8. అద్భుతగగనశరీరామేకాక్షరనాదసంయతశమీరామ్|
సకలాంతరనిర్ణిమిషామ్
నిస్తిమిరామంతరే పరాం వందే||
ఆకాశమే శరీరముగా, చెదరిని నాదమే శ్వాసగా కలిగి సకల జీవుల హృదయాలలో ఉండి ఎంతమాత్రము
రెప్పవేయక రవ్వంత చీకటినైనా దరిచేయనీయక వారిని రక్షించుచూ ఉండే సర్వశ్రేష్ఠమైన పరదేవతకు
శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఇక్కడ శాస్త్రిగారు
శ్రీమాత యొక్క విరాడ్రూపాన్ని తెలుపుతున్నారు. ఆకాశమే శ్రీమాత శరీరం. ఎడతరగని నాదమే
ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసలు. ఇక్కడ నాదమనగా హ్రీం అని అర్ధం చేసుకోవాలి. ఈ బీజం అమ్మవారి
ఏకాక్షర మంత్రము. సూక్ష్మంగా చూసినట్లైతే, సకల జీవుల హృదయమే ఆకాశం. దీనినే దహరాకాశం అని అంటారు. ఇదియే దేవతా
స్థానము. అందుకే మనము అంగన్యాసములు చేసినప్పుడు హృదయాయనమః అని చెబుతాము. ఇక జీవుల ఉచ్ఛ్వాసనిశ్వాసలే హృల్లేఖ. అదియే హ్రీం. కొందరు
దీనినే అహం అని సోహం అని కూడా చెబుతారు. అమ్మవారిని త్రికరణశుద్ధిగా ఆరాధిస్తే చిత్తము
శుద్ధి అయి పరదేవతా సాక్షాత్కారం లభిస్తుందని తెలుసుకోవాలి. పై పైన ఎన్నో పూజలు చేస్తూ
మనసులో మాత్రము అరిషడ్వర్గాలకు బానిసై ఉండే వారికి ఎన్నటికీ ఆధ్యాత్మిక ఉన్నతి కలగదు
అని ఈ శ్లోకం ద్వారా అర్ధమవుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి