ఆర్యా
మాతరమాద్యాం త్రిభువనసంతానయోగసౌభాగ్యాం|
ఆదిపురేశ్వరమాహిషీం లలితాం
శ్రీత్రిపురసుందరీం వందే||
పార్వతి, మొట్టమొదటి తల్లి, మూడుపురముల వాస్తవ్యులు తన సంతానముగా సౌభాగ్యం గల ఆదిపురీశ్వర పట్టపురాణి
అయిన శ్రీ లలితామహాత్రిపురసుందరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఇక్కడ ఆర్యా శబ్దంతో ఈ సూత్రాలను సాధకోత్తముడు
ప్రారంభించెను. ఆర్యా అనగా పార్వతి, పదునారేండ్లప్రాయము కలది, పూజ్యస్త్రీ
అని అర్ధము. అమ్మ నిత్య షోడశప్రాయయే కదా. అందుకే ఆమె మంత్రము కూడా షోడశివర్ణములు
గలది.
ఆర్య అనునది వేద వాక్యము. ఈ పదమునకు, తీవ్రముగా, నిరంతరముగా పట్టుదలతో జ్ఞానమనే మార్గములో పయనిస్తూ అజ్ఞానమనే చీకట్లను
నిర్దాక్షిణ్యంగా పాలద్రోలే శక్తియని అంతరార్ధము. శ్రీమహాత్రిపురసుందరియే ఆర్యా
రూపంలో తన సాధకులను ప్రతికూలమైన సాధనా వ్యతిరేకతలనుండి రక్షించి అజ్ఞాన
చీకట్లనుండి బయటకు తీసుకు వచ్చి జ్ఞానమనే కిరణములను ప్రసాదించును.
సంతానం అనగా విస్తరించడము, వ్యాపించడము మరియు సంతతి. శ్రీమాత
మూడులోకములందునూ వ్యాపించిఉన్నది. ఆయా లోకములందున్న అన్ని జీవరాశులను ఆమె తన
సంతానముగా కాపాడుచుండును. సంతానము లేకపోతే తల్లే ఉండదు. కనుక మూడులోకములందున్న
జీవరాశులు ఆమె సంతానముగా ఉండడం ఆమె సౌభాగ్యం. ఇక్కడ మనం గమనించవలసిన విశేషం ఏమనగా, తల్లి తన సంతానాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. క్రమశిక్షణా
మార్గంలో ప్రవర్తించడం సంతానం బాధ్యత. కనుక, అజ్ఞానంధకారంలో
మునిగిపోయిన సంతానం, తన తల్లిని చేరుకోవడానికి ప్రయత్నించడమే
సౌభాగ్యము. ఆ ప్రయత్నా సాధననే సౌభాగ్య విద్య అంటారు.
ఆదిపురము అనునది నేటి చెన్నై మహానగరమునకు దగ్గరలో ఉన్న
తిరువొత్తియూర్ అను నగరమునకు పేరు. శ్రీకపిలశాస్త్రిగారు ఈ నగర వాస్తవ్యులు.
ఈనగరములో ఉన్న దేవీ దేవతలు శ్రీ లలితా మహాత్రిపురసుందరి మరియు ఆమె విభుడు
ఆదిపురేశ్వరుడు.
ఇక్కడ విశేష రహస్యము చూద్దాము. ఆది అనగా మూలము అని అర్ధము.
అదియే మూలాధారము. అందు ఉండు శక్తి కుండలిని. ఈ కుండలినీ శక్తియే శ్రీ
మహాత్రిపురసుందరి. మూలాధారమున హస్తిమీద స్వయంభూ శివలింగము, దానిని మూడున్నర చుట్లు
చుట్టుకొని కుండలినీ శక్తి ఉంటుంది. ఆ పురమునకు ఆ లింగమే ఈశ్వరుడు. త్రిపురసుందరి
పట్టపురాణి. ఇక్కడ ఈశ్వర శబ్దమును బ్రహ్మ సంకేతంగా అర్ధంచేసుకోవాలి. కనుకనే
ఆదిపురేశ్వరమాహిషీం అని స్తుంతించారు. ఇక్కడ మూలాధార సాధన రహస్యమును ఉటంకించబడినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి