చక్రసంకేతంః
శక్తిదేవతలయొక్క సమూహమే చక్రము. వారికి సంబంధించిన సమాచారమే సంకేతము.
శ్రీచక్రములో ఉండే దేవతలు ఎవరు? వారు ఎలా ఉద్భవించారు? ఇలాంటి విషయాలకు సంబంధించిన
రహస్యములే చక్రసంకేతము. బహుస్యాం ప్రజాయేయ అని బ్రహ్మము తలచి ఏకంగా ఉన్న తను బహుత్వంగా
మారి అనగా సృష్టిని చేసి దానిని పాలించి, తిరిగి తనలోనే లీనం చేసుకుంటుంది. ఇక్కడ జాగ్రత్తగా
గమనించవలసిన విషయం ఏమిటంటే, సృష్టి, స్ఠితి, లయ అంతా ఆ పరబ్రహ్మములోనే జరుగుతుంది.
మళ్ళీ కొంతకాలం తర్వాత సృష్టి జరుగుతుంది. లయనుండి తిరిగి సృష్టి జరగడానికి మధ్యన తిరోధాన,
అనుగ్రహ అను రెండు కృత్యములు కూడా ఉంటాయి. ఏ జీవులకైతో కర్మ పరిపక్వమవదో వారి కర్మ
పరిపూర్ణతకై అమ్మ దయతలచి వారికి మరియొక అవకాశము ఇవ్వదలస్తుంది. అదే అనుగ్రహము. తిరిగి
సృష్టి జరగడానికి జరగవలసిన కాలమంతా జీవులన్ని అమ్మకుక్షిలోనే ఉంటాయి. అదే తిరోధానము.
ఇదంతా బాహ్యంగా కనిపించేది. సూక్ష్మంగా చూస్తే ఇదే స్వరూపమును (ఆత్మస్ఫురణ) తెలుసుకోవడము.
బయటవేరొకటి ఉన్నాది అన్న జ్ఞానము అంతఃకరణ జ్ఞానము ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది కదా.
ఈ అంతఃకరణ జ్ఞానము లేనంతవరకు అంతా వేరుగానే కనిపిస్తుంది.
ఆత్మస్ఫురణ కలిగిన పరమేశ్వరుడు, జగత్తును, జీవులను సృష్టిస్తాడు. అలా
సృష్టించబడిన వాటియందు అతడు సూక్ష్మరూపంలో ఉంటాడు. జగత్తు భోగప్రదాత. జీవులు స్థూల,
సూక్ష్మ, కారణదేహాలను కలిగి ఉంటాయి. జీవులు జగత్తునందు ఎప్పుడైతే తమ దృష్టిని మరల్చుతారో
వారు మాయా ఆధీనులవుతారు. జీవులకు ఈ భోగప్రదాత అయిన జగత్తే భోగస్థానము. జీవులు మాయలో
కొట్టుమిట్టాడుతూ భోగములకొరకై అర్రులుచాచుతూ తమలోనే ఉన్న పరమేశ్వరుడును తెలుసుకొనలేక
మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఇదంతా ఆయా జీవులయొక్క పూర్వకర్మముననుసరించి జరుగుతూ
ఉంటుంది.
నిజానికి కనిపించే జగత్తంతా పరమేశ్వరుని ఇచ్ఛామాత్రమున ఏర్పడిన ఒకానొక
చిహ్నము. ఈ చిహ్నమే చక్రము. ఇది ఆ పరమేశ్వరుని మనోమయ జగత్తు. అలా తెలుసుకున్న వారికి
ఇది మోక్షస్థానము. తెలియకున్న వారికి ఇది భోగస్థానము. మొదటివారు మోక్షగాములు రెండవవారు
భోగకాములు.
ఈ విధంగా చూస్తే చక్రము బ్రహ్మాండముగాను, పిండాడముగాను తెలుస్తున్నది.
ఇదంతా బాహ్యదృష్టికి మాత్రమే. అంతర్ దృష్టికి మాత్రము మనస్సే శ్రీచక్రము. ఇదే పరమరహస్యము.
ప్రకాశ, విమర్శాత్మకములైన కామేశ్వరీ, కామేశ్వరుల సామరస్యఫలితమే అపరబిందువు.
ఈ అపరబిందువునుండి శ్రీచక్రము ఉద్భవిస్తున్నది. బిందువు, త్రికోణము, అష్టకోణములు, అంతర్దశారము,
బహిర్ధశారము, చతుర్దశారము, అశ్టదళములు, షోడశదళములు, చతురస్రముల సమూహమే శ్రీచక్రము.
శాస్త్రములందు సృష్టి గురించి రెండురకముల సిద్ధాంతములు చెప్పబడినవి.
అవి సృష్టి-దృష్టివాదము మరియు దృష్టి-సృష్టివాదము. సృష్టి-దృష్టి వాదముననుసరించి ఈ
చరాచర జగత్తు అంతా ఈశ్వరుని యొక్క జడశక్తి వలన జరిగినది అని చెప్పబడుచున్నది. ఇక దృష్టి-సృష్టివాదముననుసరించి,
జీవుడు ఎప్పుడైతే తనలో ఉన్న కుండలినీ శక్తిని చలింపచేస్తాడో అప్పుడు సృష్టిజరుగుతుంది
అని తెలియబడుచున్నది. అద్వైతసిద్ధాంతము అంతా ఈ దృష్టి-సృష్టివాదముననుసరించియే చెప్పబడుచున్నది.
ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి…శ్రీచక్రము బ్రహ్మాండరూపమైనా పిండాండరూపమైనా
అది అంతా మనస్సుయొక్క చిత్రీకరణ మాత్రమే. అందుకే మనఃమూలమిదంజగత్ అని పెద్దలు చెబుతారు.
మనస్సు పనిచేయునప్పుడు జగత్తు, భోగము, రాగము, శోకము మొదలగు అన్ని వికారములు తెలుస్తుంటాయి.
జాగ్రత్ మరియు స్వప్నావస్థలందు జీవుని మనస్సు పనిచేస్తూ ఉండడం వలన అన్ని రకాల వికారములు
గమనించవచ్చు. కాని, సుషుప్తి (గాఢనిద్ర)దశయందు మనస్సు పని చేయదు. అప్పుడు జగత్తు, మరి
ఏ వికారములు ఉండవు.
శుద్దబ్రహ్మమునకు ఎటువంటి చిత్తవృత్తులు ఉండవు. అది ఎప్పుడూ చలించక
స్వరూపస్థితియందు రమించుతూ ఉంటుంది. అది సర్వానందమయము. బిందురూపము. ఈ బిందువు శ్రీచక్రములోని
అంతర్ త్రికోణములో ఉన్న బిందువుకాదు. ఇది శ్రీచక్రములోని చంద్రమండలములో ఉన్న బిందువు.
ఇక శ్రీచక్రములోని అంతర్ త్రికోణములో ఉన్న బిందువు కామేశ్వరీ, కామేశ్వరుల
సామరస్య రూపము. ఇది పరబ్రహ్మచక్రము. ఈ బిందువే సృష్టికి మూలము. అనగా ఈ బిందువునుండే
శ్రీచక్రము ఆవిర్భవిస్తున్నది. నిజానికి ఈ బిందువు అవ్యక్తము. అంతర్ త్రికోణములో బిందువును
ఉంచి పూజించడం అవైదికము. నిజమైన దక్షిణ, సమయాచారపరులు చంద్రమండలములోని బిందువునే పూజిస్తారు.
అదే వైదికము.
మిగతా రహస్యములు గురుముఖతః తెలుసుకోవాలి.
ఇప్పుడు పూజాసంకేతం తెలుసుకుందాము.
(ఇంకాఉంది)
4 కామెంట్‌లు:
భగవంతుడు ఎందుకు సృష్ఠి కార్యాన్ని నిర్వహించాడు.సృష్టించాలని కోరిక ఎలా కలిగింది.కోరికల కు మూలం ఏమిటి?
Etuvanti chitha vruttulu leni suddhabrahmmamu naku srusthinchaali ane korika Ela kaliginadi.mari korika anedi chitha vrutte kada
దీనికి సమాధానము ఈ పోస్టు మొదటి పేరాలోనే ఉన్నది. ఏ జీవులకైతే కర్మపరిపక్వమవదో ఆ జీవులను అనుగ్రహించడానికై పరబ్రహ్మము మరియొక అవకాశము ఇవ్వదలచి తిరిగి సృష్టిని చేసాడు.
సృష్టించాలని కోరిక ఎలా కలిగింది.? ఆమె నిష్కామా. అనగా ఎటువంటి కోరికలు లేనిది అని అర్ధము. కాని సృష్టి ఆమె లీలావినోదము. అందుకే ఆమె లీలావినోదిని.
కోరికలకు మూలం ఆశ. జీవులలో ఈ ఆశ పోనంతవరకు అమ్మ పాదాలచెంత చేరలేము.
ఈ ప్రశ్నకు సమాధానము పై ప్రశ్న జవాబునందే ఉన్నది. గమనించగలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి