మాతృకా విధానము
దక్షిణామూర్తి సంహిత
ప్రకారము, ఇప్పుడు లోకమాత మాతృకలను చెబుతాను. అ నుండి క్ష వరకు ఉన్న మాతృకలు
వర్ణదేవతయొక్క అవయములు.
ఉత్తరతంత్రమునందు ఈ
విధముగా చెప్పబడినది - ఇప్పుడు మాతృకా విధానము యావత్తూ చక్కగా చెబుతాను విను. ఈ
విధానము అన్నిదుఃఖములను శమింపచేసి అన్ని జ్ఞానములను ఇచ్చును. దీని ఋషి బ్రహ్మ, ఛందస్సు గాయత్రి, దేవత సరస్వతి. సర్వదేవవందిత
అనిందితాప్రభాయుత సమస్త మాతృకలందు హల - బీజము, స్వరము -
శక్తి, వ్యక్తి - కీలకము.
సిద్ధసార స్వతంత్ర
ప్రకారము -
ఈ క్రింది విధముగా న్యాసము
చెయ్యాలి.
దక్షిణహస్త తలము, పీఠము, నడుము, బొటనవ్రేలు
నుండి వామహస్తము, కనిష్ఠిక వరకు,
కనిష్ఠ నుండి కరతలము వరకు కేవలము స్వరముల చేత న్యాసము చెయ్యాలి.
దక్షిణకర తలము వరకు
సంహారన్యాసము. దక్షకరతలము నుండి వామకరతలము వరకు విసర్గ సంయుక్త న్యాసము వరకు
సృష్టి న్యాసము అంటారు. వామహస్త కనిష్ఠిక నుండి కరతలము వరకు బిందు విసర్గ యుక్త అ
నుండి ఌ వరకు ఎనిమిది స్వరముల న్యాసము చెయ్యాలి. తర్వాత దక్షహస్త తాళము నుండి
కనిష్ఠిక వరకు అ నుండి ఋ వరకు న్యాసము చెయ్యాలి. ఈ న్యాసమును స్థితిన్యాసము
అంటారు. వామహస్త కనిష్ఠిక నుండి అయిదు అంగూలీకముల పర్వములందు త నుండి శ వరకు 15
వర్ణముల న్యాసము చెయ్యాలి. ఈ విధముగా అంగుష్ఠము నుండి కనిష్ఠ వరకు న్యాసము
చెయ్యాలి. దక్ష కరము నందు క నుండి ణ వరకు 15 వర్ణముల న్యాసము చెయ్యాలి. ష స హ ళ
క్ష న్యాసము ఏకకాలమున అంగుష్ఠాది అంగూలీయకములందు వ్యాపకత్వము చెయ్యాలి.
మాతృకావర్ణముల చేత కరశుద్ధి చెయ్యాలి. తదనంతరము, ఈ
క్రిందివిధముగా షడంగన్యాసము చెయ్యాలి.
షడంగన్యాసము
దేశికోత్తములు ఈ క్రింది
ప్రకారముగా షడంగన్యాసము చెయ్యాలి అని భైరవీతంత్రమునందు చెప్పబడినది.
అం క ఖ గ ఘ ఙ మాం, ఇం చ ఛ జ ఝ ఞ మీం, ఉం ట ఠ డ ఢ ణ మూం, ఏం త థ ద ధ న మైం, ఓం ప ఫ బ భ మ మౌం, అనుస్వార - విసర్గయుక్త య ర ల వ, జాతియుక్త శ ష స హ
ళ క్ష| వీటిచే షడంగన్యాసం చెయ్యాలి. తదనంతరం మాతృకా సరస్వతి
యొక్క ధ్యానము ఈ క్రింది విధంగా చెయ్యాలి.
చంద్రార్ధాంకితశేఖరామ్ త్రినయనామ్ పంచాశద్వర్ణాః
క్రమాధ్వ్యాప్తాంగీమ్ శరదిందుకుంద
రుచిరామ్ వక్షోజ భారాన్వితామ్|
దానం చాక్షవటీమ్ సుధారసలసత్కుమ్భమ్ శుభం పుస్తకం బిభ్రాణామ్ కరపంకజైర్భగవతీమ్ పద్మాసనస్తాం భజే||
పై విధంగా ధ్యానం చేసిన
తర్వాత ముందుగా అంతర్మాతృకా న్యాసము షడాధారమునందు చేసి, ఆ తర్వాత అ నుండి క్ష వరకుగల వర్ణముల చేత బహిర్మాతృకా న్యాసము చెయ్యాలి.
దక్షిణామూర్తి సంహితప్రకారము
- విశుద్ది చక్రమునందు స్వరములతో న్యాసము చెయ్యాలి. వరుసగా అనాహత, మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార
మరియు భ్రూమధ్యమున ఆయా చక్రదళముల సంఖ్య ప్రకారము వర్ణములతో న్యాసము చెయ్యాలి.
దీనినే అంతర్మాతృకా న్యాసము అంటారు.
ఉత్తరతంత్రము నందు ఈ
విధముగా చెప్పబడినది -
మస్తకము, ముఖవృత్తము, నేత్రము, కర్ణము, నాసిక, గళము, ఒష్ఠ, దంతములు, మూర్ధ, రెండు
హస్తములు, పాదముల సంధులు, భుజము, పీఠము, నాభి, ఉదరము, హృదయమూలము, ఎడమ భుజము, హృదయము, రెండు హస్తములు, పాదములు,
జఠరములందు న్యాసము చెయ్యాలి.
మూలోక్త శ్లోకము ప్రకారము
పూజన యంత్రము తయారుచేసి నవపీఠ శక్తులతో కూడి పూజ చెయ్యాలి. ఈ పూజ నుండి మేధా, ప్రజ్ఞా, విద్యా, ధృతి, స్మృతి, బుద్ధి, విద్యేశ్వరీ
ప్రాప్తమవుతాయి.
మాతృకా పీఠ మంత్రము
పీఠపూజ యొక్క మంత్రము
"సర్వశక్తికమలాసనాయ నమః" అని సిద్ధసారస్వతమునందు చెప్పబడినది.
మాతృకాసావరణార్చనారుచకసంపాదనవిధి
ముందుగా నపుంసక వర్ణములైన
ఋ మరియు ఌ లను వదలి రెండేసి స్వరములతో అంగన్యాసము చెయ్యాలి. ఏ విధముగా అనగా, అం ఆం హృదయ, ఇం ఈం శిరసే, ఉం
ఊం శిఖా, ఏం ఐం కవచ, ఓం ఔం నేత్ర, అం అః అస్త్ర.
అ క చ ట త ప య ష - ఈ
ఎనిమిది వర్ణముల పూజ చెయ్యాలి. ఈ ఎనిమిది శక్తులు వ్యాపినీ, పాలినీ, పావనీ, క్లేదినీ, ధారిణీ, మాలినీ, హంసినీ మరియు
శాంతినీ. ఆ తర్వాత బ్రాహ్మీ మొదలగు ఎనిమిది మాతృకల పూజ చెయ్యాలి. ఆ తర్వాత
దశలోకపాలకులను ఆ తర్వాత వారి అస్త్రములను పూజించాలి. పూజ తర్వాత సాధకుడు న్యాసము
చేసి ఒక లక్ష మంత్ర జపము చెయ్యాలి. ఒక లక్షలో దశాంశము అనగా పదివేలు హోమము
చెయ్యాలి. హవనమును మధుత్రయలోలిత తిలలతో చెయ్యాలి. ఆ తర్వాత సావధానముగా తర్పణము
చేయాలి. ఈ విధముగా సాధకుడు సిద్ధమంత్ర ప్రయోగము తన వాంఛిత ప్రకారముగా చెయ్యాలి.
అప్పుడు గురు ఆజ్ఞానుసారము ఆ సాధకుడు అన్ని సిద్ధులను ప్రాప్తించుకోగలడు. పూజను
స్వర్ణ, రజత, తామ్ర పాత్రయందు
యంత్రమును లిఖించి చెయ్యాలి. ఈ విధమైన యంత్ర పూజ సర్వకామ ప్రదాయకము అవుతుంది.
1008 సార్లు జపము అయ్యిన తర్వాత నేతితో హోమము చెయ్యాలి. హవానా
సమయంలో అభిషేక పాత్రయందు వెయ్యాలి. ఆ అభిషేక పాత్రలో ఒక ఉంగరము వెయ్యాలి. ఆ తర్వాత
అంగ మరియు ఆవరణ సహిత మాతృకా పూజా చెయ్యాలి. అభిషిక్త శిష్యునికి గురువు ఆ ఉంగరము ప్రదానము
చెయ్యాలి. ఆ ఉంగరమును ధరించిన సాధకుడు గ్రహ, క్షుద్ర, దృశ్య, మారీ (=క్షయరోగము),
సర్పాదులనుండి విముక్తుడయి చిరకాలము జీవిస్తాడు మరియు విముక్తుడవుతాడు.
మంత్రతంత్ర ప్రకాశమునందు ఈ విధముగా చెప్పబడినది - బంగారము, వెండి, రాగి వరసగా సూర్య - చంద్ర - అగ్ని రూపములు.
16 వంతుల బంగారము, 16 వంతుల వెండి, 16
వంతుల రాగి కలిపి ఒక ఉంగరమును తయారుచెయ్యాలి. ఆ తర్వాత హోమము చెయ్యాలి. ఆ ఉంగరము
పైన హోమ సంఖ్యకు సమానముగా నెయ్యి బిందువులను వెయ్యాలి.
ఉత్తరతంత్రమునందు ఈ విధముగా చెప్పబడినది - పడుకొనిలేచిన తర్వాత మూడుసార్లు
మంత్ర జపముతో మూడు అంజలిలు జలపానము చెయ్యాలి. ఈ విధముగా ఒక సంవత్సరము చెయ్యగా
మూగవాడు కూడా కవి అవుతాడు. దీని విపులార్ధము ఏమనగా,
సంధ్యావందనము అనంతరము అంజలిలోకి జలము తీసుకొని అందులో ముందు చెప్పబోవు మాతృకా
యంత్రమును నిర్మించి/కల్పించి అ నుండి క్ష వరకు మాతృకా జపము చేసి, ఆ జలమును అమృతప్రాయముగా భావించి, మూలాధారము నుండి
జిహ్వాగ్రము వరకు సరస్వతీనాడీ ధ్యానమును దీపశిఖాకారముగా చేసి ఆహుతి రూపములో ఆ
జలమును సేవించాలి. (త్రాగాలి)
ఈ విధముగా ప్రతిదినమూ
చెయ్యడం వలన పాండిత్యము, వక్తృత్వము, వ్యాఖ్యాతృత్వము, కవిత్వముతో కూడి ఆత్మజ్ఞానము కూడా
ప్రాప్తిస్తుంది.
మాతృకాఫల కథనము
వెయ్యిసార్లు జపము అయిన
తర్వాత దీనిని సేవించడం వలన కవిత్వము ప్రాప్తిస్తుంది. అక్షరౌషధి సంపర్కము చేసి
ఘటమును జలముతో నింపాలి. వెయ్యిసార్లు జపము అయిన తరువాత మంత్రజ్ఞుడు ఆ జలమును
సాధకుని చేత త్రాగించాలి. దీనివలన సాధకుడు మేధా ఇందిరా సమానుడవుతాడు. దీనివలన
కీర్తి, దీర్ఘాయువు, కవిత్వము ప్రాప్తించును. వంద్యులకు
పుత్రులు కలుగుతారు మరియు ఆ పుత్రులు నానాగుణ సంపన్నులవుతారు.
మాతృకా యంత్ర నిర్మాణము
తంత్రరాజ ప్రకారము -
వృత్తద్వయము, ఆపైన అష్టదళ పద్మము,
ఆపైన భూపురము నిర్మించి మధ్యన హ్సౌః లిఖించాలి. యంత్ర కేసరనందు స్వరములు, దళములందు కవర్గము, చవర్గము,
టవర్గము, తవర్గము, పవర్గము (ఐదు
దళములందు ఐదు వర్గములు), ఆరవ దళములో యరలవశ, ఏడవ దళములో
హసహలక్ష, ఎనిమిదవ దళములో అ ఇ ఉ అం అః లిఖించాలి. చతురస్రములో
పూర్వాది దిశలందు యకారము, కోణములందు టకారము లిఖించాలి.
ప్రాతఃకాలమున బ్రహ్మరంధ్ర సహస్రదళ కమల మధ్యమున చంద్రమండలము, దాని మధ్యన యంత్రమును, దానిమధ్యన స్వాభీష్ట
సాధ్యనామమును భావించిన మాత్రముననే ఫలము లభిస్తుంది. మరొక విధముగా - భూమి మీద
సిందూరాదులతో యంత్రమును నిర్మించి పూర్వోక్త విధముగా దానిమీద కలశమును స్థాపించాలి.
వర్ణౌషధీక్వాధముతో (సర్వౌషధముల కాషాయమును వర్ణములతో అభిమంత్రించినది) ఆ కలశమును
నింపాలి. అందు దేవీ పూజ చెయ్యాలి. ఆ క్వాధముతో అభిషేకము చెయ్యడం వలన ఫలము
లభిస్తుంది.
మరొకవిధముగా - భోజపత్రమునందు యంత్రమును లిఖించి బంగారాదులతో
చేయబడిన తావీజు నందు ఆ భోజపత్రమును పెట్టి దేవీపూజ చేసి విధివిధానముగా ఆ తావీజును
ధరించడం వలన కూడా ఫలము లభించును.
మరొకవిధముగా - రాగిరేకు
మీద యంత్రమును లిఖించి ఇంటి ముఖద్వారమున ఆ యంత్రమును ఉంచినా కూడా ఫలిస్తుంది.
అన్ని దేవతల చక్రములూ బంగారంతో గానీ, వెండితో
గానీ రాగితో గానీ తయారు చెయ్యాలి. ఆ యంత్రం మధ్యలో దేవతా నామము మరియు సన్నిధేహి
అని లిఖించి ప్రాణప్రతిష్ట చేసి దేవీ పూజ చెయ్యాలి. ఆ యంత్రమును స్పృశిస్తూ మాతృకా
జపము ఒక లక్ష చెయ్యాలి.
తత్త్వజ్ఞుడు, పూర్ణాత్మా, సుపూజితుడు ఆ చక్రమును ముందుగా భూమి మీద స్థాపించాలి ఆ తర్వాత దాని మీద నిజ వాంఛితా దేవతా మూర్తిని విధివిధానముగా స్థాపించాలి. ఆ విధముగా చెయ్యడం వలన ఆ దేవత యొక్క విశేష సాన్నిధ్యము సాధకునికి ప్రాప్తిస్తుంది. ఈ స్థాపన వలన సాధకుని అన్ని ఇచ్చలు నెరవేరుతాయి. మాతృకా న్యాసము పూజా, ఉపాసనలందు చెయ్యాలి.
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి