సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, జూన్ 2018, గురువారం

ధూమావతి

























జ్యేష్టశుద్ధ చతుర్ధి శ్రీధూమావతి ఉద్భవించినరోజు సందర్భంగా ఈ దేవతను మనం ఒకసారి స్మరించుకుందాం…

ఈమె దశమహావిద్యలలో ఒకదేవత. ఈమె రూపం కొంచెం తీవ్రంగా ఉంటుంది. వెలవెల బోయిన బూడిదరంగు శరీరం, మాసిన బట్టలు, విరబోసిన జుట్టు, వేలాడే స్తనాలు, క్రూరమైన చూపు, పొడుగాటి ముక్కు, బొట్టులేని నుదురు, ఆకలిగొన్నటు కనిపించేలా ఈదేవత ఆకారం ఉంటుంది. దేవతలలో విధవురాలుగా కనిపించే దేవత ఈమె ఒక్కతయే. ఈమె వాహనం కాకి. అయితే ఈమె రూపం సాధకులకు ఒక పాఠం నేర్పుతుంది. పైన మెరుగులతో కనిపించే అందం శాశ్వతంకాదు. సాధకులు అటువంటి అశాశ్వతమైన వాటిగురించి అర్రులుచాచకుండా తనలో తాను చూసుకొని శాశ్వతమైన జీవితసత్యాన్ని తెలుసుకోవాలని ఆమె రూపం తెలియపరుస్తుంది.

పార్వతికి ఆకలి అయినప్పుడు మహేశ్వరుని ఆహారం అడగ్గా అతను ఆలస్యం చేయడం వలన కోపమొచ్చి భవునిని మింగివేసినదట. అగ్నిరూపుడైన రుద్రుడు కడుపులో ఉండటం వలన ఆమె శరీరంపైనుండి పొగలు చిమ్మడంతో ఆమెను ధూమావతి అన్నారు. భర్తను మ్రింగివేసినది కనుక ఆమె విధవైనది. మరొక కధప్రకారం పార్వతి దక్షయజ్ఞంలో తనువులు బాసినప్పుడు ఆ హోమగుండం నుండి బూడిదరంగులో ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తియే ధూమావతి అని అంటారు.

ఎంతటివారినైనా ఉచ్ఛాటన చేయగల తీవ్రశక్తి ఆమె. ఈమెను సిద్ధులు ప్రసాదించే దేవతగా కొలుస్తారు. ఈమె ఉపాసనా ప్రయోగమును ప్రధానంగా శత్రువులను నిర్మూలించడానికి చేస్తారు. తనకు అనుకూలంగాలేని వారిని తన నుండి దూరంగా వెళ్ళగొట్టదలచినప్పుడు ఈ దేవతా ప్రయోగం చేస్తారు. ఈమె మహోన్నతమైన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఈమె సాధనలు రహస్యంగా శ్మశానంలోను, అడవిలోను జరుగుతుంటాయి.

ఈమెకు వృద్ధకాళి అని, ధూమ్రవారాహిఅని రూపాలుకూడా ఉన్నాయి.

(ఈ సంవత్సరం జూన్ 17వ తారీఖు ఆదివారం జ్యేష్ఠ శుక్ల చతుర్ధి)


కామెంట్‌లు లేవు: