జీవగ్రాహముదగ్రా నిజపదజాలే నిధాయ మాం యస్యాః|
జాగర్తి స్వీకర్తుం
దృష్టి: కాలేత్ర తంతునాభనిభా||
సాలెపురుగు తదేక దృష్టితో తన ఆహారమును చూచి తన సాలెగూటిలోనికి తీసుకొని అందు ఉంచి, తనకు అవసరమైనప్పుడు ఆ ఆహారమును మ్రింగివేయును. ఆ విధంగానే శ్రీమాత తన ప్రియ భక్తుడిని తదేక దృష్టితో చూసి (=అనగా పరీక్షించి) ముందుగా తన సామీప్యమునకు తీసుకొనును. ఆ తర్వాత ఆ భక్తుని సాధన, భక్తి, పూర్వజన్మ ఫలం మొదలగు వాని అనుగుణంగా శ్రీమాత ఆ భకునికి సాయుజ్య ముక్తినొసగును.
శాస్త్రిగారి మహామనుస్తవ సూత్రాలలో ఇది ఒక ఆణిముత్యము. ఇందులో
సామీప్య ముక్తి, సాయుజ్య
ముక్తి గురించి శాస్త్రిగారు చాలా గుప్తంగా చెప్పారు. ఒక వ్యక్తి తన శక్తి వంచన లేకుండా
అచంచల భక్తితో అమ్మవారిని ఆరాధిస్తుంటే ఆ భక్తుని మీద అమ్మవారికి కరుణ కలిగి అతడికి
మోక్ష మార్గమును చూపించుతుంది. అందులో మొదటి మెట్టే సామీప్య ముక్తి. అమ్మవారిని ఆరాధించుటకు
ఎన్నో మార్గములు కలవు. వాటిలో శ్రీవిద్యోపాసన భోగ, మోక్ష కారిణి.
అయితే శ్రీవిద్య అందరికీ దొరకదు. అచంచల భక్తి భావములు గల వారికే ఆ విద్య దొరుకుతుంది.
భక్తి కలిగిఉండడం కూడా పూర్వ జన్మ సుకృతమే. భూమి మీద ఉన్నవారందరూ భక్తులు కాదు కదా.
మనుష్యల్లో విశ్వాసులు, మధ్యములు, అవిశ్వాసులు
అని మూడు తరగతులుంటారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి విశ్వాసంతో కూడిన భక్తి
ముఖ్యము. అలాంటి భక్తి భావంతో అమ్మవారి ఆరాధనలో మొదటి మెట్టైన శ్రీలలితారహస్య నామములను
కొన్ని రోజులు సాధన చేయగా అమ్మవారి అనుగ్రహం చేత సాధకునికి తగిన శ్రీవిద్యా గురువు
తప్పక లభిస్తారు.
ఆ గురువు ఆ సాధకుడిని శ్రీవిద్యాసాధన అను గూటిలోకి తీసుకువెడతారు.
పూర్తి నియమ, నియంత్రణలతో
శ్రీవిద్యను ఉపాసించగా అమ్మవారు ఆ సాధకుడికి సాయుజ్య ముక్తిని తప్పక కలిగిస్తారు. ఇక్కడ
సాయుజ్య ముక్తి అనగా అమ్మవారిలో లీనమైపోవడం. ఈ విషయముననే శాస్త్రిగారు సాలెపురుగు
(=అమ్మవారు), సాలెగూడు (శ్రీచక్రోపాసన/సామీప్యముక్తి), ఆహారము (=సాధకుడు), సాలెపురుగు తనకు కావలిసినప్పుడు
ఆహారమును స్వీకరించుట (=సాధకుని సాధనా ఫలము బట్టి సరైన సమయంలో అతనిని తనలోకి లీనం చేసుకొనుట/
సాయుజ్య ముక్తి), అన్న ఉపమానములతో చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి