మంత్రసంకేతంః
శ్రీవిద్యోపాసనకు ప్రధానమైన అంగం మంత్రము. ఇదే పంచదశాక్షరి మంత్రం.
ఈ మంత్రము వేదములో పరోక్షంగా చెప్పబడింది. వేదంలో చెప్పబడిన ఎన్నో మంత్రాలలో గాయత్రి
మరియు పంచదశాక్షరి చాలా ముఖ్యమైనవి. గాయత్రిని ప్రకటగాయత్రి అని, పంచదశాక్షరిని అప్రకటితి
గాయత్రి అని అంటారు. ప్రకట గాయత్రి మూడు వర్ణాలవారికి అందులోను మగవారికి మాత్రమే తండ్రిద్వారా
ఇవ్వబడుతుంది. అదే అప్రకట గాయత్రి గురువుద్వారా అర్హులైన వారికి కుల, లింగ భేదములు
లేకుండా ఇవ్వబడుతుంది. అయితే ప్రకటగాయత్రిని వేదమంత్ర రూపంగా ఉపదేశపడగా, అప్రకటగాయిత్రి
మాత్రం సంకేత పదాల రూపంలో ఉపదేశపడుతుంది. ఈ సంకేత పదాలనే బీజాక్షరాలని అంటారు. ఈ మంత్రం
రహస్యంగా గురుపరంపరగా ఉపదేశపడుతుంది. ఈ కారణాలవలననే ఈ మంత్రాన్ని అప్రకటిత గాయత్రి
అని, రహస్యం అని అంటారు.
మంత్రంయొక్క అర్ధం, ఉపాసనాదేవత, మంత్రఉచ్ఛారణాకాలం, పద్ధతి మొదలైన సాంకేతక
విషయాలను వివరించేదే మంత్ర సంకేతం. ఈ వివరణలన్నీ శ్రీభాస్కరరాయలువారు తమ వరివస్యారహస్యం
అన్నగ్రంధంలో చాలా విస్తారంగా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ మంత్రం గురించి చాలా
క్లుప్తంగా మాత్రం చర్చించుదాము.
ఇక్కడ మంత్రము అంటే పంచదశాక్షరి మంత్రము. ఈ మంత్రమందు పదిహేను బీజాక్షరములుండడం
వలెనే ఈ మంత్రాన్ని పంచదశాక్షరి అని అంటారు. ఈ మంత్రమందు దేవతా పేరు ఉండదు. ఈ పంచదశాక్షరి
మూడు కూటములుగా ఉంటుంది. శ్రీలలితారహస్యనామములందు చెప్పబడిన “శ్రీమద్వాగ్భవకూటైకాస్వరూపముఖపంకజా“, “కంఠాధఃకటిపర్యంతామధ్యకూటస్వరూపిణీ“,
“శక్తికూటైకతాపన్నాకట్యదోభాగధారిణీ “ అన్న మూడునామములందు ఈ పంచదశాక్షరి మంత్రమును చెప్పబడినది. మూలమంత్రములో
ఉన్న మొదటి కూటమి అమ్మవారి ముఖపంకజముగా, రెండవకూటమి అమ్మవారి కంఠమునుండి కటివరకుగా,
మూడవకూటమి కటినుండి పాదములవరకుగా భావించాలి.
సూక్ష్మంగా చూస్తే, మొదటికూటమి అర్ధం ఇలా ఉంటుంది. “చిఛ్చక్తిరూపమైన
అమ్మా (ఏ) అవిద్యవలన పుడుతున్న(క) బ్రహ్మకు భిన్నుడను భేదభావమును (హ్రీం) తొలగించు
(ఈల)“. జాగ్రత్తగా గమనిస్తే జీవభావాన్ని తొలగించమని అమ్మని ప్రార్ధించడం ఇక్కడ కనిపిస్తోంది.
ఈ జీవభావమే మహావాక్యంలో చెప్పబడిన “త్వం”.
ఇప్పుడు రెండవ కూటమిని అర్ధంచేసుకుందాము. అంతా పరివ్యాప్తమైఉన్న (హల)
బ్రహ్మము(క) అన్న స్థితికి నన్ను (హస) చేర్చుము (హ్రీం). “నేను బ్రహ్మముఅని తెలియజేయుము”
అని అర్ధం. మొదటి కూటమి ద్వారా అవిద్య తొలగబడగా ఇప్పుడు సాధకుడు తనే బ్రహ్మమని తెలుసుకుంటాడు.
ఇక్కడ అలా తెలుసుకోబడిన ఆ బ్రహ్మమే మహావాక్యంలో చెప్పబడిన “తత్“.
ఇక మూడవకూటార్ధము చూడగా, ఆ విధంగా తెలుసుకోబడిన నా స్వరూపమందు ఎల్లప్పుడూ
ఉండునట్టుగా చేయుము (సకలహ్రీం) అని అర్ధం. అనగా అది నేనే అయ్యి ఉన్నాను. ఈ భావమే మహావాక్యంలో
చెప్పబడిన “అసి”. మొత్తంగా చూస్తే తత్త్వమసియే పంచదశాక్షరి అని అర్ధం అవుతోందికదా.
ఈ మంత్రమునకు వైదిక మంత్రములలాగే స్వరయుక్తముగా జపవిధానం కూడా కలదు.
ఇలా ఎన్నో రహస్యాలు కలవు. అవి గురుముఖతః తెలుసుకోదగినవే. ఇలా ఏ సాధకుడు రహస్యాలను తెలుసుకొని
సాధన చేస్తాడో అతడు సాక్షాత్తు పరబ్రహ్మమే అవుతాడు.
అయితే చాలామంది మంత్రమును తెలుసుకొని (అంటే ఒక పుస్తకంచూసో, అంతర్జాలంలో
చూసో, ఎవరి దగ్గరైనా ఫోన్లో తెలుసుకొనో) మంత్రం జపం చేస్తుంటారు. సశాస్త్రీయంగా గురువుదగ్గర
ఉపదేశం తీసుకొని మంత్రానుష్టానం చేసేవారు చాలా తక్కువ. వారిలో కూడా చాలామంది ఉపదేశం
తీసుకొని రహస్యాలు తెలుసుకోకుండా ఏదో గొప్ప సాధన చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు.
అవన్నీ తమని గురువే పిలిచి తమకు చెప్పాలని అనుకుంటుంటారు. ఇదంతా సాధన అన్న ముసుగులో
అహంకారపూరితమైన ప్రవర్తనే తప్ప మరేమీ కాదు. నిజానికి మన సాధన, నడవడిక అహంకారరహితమై
ఉండాలి. అప్పుడే రహస్యాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. అప్పుడు గురువును సమీపించి
అత్యంత వినమ్రతతో సాధనా రహస్యాలు తెలుసుకోవాలి.
ఇప్పుడు చక్రసంకేతం తెలుసుకుందాము.
(ఇంకాఉంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి