సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 1

పాదుకా మహాత్మ్యము

ఏ సాధకుడు గురువును శివ స్వరూపునిగా మరియు మోక్ష, భోగదాయకునిగా తెలుసుకొని స్మరించుతాడో ఆ శిష్యునికి శీఘ్రంగా సిద్ధి లభిస్తుంది. శివుడు చెప్పుచున్నాడు - హే కులేశ్వరీ! ఎవరికైతో గురు మరియు ఇష్టదేవత యందు సమానమైన భక్తి ఉంటుందో వారికి అర్ధ,ప్రకాశము కలుగుతుంది. నారాయణుడు, మహాదేవుడు, తల్లిదండ్రులు మరియు రాజు నందు ఎటువంటి భక్తి ప్రపత్తులుండునో అటువంటి భక్తిప్రపత్తులు గురువునందు కూడా ఉండడం ఆవశ్యకము. లక్ష్మీనారాయణులు, సరస్వతీ బ్రహ్మ, గౌరీశివులు నందు ఎటువంటి భక్తిప్రపత్తులుండునో అటువంటి భక్తిప్రపత్తులు గురువు మరియు గురుపత్ని యందు కలిగి వారిని తల్లిదండ్రుల సమానముగా పూజించాలి. గురుభక్తి వలన దేవి నుండి ఏ సిద్ధులు కలుగుతాయో ఆ సిద్ధులు యజ్ఞము, దానము, తపము, తీర్ధము వ్రతాడి మొదలగు వాటివలన లభించదు. స్వగురు మీద ఏవిధముగా భక్తి పెరుగుతూ ఉంటుందో ఆ విధముగా సాధకుని విజ్ఞానము కూడా వృద్ధి చెందుతుంది. తీర్ధాదుల వలన మహాప్రయాసలు, వ్రతముల వలన కాయశోషణములు కలుగును. వీటి అవసరమేమున్నది? శారీరిక శ్రమలు మరియు కఠిన తపస్సుల వలన ఏ ఫలము కలుగుతుందో ఆ ఫలము గురుసేవ వలన సుఖపూర్వకముగా కలుగును. ఎవరికి భోగ, మోక్షములందు కోరిక ఉంటుందో, బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుల పదప్రాప్తి కోరిక ఉంటుందో వారికి గురుభక్తిని మించిన వేరే మార్గము లేదు. ఇది శ్రుతివచనము. అన్ని అశుభములు, మహాపాతకములు గురుభక్తి అనెడి అగ్నియందు భస్మమయిపోవును. విశ్వాసపూర్వకుడు, సర్వసిద్ధిప్రదాయకుడు అయిన గురువుకు ఎవరు నమస్కరిస్తారో వారికి మట్టి, వృక్షము మరియు రాయి కూడా ఫలదాయకములవుతాయి. ఆ ఫలము యోగము వలనగానీ, తపస్సువలనగానీ, అర్చనవలన గానీ లభించదు. ఈ కులమార్గమునందు ఏక భక్తి కూడా విశిష్ఠము. దేవీమయమైన గురువు అన్ని భువనములందు వ్యాపించి ఉండగా, సాధకునకు ఏ క్షేత్రమునందు సిద్ధి కలగదు? ఆ సాధకుడునకు అన్ని క్షేత్రములందు సిద్ధి లభిస్తుందని అర్ధము. ఎవరైతే గురువును మనుష్యునిగా, మంత్రమును అక్షరముగా, దేవతా ప్రతిమను రాయిగా తలుస్తారో వారు నరకానికి పోతారు.

గురువుకు మరణధర్మము తెలియపరచరాదు. అలా తెలియపరిస్తే మంత్రముతో దేవతను అర్చించిననూ అతనికి సిద్ధిలభింపదు. శ్రీగురువుయొక్క స్మరణము సగం ప్రాకృతములోను, సగం సంస్కృతములోను చేసినా, చెప్పినా, అతడి అన్ని సుకృతములూ నశించును. జన్మకారకుడుగా తండ్రి పూజ్యుడు. ధర్మ-అధర్మములను తెలియపరచే గురువు విశేష పూజ్యుడు. శివునికి కోపమొస్తే గురువు రక్షించును. కానీ, గురువుకు కోపమొస్తే ఎవరూ రక్షించలేరు. మనసా, వాచా, కర్మణా గురువుకు హితమైన సాధనను చెయ్యాలి. అహితమైన కార్యము చేసినచో ఆ శిష్యుడు మలపురుగు అవుతాడు. గురువుయొక్క శరీర, ధన, ప్రాణములను ఎవరైతే వంచిస్తారో వారు నరాధములు మరియు క్రిమి, కీట, పతంగములవుతారు. గురువును త్యజిస్తే మృతుడవుతాడు. మంత్రమును త్యజిస్తే దరిద్రుడవుతాడు. రెండింటినీ త్యజిస్తే ఆ శిష్యుడు రౌరవాది నరకములకు పోతాడు. గురుసేవకై ధనమును ఆర్జించాలి. తన ప్రాణము ఇచైనా సరే గురుకార్యమును నిర్వర్తించాలి. గురు కఠోపవచనమును శిష్యుడు ఆశీస్సులవలే స్వీకరించాలి. గురువు వేధింపు కూడా అతని కృపగానే స్వీకరించాలి. భోగ్య, యోగ్య, వస్తువులు గురువుకు అర్పించాలి. గురువుయొక్క ఉచ్ఛిష్ఠమును ప్రసాదముగా తీసుకోవాలి. గురువు ముందు తపస్సు, ఉపవాసము, వ్రతాదులు చేయరాదు. ఆత్మశుద్ధి కొరకు తీర్ధయాత్రలు, స్నానాదులు చేయరాదు. గురువుకు అప్పివ్వడం లేదా తీసుకోవడము, గురువునుండి వస్తువులను కొనడం లేదా అమ్మడం వంటిపనులు చెయ్యరాదు. నాస్తికవాదిని దూరం నుండి చూసిన వెంటనే అతని కంటపడకుండా దూరంగా వెళ్లాలి. అతనితో ఎప్పుడూ కూర్చోనరాదు. గురువు సమీపమున వేరే పూజ ఏమైనా చేస్తే ఆ చేసినపూజ నిష్ఫలమవగా ఆ పూజ చేసినవాడు ఘోరనరకానికి పోతాడు. గురువుపాదాబ్జధారి తన శిరస్సునందు భారము భావించరాదు. గురు ఆజ్ఞానుసారముగా కర్తవ్యపాలన చెయ్యాలి. ఆజ్ఞను గురురూపముగా స్మరించాలి. అన్యత్రా మంత్రాగమము వింటే అది గురువునకు విన్నవించాలి.
                                                                                   
ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: