సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఏప్రిల్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 12

(ఈ సంచికలో గురు శిష్యుల లక్షణాలు చెప్పబడుచున్నవి. సాధనలో సిద్ధి పొందడానికి ఈ జ్ఞానము ఎంతో ముఖ్యము)


తంత్రరాజమును అనుసరించి గురుమండల పూజా విశేషదినములు
గురుమండల పూజను ఈ క్రింది విశేష దినములందు చెయ్యాలి.

       - గురుదేవుని జన్మదినము
       - విద్యాప్రాప్తి దినము (పూర్ణదీక్షా దినము)
       - సాధకుని జన్మదినము      
       - నాథవ్యాప్తి దినము.  
       - అక్షరత్రయ సంపాత దినము
       - పూర్ణ దినము
       - ఆరు పర్వదినములు
       - విశిష్ఠ సదర్శ ఏడు పర్వదినములు
       - ప్రతీమాసము లేక ప్రతీ సంవత్సరము చెయ్యాలి.

చివర చెప్పిన అయిదు విశిష్ట రోజులు తాంత్రిక పంచాంగమందుండును.

కాదిమతమునందు గురులక్షణములు

సాధకుల హితార్ధము కాదిమతంలో తంత్రములందు చెప్పబడిన గురు మరియు శిష్యుల లక్షణములు ఇక్కడ చెప్పబడుచున్నాయి.
గురువు సుందరుడు, సుముఖుడు, స్వఛ్చనీయుడు, సులభుడు, బహుమంత్రవిదుడు, అసంశయుడు, సంశయములను తీర్చగలవాడు, గర్వములేనివాడు, సంతోషముతో ఉండువాడు, ధనమునందు ఆపేక్షలేనివాడు, హితవాదము పలికేవాడు అయి ఉండవలెను.
పై గుణములు లేని గురువు శిష్యునకు దుఃఖదాయినుడవుతాడు.

కాదిమతమునందు శిష్యునిలక్షణములు 

సుందరము, సుముఖము, స్వచ్ఛత, సులభత్వం, శ్రద్ధాళువు, సుస్థిరాశయము, అలుబ్ధత్వము, స్థిరగాత్రము, జితేంద్రియత్వము, ఆస్తికత్వము, గురుమంత్రము మరియు దేవతా మంత్రమునందు ధృడ బుద్ధిత్వము అను లక్షణములు కలిగినవాడు ఉత్తమ శిష్యుడు అవుతాడు. ఈ లక్షణములు లేని శిష్యుడు గురువుకు దుఃఖదాయకుడవుతాడు.  
  
గురు మాటను అంగీకరించువాడు, గురుమాట యొక్క అర్ధమును తెలుసుకొనువాడు, గురువు సన్నిహితమున ఆదరసహితముగా మాట్లాడువాడు (హే నాథ! మీరు ఏవిధంగా చెబుతారో ఆవిధంగానే అవుతుంది - అన్న చందంగా) ఇటువంటి లక్షణములను కలిగిన వాడు ఉత్తమ శిష్యుడు అవుతాడు.

గురువుకు నమస్కారము చేసి అతని పక్కన కూర్చొని అతని ఆజ్ఞ తీసుకొని వెళ్ళాలి. గురుముఖమును చూస్తూ అతనిని సేవించాలి. గురువుయొక్క ఇష్టాన్ని గౌరవించాలి. గురువు సమక్షమున అనవసరమైన మాటలు మాట్లాడరాదు మరియు ప్రేలాపనలు చేయకూడదు.

కామ, క్రోధ, లోభ, మదము, నవ్వుట, స్తుతీ, జిహ్వచాంచల్యత, కార్యమందు పరివేదనము(=బాధించుట), ఋణము  తీసుకొనుట, ఋణము ఇవ్వుట, వస్తువుల క్రయ విక్రయము ఉత్తమ శిష్యుడు ఎప్పుడూ చెయ్యడు. గురువును సాక్షాత్ శివుని రూపంగానే భావించాలి. ప్రణామము, భజన చెయ్యాలి. దేవత ఎలాగో అలాగే మంత్రము, మంత్రము ఎలాగో అలాగే గురువు, గురువు ఎలాగో శిష్యుడు అలాగే ఉండాలి. ఈ భక్తి క్రమమును పాటించుట ఉత్తమ శిష్యుని లక్షణము. గురువు జన్మ దినమున ఉత్సవము చెయ్యాలి. విశేష పూజ చెయ్యాలి. యోగులకు భోజనం పెట్టాలి. వారి పాదములకు అర్చన చెయ్యాలి. గురువు దేహావసానాంతరము సాధకుడు అగ్రజునికి పూజ చెయ్యాలి. గురుశిష్యులు ఒకేస్థానము నందుంటే గురువునకు నిత్య పూజ చెయ్యాలి. ఒక యోజనము కన్నా ఎక్కువ దూరములో ఉంటే ఆరు నెలలలో ఒకమారు పూజ చెయ్యాలి. ఇంతకన్న ఎక్కువ దూరములో ఉంటే గురువు యొక్క ఆజ్ఞానుసారము ఆచారము పాటించాలి. గురువు యొక్క ఆసనము, శయ్య, వస్త్రము, భూషణము, పాడుకలు, చిత్రపటము, కళత్రము మొదలగునవి స్పర్శించి గురుపూజ చెయ్యాలి. గురుశిష్యులు ఒకే ఊరిలో నివసిస్తుంటే గురు ఆజ్ఞకు భిన్నంగా వేరే పూజ చేయరాదు. పూజ మధ్యలో గురుగారు వస్తే ప్రణామము చేసి ఆసనము మీద ఆసీనులను చెయ్యాలి. గురువుగారు కూర్చున్న పిదప వారి ఆజ్ఞానుసారము శేషపూజను చెయ్యాలి. శేష పూజను నిశ్చల మనస్సుతో చెయ్యాలి. పూజమధ్యలో గురు పూజ కూడా చెయ్యాలి. పూజాంతమునందు గురువు వచ్చినా గురుపూజ చెయ్యాలి. ఎక్కడ పూజ ఉందో అది గురువుకు చెప్పాలి. గురువు మౌనము దాల్చితే ఆ పూజ పూర్తి చేయకూడదు. గురువుకు మృత విషయము చెప్పకూడదు. అలాచేసినచో దేవతార్చన వలన మంత్ర సిద్ధి కలగదు. మంత్ర నిశ్చిత పూజ యథోచితముగా చెయ్యాలి. మంత్రము మరియు మంత్రపటలము (=పుస్తకము?) ఒకేరూపముగా తెలుసుకొని భక్తి పరాయణత్వం కలిగి ఉండాలి.

కాలీ మతమునందు గురుశిష్యుల లక్షణములు ఇవే చెప్పబడ్డాయి. సాధకుల హితార్ధము ఈ విషయములు చెప్పబడ్డాయి.

కులార్ణవము నందు గురు లక్షణములు
శ్రీగురువుని వేషము మనోహరముగా ఉండాలి. సర్వలక్షణ సంయుక్తము మరియు అన్ని అవయములు శోభితముగా ఉండాలి. అన్ని ఆగముల యొక్క అర్ధతత్త్వజ్ఞానము, అన్ని మంత్ర విధానముల జ్ఞానము, లోకులను సమ్మోహితులను చెయ్యగలవాడు, దేవతా సమానమైన ప్రియదర్శనము, సుముఖ, సులభ, స్వఛ్ఛ, శుద్ధ అంతఃకరణము కలవాడు, సంశయము లేనివాడు, ఇంగితాకార జ్ఞానము కలవాడు దుర్జనులకు దూరముగా ఉండువాడు, అంతర్ముఖుడు, బహిర్దృష్టి కలవాడు, సర్వజ్ఞుడు, దేశాకాల జ్ఞానము కలవాడు, ఆజ్ఞాసిద్ధి, త్రికాలదర్శి, నిగ్రహ-అనుగ్రములను పాటించడములో నేర్పరి, వేదవేదాంగముల జ్ఞానము, శాంతము, అన్ని జీవులందు దయ కలవాడు, ఇంద్రియములను స్వాధీనములో ఉంచుకున్నవాడు, షడ్వర్గవిజయుడు, క్షమకలవాడు, అగ్రగణ్యుడు, అతిగంభీరుడు, పాత్ర-అపాత్ర జ్ఞానము కలవాడు, నిర్మమ, నిత్య సంతుష్టుడు, నిర్ద్వంద్వ, అనంతశక్తి యుక్త, సద్భక్తవత్సల, ధీర, కృపాళువు, నవ్వుతూ మాట్లాడేవాడు, భక్తప్రియ, సర్వసమ, దయాళు, శిష్యులను క్రమశిక్షణలో ఉంచేవాడు, శ్రేష్ఠ, నిష్ఠగురు, ప్రాజ్ఞ, వనితాపూజయందు ఉత్సుకత కలవాడు, నిరాఘాటంగా నిత్య-నైమిత్తిక పూజ చేసేవాడు, కర్మణ్య, అనిందిత, నిర్లోభ, అహింసక, అపక్షపాతి, విచక్షణ, విద్యలయొక్క పూర్ణ జ్ఞానము, మంత్ర-యంత్రాది రహస్యములు తెలిసిఉండడం, సంకల్ప-వికల్ప రహిత, నిర్ణితార్ధ విధాయకుడు, నింద-స్తుతిలందు సమభావము, మౌని, నిరపేక్షి మొదలగు లక్షణాలు కలవాడు గురుశ్రేష్ఠుడు అవుతాడు.

శ్రేష్ఠ శిష్య లక్షణాలు

ఉత్తమ శిష్యుల లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి -
శమాది సాధనాయుక్తుడు, గుణశీల సమన్వితుడు, శుద్ధదేహానుబంధ అంగములున్నవాడు, ధార్మికుడు, శుద్ధమానసకుడు, ధృడవ్రతుడు, సదాచార సంపన్నుడు, శ్రద్ధాభక్తి సమన్వితుడు, కృతజ్ఞుడు, పాపభీతి కలవాడు, సాధుసజ్జనుల చేత సమ్మతింపబడినవాడు, ఆస్తికుడు, దానగుణము కలవాడు, సర్వభూత దయకలవాడు, విశ్వాస-వినయయుక్తుడు, ధనమునందు ఆసక్తి లేనివాడు, అసాధ్యుడు, సాధకుడు, శూరుడు, బలకాంతి సమన్వితుడు, అనుకూల క్రియాయుక్తుడు, అప్రమత్తుడు, విచక్షణాజ్ఞానము కలవాడు, హిత-సత్యా-మితా-స్నిగ్ధ భాషి, ధూషనములను పట్టించుకోనివాడు, తక్షణవచనార్ధగ్రాహి, చతురుడు, బుద్ధిమానుడు, గృహ-తల్ప-ఆసన-ఉచ్ఛుంగ నిర్వికారుడు, సేవకుడు, విమృష్యకారుడు, వీరుడు, మనోదారిద్ర్యరహితుడు, సర్వకార్యములను నెరవేర్చగలవాడు, ధీరుడు, సర్వోపకారి, స్వార్ధము లేనివాడు, పరనిందచెయ్యనివాడు, సుముఖుడు, జితేంద్రియుడు, సుసంతుష్టబుద్ధిమానుడు, బ్రహ్మచారి, ఆధి-వ్యాధి చాపల్యరహితుడు, దుఃశంకా-ఆటంకవర్జితుడు, గురుధ్యాన-స్తుతి-సేవన-భజనమునందు ఉత్సుకత కలవాడు, గురు-దేవతా భక్తుడు, కామినీ భజన యందు ఉత్సుకత కలవాడు, నిత్యమూ గురు సమీపమున నివాసముండెడివాడు, గురువును సంతోషపెట్టువాడు, మనసా-వాచా-కర్మణా నిత్యమూ గురుకార్యమునందు సముత్సుకత కలవాడు, గుర్వాజ్ఞను పాలించేవాడు, గురుకీర్తిని ప్రకాశింపచేసేవాడు, గురువాక్యప్రమాణమును తెలిసినవాడు, గురుసేవనందు నిరతుడు, కులనాయికనందు చిత్తానువర్తుడు, ప్రేక్ష్యకారుడు, అభిమానము, గర్వము మొదలగునవి లేనివాడు, గురువస్తువులందు ఆపేక్షలేనివాడు, గురుకృపకై ఎదురు చూచువాడు, కులధర్మము-శాస్త్రము-యోగీ-యోగినీ-కౌలికలందు ప్రియత్వము కలవాడు, కులార్చనమునందు నిరతుడు, మోక్షమార్గానుగామి.
ఇటువంటి లక్షణములు కలిగిన యుక్తుడిని శిష్యునిగా స్వీకరించాలి.

కులార్ణవముననుసరించి నికృష్ట శిష్య లక్షణములు

దుష్టజాతి యందు పుట్టినవాడు, దుష్టుడు, గుణహీనుడు, కురూపుడు, పాశాండుడు, ధూర్తుడు, పండితమాని, న్యూనాధిక అంగములు కలవాడు, వికృతమైన అంగములు కలవాడు, వికలమైన అంగములు కలవాడు, మందకొడి, అంధుడు, బధిరుడు, మలినుడు, రోగి, ఉచ్ఛిష్టుడు, దుర్ముఖుడు, స్వేచ్ఛావేషధారి, విటుడు, దుర్విదగ్ధుడు, కుచేష్టుడు, చూడడానికి భయంకరముగా ఉండువాడు, నిద్ర-ఆలస్యయుక్తుడు, బద్దకము కలవాడు, జూదవ్యసనపరుడు, ద్వారము-కుడ్యము-స్తంబము మొదలగు వాని వద్ద సంచరించువాడు, సదాశూన్యయుక్త కరుడు, క్షుద్రుడు, గురుభక్తిరహితుడు, ఏకవాది, స్తబ్దుడు, ప్రేషకుడు, చపలుడు, శఠుడు, ధన-స్త్రీ శుద్ధి విహీనుడు, నిషేధవిధి వర్జితుడు, రహస్య భేదకుడు, దేవీ కార్య-అర్ధ ఘాతకుడు, మార్జర-బక వృత్తికుడు, ఛిద్రాన్వేషణ తత్పరుడు, మాయావీ, కృతఘ్నుడు, ప్రచ్చన్నాంతరదాయకుడు, విశ్వాసఘాతకుడు, దేవద్రోహి, పాపి, అనర్ధసిద్ధినందు ఆకాంక్షకలవాడు, నేరస్థులందు ఆదరణ కలవాడు, కూటసాక్షి, సర్వత్రయాచకుడు, సర్వాకృష్ట అభిగామి, అసత్యనిష్ఠుడు, అసక్తుడు, గ్రామ్యాదిబహుభాషి, దుర్విచారకారకుడు, కలహప్రియుడు, వ్యర్ధాపేక్షకుడు, భాంతుడు, భ్రామకుడు, వాగ్విడంబకుడు, పరోక్షమందు ధూషణ చేయువాడు, ప్రత్యక్షమందు ప్రియముగామాట్లాడువాడు, కటుభాషి, విద్యాచోరుడు, ఆత్మప్రశంసకుడు, సద్గుణములంటే పడనివాడు, సద్భీతి-ఆర్తి-క్రోధ సమన్వితుడు, చార్వాకదుర్జన సఖుడు, సర్వలోక విగర్హితుడు, చుగలఖోరుడు (= పీఠము వెనకాల నింద చేసేవాడు), ప్రక్కవాళ్ళకు దుఃఖమును కలిగించువాడు, సర్వప్రాణి భయంకరుడు, స్వక్లేషవాది, మిత్రద్రోహి, భ్రాతువంచకుడు, తస్కరుడు, పశుచేష్టితుడు, అకారణంగా ద్వేషము-హాసము-క్లేశము-క్రోధము మొదలగునవి చేయువాడు, అతిహాస్య సుకర్ముడు, మర్మాంతపరిహాసకుడు, కాముకడు, నిర్లజ్జ (లజ్జ లేనివాడు), మిధ్యాదుశ్చేష్ట సూచకుడు, సహనము లేనివాడు, మద-మాత్సర్య-దంభ-అహంకారయుక్తుడు, ఈర్ష్య, పైశున్య (=కొండెకానితనము; దుర్మార్గము; చాడీలు చెప్పుట), పారుష్య (=పరుసఁదనము; పరుసపు మాట; కఠినము), కార్పణ్య, క్రోధమాని, అధీర, దుఃఖీ, ద్వేష్య, అసక్త, తత్త్వవర్జిత, అప్రసన్నమతి, మూఢ, చింతాకులితమానస, తూష్ణాలోభయుక్త, దీన, అతుష్ట, సర్వయాచక, బహుభోజి, కపటి, భ్రామక, కుటిల, భక్తి-శ్రద్ధా-దయా-శాంతి-ధర్మాచారరహిత, మాతా-పితా-ప్రాజ్నా-శ్రేష్ఠులను అపహాస్యము చేయువాడు, కులద్రవ్యాదులందు ద్వేషము కలవాడు, గురుసేవను చేయవాడు, స్త్రీలను ద్వేషించువాడు, సమయభ్రష్టుడు, గురుశప్తుడు ఇత్యాది దుర్గుణములు కలవాడిని శిష్యునిగా స్వీకరించరాదు. స్నేహవశ్యమునగాని, లోభవశ్యమున గాని అటువంటి వానికి దీక్ష ఇస్తే ఆ గురుశిష్యులిద్దరికీ దేవత శాపమునిస్తుంది. అందువలన, ఈ ప్రకారము దుర్గుణములు కలవానికి ఎట్టిపరిస్థితులలోను దీక్ష ఇవ్వరాదు. ఒకవేళ, మోహవశ్యమున అటువంటివానిని శిష్యునిగా చేర్చుకున్నచో ఆ గురువుకు పాపము చుట్టుకుంటుంది. ఏ విధంగా మంత్రి చేసిన పాపము రాజునకు, స్త్రీ చేసిన పాపము భర్తకు చుట్టుకుంటాయో అదేవిధముగా శిష్యుడు చేసిన పాపము గురువుకు చుట్టుకుంటుంది. వర్ణాశ్రములన్నీ సద్గతి ప్రదాయకములు. గురు, స్త్రీ, వార (=నియతకాల సమయములు), ఆచారము, కులనాయక జ్ఞానము శిష్యునకు తెలిపినా సరే, శిష్యుడు వాటిని గ్రహించలేకపోతే గురువునకు ఆ పాపము అంటదు.

[అ.మా: పైన శిష్యునికి ఉండవలసిన ఎన్నో లక్షణములు చెప్పబడ్డాయి. ఈ రోజుల్లో అటువంటి శిష్యులు ఉన్నారా అన్నది సందేహమే. (లేరు అన్నది నిజం) గురు పూజ సంగతి తర్వాత. గురువుతో మాట్లాడడానికి కూడా ఎన్నో లెక్కలు వేసుకొనే శిష్య పరమాణువులు ఇప్పుడు ఉన్నారు. పర్వదినములందు గుర్వాశీర్వాదము WhatsAppల ద్వారా, చిన్న చిన్న సందేశముల ద్వారా కోరుకుంటారు. ఆ మాత్రం మాత్రం దానికే వారెంతో గొప్ప పని చేసినట్టు గర్వంగా అనుభూతి చెందేస్తారు. మరికొందరు గురువుతో ఏ ఆరు నెలలకో లేదా వారికి ఇచ్ఛ వచ్చినప్పుడు గురువును ఏదో సరదాగా పలకరిస్తుంటారు. మరికొంత శిష్యులు గురువు తమనే బాగా పట్టించుకోవాలని, అందరిలోకి తానే అతనికి దగ్గరవాడిని అని అనిపించుకోవాలాని తహతహలాడిపోతుంటారు. అలాంటివారికి గురు తత్త్వం ఎన్నటికీ బోధ పడదు. ఇక చాటుమాటుగా గురువును అపహాస్యం  చేసుకొనేవారు, శాపాలు పెట్టుకొనేవారి సంగతి వేరే చెప్పుకోనక్కర్లేదు. శిష్యుల వింత చేష్టలు, రకరకాల శిష్యుల గురించి ఈ బ్లాగ్లోనే "శిష్యులందు ఉత్తమ శిష్యులు వేరయా" అన్న వ్యాసము చూడగలరు.]
ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: