్త స్థితి మాతృకా న్యాసము డ నుండి ప్రారంభము చేసి ఠ వరకు చెయ్యాలి.


శ్రీకులార్ణవము ప్రకారము -  

యతులు, వానప్రస్థులు సంహారక్రమములో మాతృకా న్యాసము చెయ్యాలి. గృహస్థులు స్థితి-సృష్టి క్రమంలో చెయ్యాలి.

మాతృకాన్యాసాంతరక్రమము

ముందు ఓంకారము తర్వాత వర్ణము ఆ తర్వాత నమః - ఉదా: ఓం అం నమః - ఈ విధంగా న్యాసం చెయ్యాలి. దీనికి ఋషి - ప్రజాపిత| ఛందస్సు - గాయత్రి| దేవత - కళారూప సరస్వతి| హ్రస్వ - దీర్ఘ స్వరములకు మధ్యన అంగ నామము చెప్పి షడంగన్యాసము చెయ్యాలి. ఉదా: అం హృదయాయ ఆం నమః - ఈ విధంగా.

యాది ధాతుయుక్త న్యాసము ప్రాణశక్తి ఆత్మమూర్తి నందు చెయ్యాలి. దీనికి ఋషి సాధ్యనారాయణ| ఛందస్సు - గాయత్రి| దేవి-దేవతా లక్ష్మీనారాయణులు| క్లాం, క్లీం మొదలగు షట్ దీర్ఘయుక్త వర్ణములతో షడంగన్యాసము చెయ్యాలి.

రుద్రపూర్వక తార్తీయ హృదంత యాదిధాతు సంయుక్త ప్రాణశక్తి ఆత్మన్యాసము: దీనికి ఋషి - దక్షిణామూర్తి| ఛందస్సు - గాయత్రి| దేవీదేవత - అర్ధనారీశ్వరులు. ప్రత్యేక వర్గములో షడ్ దీర్ఘ తాత్రీయము జోడించి షడంగన్యాసము చెయ్యాలి. ప్రత్యేక మాతృకకు ముందు హ్రీం జోడించాలి. దీనికి ఋషి - శక్తి| ఛందస్సు - గాయత్రి| దేవత - జగత్ ఆదిమాతృకా భువనేశ్వరి| హ్రాం, హ్రీం మొదలగు వర్గములతో షడంగన్యాసము చెయ్యాలి.

శ్రీయుక్త మాతృకలతో న్యాసము - దీనికి ఋషి - భృగు| ఛందస్సు - గాయత్రి| షడ్ దీర్ఘలు శ్రాం, శ్రీం మొదలగు వర్ణములతో షడంగన్యాసము చెయ్యాలి.

క్లీం యుక్త మాతృకలతో న్యాసము: దీనికి ఋషి - సమ్మోహన| ఛందస్సు - గాయత్రి| దేవత - సమ్మోహినీవిశ్వమోహిని| షడ్ దీర్ఘలు క్లాం, క్లీం మొదలగునవి. హ్రీం, శ్రీం, క్లీం వర్ణములతో మాతృకా న్యాసము చెయ్యాలి.

ప్రపంచయాగ నిరూపణము - మంత్రము  

ఇప్పుడు భుక్తి - ముక్తిప్రద ప్రపంచయాగ వర్ణన చెయ్యబడుచున్నది. పంచమంత్రమయ ప్రపంచ యాగము సర్వసిద్ధి సంపత్పదాయకము. అన్నింటికన్నా ముందు ఋషి, ఛందస్సు, దేవతా సహిత మహాగణపతి యొక్క సాంగన్యాసము మరియు సావరణ ధ్యానము చేసి మంత్రమును ఎనిమిది సార్లు జపించాలి. ఋషి, ఛందస్సు, దేవతా సహిత గణపతి బీజము గం ను 40 సార్లు జపించాలి. గణపతి మంత్ర జపము తర్వాత వైదిక మంత్ర జపము చెయ్యాలి. మాలామంత్ర జపము నాలుగు సార్లు చెయ్యాలి. ఆ తర్వాత సఋష్యాది మంత్ర జపము చెయ్యాలి. ఋష్యాది సహితముగా మాతృకాన్యాసమును మూడుసార్లు చెయ్యాలి. స్వరాది ఏడు వర్ణములతో ఏడు గ్రహముల న్యాసము చెయ్యాలి. ముఖము, భుజములు, పాదములు, ఉదరము, హృదయము క్రమముగా న్యాసము చెయ్యాలి.

ప్రపంచయాగ అష్టాక్షరీ మంత్రము: ఓం హ్రీం హంసస్సోహం స్వాహా

ప్రపంచయాగ నిరూపణము

ఈ మంత్రము యొక్క ఋషి - బ్రహ్మ| ఛందస్సు - గాయత్రి| దేవత - మహఃపరిచన్మయ| ఈ మంత్రము వేదాంతమునందు బోధించబడెను. ఇది నిత్య సర్వవ్యాపి, నిరంజనము. సార్ధహరిహరాక్షరముతో కలిపి విలోమ క్రమములో పంచమంత్ర చివర ఓంహ్రీం జోడించి షడంగన్యాసము చెయ్యాలి. ఓంహ్రీం తర్వాత తత్త్వాది క్రమానుసారముగా మంత్రవిశేషమును ఉచ్చరిస్తూ హోమము చెయ్యాలి. ప్రపంచయాగము అను ఈ హోమము సర్వసమృద్ధిదాయకము.

ప్రథమ మంత్రములో అ నుండి స వరకు, ద్వితీయ మంత్రములో ష నుండి హ వరకు, తృతీయ మంత్రములో సాం అను వర్ణములుంటాయి. సాః ఇంద్రియ షట్కామాత్మకము. నాల్గవ మంతము సోహం. బృహత్ప్రయోగము ప్రకారము, దీనికి ఋషి బ్రహ్మ| విద్వాంసులలో పరమపదమును "శ్రేష్ఠీయవాచకులు" అని అంటారు. వారి గానము చేత రక్ష కలుగుతుంది. ఆ గాయత్రిని (గానము - రక్ష) ఛందస్సు అంటారు. ఎవరికైతే మిగతావారికన్నా ఎక్కువ తేజస్సు ఉంటుందో వారిని పరమపాదులు అని అంటారు. వీరి దేవత జ్యోతి. అది స్వర్గము మరియు ఆత్మ రెండింటి గురించి ఉంటుంది. స్వర్గాత్మస్వరూపమునందున్న ఏ తేజము పరంపరా వ్యాప్తమవుతుందో ఆ తేజమును స్వాహా అంటారు. దీనికే ఆహుతిని ప్రాదానము చేస్తారు. తేజ రూపములో ఏదివ్యాప్తమో ఆ శబ్దమును ఆత్మ అంటారు. అప్పుడు ఆ శబ్దము, ఆత్మ ఐక్యము అవుతాయి. సోహం మంత్రంలో హంకారమున అహం ఉంది. అది చిద్రూపము మరియు సర్వార్ధభాసకము. అప్పుడు, సత్యవ్యాప్త నిర్లెప హంస మంత్రమును ఉచ్చరించాలి. అది ఈ చరాచర జగత్తు యొక్క సారము మరియు గుణాత్మకము. అకార, ఉకార, మకార బీజములు గుణాత్మకములు. ఎందులో సత్యభావం ఉంటుందో దానిని ప్రాణవార్ధము అని అంటారు. హృఞ ధాతువు యొక్క ఆరాధము హరణము. అందువలన వీటిమంత్రములను ఇష్టపడరు. ఏదైతే సంహారము చేస్తుందో అది మహః. హరిహర వర్ణము ఓంకారము. ఇది ప్రపంచయాగ, ప్రపంచమంత్రము యొక్క మొదటి కారణము.

ప్రపంచయాగ న్యాస క్రమము 

ఇందు అంగవర్ణ ద్రవ్యముల హోమము రెండు విధములు. యథా పూర్వ విధానములో చెప్పిన విధివిధానముగా మాతృకోక్త స్థానములో ఎనిమిది అక్షరములతో న్యాసము చెయ్యాలి. శుద్ధాత్మసాధకేంద్రులు యాభైవర్ణముల న్యాసము చెయ్యాలి. ఈ అన్ని వర్ణములు బ్రహ్మజ్ఞానేంద్రియాత్మకములు. ప్రత్యేక వర్ణములను గ్రహించి అవి జగత్తునందు వ్యాపిస్తాయి. జగత్తు నందు పరాత్పర జ్యోతి ఉన్నది. ఈ జ్యోతిర్మయ మంత్రముతో సంపూర్ణ హోమము చెయ్యాలి. బ్రహ్మాత్మక హోమద్రవ్యములతో హోమమును బ్రహ్మార్పణం చెయ్యాలి. వర్ణములను భిన్నము చెయ్యడం వలన శిధిలత లభ్యమవుతుంది. మహాసచ్ఛ, సర్వవ్యాప్త, నిరంజన బ్రహ్మాగ్ని యందు ఎవరు హోమము చేస్తారో ఆ సాధకుడు శుద్ధాత్ముడై మహానిధివంతుడవుతాడు. ఏ అధికారి (విధివిధానముగా దీక్ష పొందినవాడు) ధ్యాన-పూజలలో అశేష మంత్రజపము చేస్తాడో అతడికి కూడా ఫలితము లభిస్తుంది. సాధారణ వర్ణములు, సానుస్వార వర్ణములు, కళావర్ణములు, కేశవ వర్ణములు, శ్రీకంఠ వర్ణములకు హ్రీం శ్రీం క్లీం జోడించితే  ప్రపంచయాగ సంయుక్త దశన్యాసములవుతాయి. అన్ని మంత్రములు వాంఛిత ఫలములను ఇచ్చును. వీటి అన్నింటియందు శ్రేష్ఠమైన ప్రపంచయాగము ఉంటుంది. ఆ ప్రపంచయాగము జ్ఞానప్రదాయకము, పుష్టిప్రదము, సర్వసంపత్కారకము. విశేషంగా క్షుద్ర, గ్రహ, ప్రపంచ మరియు అజ్ఞానమును నాశనము చేస్తుంది. ప్రపంచయాగములో ఏ హోమవిధానము కలదో ఏ ద్రవ్యముల వలన ఏ ఫలము ప్రాప్తిస్తుందో ఆ మొత్తం విధివిధానము ఇప్పుడు చెప్పబడుతుంది. ఈ విధానములో ఆవునెయ్యితో హోమము చెయ్యాలి. ప్రత్యేక ఆహుతిని సమర్పించాలి. ప్రపంచయాగమంత్రంతో ఆవునెయ్యితో హోమము సర్వోత్తము. మర్రి, మేడి, రావి, పాపట, పాంకడ్ (=?) సమిధలకు తిల, ఆవాలు, ఆవునెయ్యి కలిపి క్రమంగా హోమం చెయ్యాలి.

కామానుసారము హోమ ద్రవ్యములు

ముందు చెప్పిన ఎనిమిది ద్రవ్యములతోనూ హోమము చెయ్యాలి. విధివిధానముగా పదివేలు లేదా అయిదువేలు హోమము చెయ్యాలి. దీనివలన సాధకుడు కోరుకొను భోగములు లభించి భోగవంతుడవుతాడు మరియు దేహాంతమునందు మునులకు వాంఛితమైన ముక్తి లభిస్తుంది. చోర, శత్రు, గ్రహ, వ్యాధి, సర్ప, రాక్ష జనిత శాంతి గురించి 400 లేదా 200 లేదా 100 సార్లు హోమము చెయ్యాలి. దోష అనుసారమూ హోమసంఖ్య పెంచాలి. భూతావేశము, గృహావేశము, జూర్త్యాదుల వినాశము కొరకు 24000 లేదా 96000 హోమము చెయ్యాలి. శాస్త్రములో చెప్పిన క్రమమునకు విరుద్ధముగా పూజ, హోమము చేస్తే సాధకుని స్మరణ శక్తి నష్టమవుతుంది. ఒకవేళ అలా జరిగినచో అష్టద్రవ్యములతో రెండువేలసార్లు హోమము చేస్తే ఆ నష్టము తొలగపడుతుంది. అంతేకాక, మూర్ఛ, మతిమరుపు, శాపదోషములు తొలగును. వివిధ హోమద్రవ్యములు వాటి ఫలితము ఈ క్రిందన ఇవ్వబడెను.

 ద్రవ్యములు

 ఫలము

త్రిమథురాయుక్త అష్టద్రవ్యములతో ఒక లక్ష హోమము                 

తక్షణ మహా ఐశ్వర్యప్రాప్తి

త్రిమథురలోలిత అష్టద్రవ్యములతో ఒక లక్ష లేదా అరలక్ష హోమము

మూడు సంవత్సరములలో మూడు లోకముల వశము

శుద్ధ తిలలు             

మహాపాప నాశనము

కలువపూలు (ఒక లక్ష)       

మహాలక్ష్మి ప్రాప్తించును

క్షీరాన్నము

పుష్టి వర్ధనము

యవలు (బార్లీ)           

యశస్కరము

జాజిపూలు

సర్వజీవుల వశము

సముద్రపు ఉప్పు

వశీకరణ సిద్ధి

వరిధాన్య అన్నము యొక్క మెత్తని పిండిలో త్రిమధురములను కలిపి సాధ్యదేవత ప్రతిమను తయారు చేసి దానికి చక్కగా పూజ చేసి, స్పర్శిస్తూ ప్రాణప్రతిష్ఠా మంత్రమును 108సార్లు జపము చెయ్యాలి. రాత్రి సమయంలో దాని ముక్కలచేత హోమం చెయ్యాలి.              

ఈ విధముగా ఏడు రాత్రులు హోమము చేస్తే స్త్రీ పురుషులు వశమవుతారు. ఇందులో అనుమానం లేదు.

సముద్రపు ఉప్పుతో చేసిన ప్రతిమ చేత కూడా ఈ ఫలము లభిస్తుంది.

వర్ణౌషధి, పంచగవ్యములు కలిపి ఒక పూర్ణ ఘటములో ఉంచి ఆ ఘటమును ఒక అగ్నిగుండము మీద పెట్టాలి. ఆ ద్రవ్యముతో ప్రాప్తించిన ఘటాగ్ని యందు నేతితో హోమము 108 సార్లు చెయ్యాలి. హోమము వలన వచ్చిన బూడిదను జపము చేసి గ్రహించాలి. దీని వలన సమస్త సిద్ధులూ ప్రాప్తిస్తాయి. ఘట ద్రవ్యమును తినడం వలన గానీ, శరీరమునకు పూసుకొనడం వలన గానీ నుదుటిన తిలకముగా ధరించినా గానీ అన్ని ఉపద్రవములూ నశించును. అంతేగాక భూత, ప్రేత, పిశాచాదులు, విశారోగాలు నాశనమవుతాయి. ఇది సర్వవశ్యకరము మరియు సాధకునకు శ్రీ, సౌభాగ్య, జయ ప్రదాయకము. ఒక వెయ్యిసార్లు హవనము అయిన తర్వాత సాధకుడు తన గురువునకు ఫలార్ధముగా బంగారమును ఇస్తే అది కల్పవృక్షమువలే దేవత ఆ సాధకుని వాంఛితములను నెరవేర్చును. ఈ ప్ర్పంఛాయాగము చేత సాధకుని సర్వాభీష్టములూ నెరవేరును. ఇది మాతృకావిద్యా ఉపాసకులకు, అన్యవిద్యోపాసకులకు కూడా ఫలదాయకము.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: