సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, ఆగస్టు 2020, మంగళవారం

మహామనుస్తవం - 4

 

 అచ్ఛలజీవనవిధయే తుచ్ఛమనోవాసకచ్ఛతో హృత్వా|

 విచ్ఛందకనిజపదభూసేవినమేనం వ్యధత్త యా సదయా||


హీనమైన, అల్పమైన, బురదమయమైన మానసిక జీవనవిధానం నుండి తన భక్త సాధకుడిని ప్రేమతో అతని సంకల్పం లేకుండానే తన పాదసేవకునిగా చేసుకుంటుంది.

విశేష రహస్యము:

మనః మూలమిదం జగత్. జీవుడి మనసును బట్టే జగత్తు. అయితే సాధారణ జీవుల మనసు బురదమయంగా ఉంటుంది. అతడి కోరికలు, భావాలు, అభిరుచులు, ఆలోచనలు ఒక్కటేమిటి అన్నింటికీ అతడి మనసే కారణము. ఏ జీవుడైతే మనసా, వాచా, కర్మణా సచ్ఛీలమైన  జీవితమును గడుపుదామని కోరుకుంటాడో అతడు ఇటువంటి బురదమయమైన మానసిక ఆటంకాలు/అవరోధాల నుండి బయటపడాలి. అలా బయటపడడానికి తీవ్రమైన ఆర్తి కల జీవుడిని అమ్మవారు కరుణించి బురద నుండి అతడిని తప్పించి శుద్ధజలము అనే పరిశుద్ధ మైన జీవితము వైపు నడిపిస్తుంది. పై శ్లోకంలో జీవన అనగా నీళ్ళు మరియు బ్రతుకు అని అర్ధం చేసుకోవాలి. అలా మానసిక దౌర్భాల్యం నుండి బయట పడిన జీవునకు సంకల్పం, వికల్పం, ధర్మం, అధర్మం, పుణ్యం, పాపం మొదలైనవి ఏమీ ఉండవు. అతడు శుద్ధాత్మగా జీవనాన్ని కొనసాగిస్తాడు. మానసిక దుర్భలాన్ని పోగొట్టడానికి బహిర్యాగము ఎంతో ఉపయుక్తము. ఈ రోజుల్లో సాధన అనే మాటకు అర్ధం లేకుండా పోయింది. బహిర్యాగము అనగా  బాహ్యంగా చేసే పూజ. ఈ పూజలు అవీ అక్కరలేదు అనే వారు ఈ మధ్య బాగా ఎక్కువైపోయారు. బహిర్యాగము ద్వారా, శరీరశుద్ధి తద్వారా మానసిక శుద్ధి కలుగుతుంది. ఇది ఒక క్రమము. మానసిక శుద్ధి కలిగిన జీవునికి చైతన్యము దర్శనమవుతుంది. పైనచెప్పబడిన  చైతన్యమనే దేవుడిని చేరాలంటే దేహమనే దేవాలయం లోపలకి అనగా అంతరాలయంలోకి వెళ్ళాలి. అప్పుడే చైతన్య దర్శనం అవుతుంది. మరేవిధంగానూ అవ్వదు.

కామెంట్‌లు లేవు: