సాధన అంటే ఏమిటి? మంత్రమును పఠించడమే సాధనా? అని ఈ మధ్య నా శిష్యులొకరు
నన్ను ప్రశ్నించారు. నిజానికి ఇది తెలుసుకోదగిన విషయమే. ఇప్పుడు సాధన అంటే ఏమిటో తెలుసుకోవడానికి
మనం కొంచెం ప్రయత్నిద్దాం.
సులభంగా అర్ధం చేసుకోవాలంటే సాధన అనగా అభ్యాసము అని ఒక అర్ధము. దేనిని
అభ్యసించాలని ఇక్కడ ప్రశ్న. క్రమశిక్షణగా మెలగడం, ధర్మపథమున పయనించడం, శాస్త్రవిహిత
కర్మలను క్రమం తప్పకుండా పాటించడం, సత్యాన్ని ఎన్నడూ విడవనాడకుండా ఉండడం, ఎల్లవేళలా
భక్తిప్రపత్తులు కలిగి ఉండడం, గురువాక్యమందు శ్రద్ధకలిగి ఉండడం, నిరంతర మంత్రజపాన్వితులై
ఉండడం, పూజాదికార్యక్రమాలు క్రమం తప్పకుండా చేయడం ఒక్కటేమిటి మన శ్వాస ఉన్నంత వరకు
మనం చేసే ప్రతీ పనినీ పైనియమాలతో శ్రద్ధగా ఆచరించడమే సాధన. గురువు దగ్గర ఏదో మంత్రాన్ని
తీసుకొని దానిని ఊరకే రోజూ వల్లె వేస్తే వచ్చేదేమిటి? ఉత్త కాలహరణం తప్ప. కొంతమంది
చెబుతుంటారు మంత్రం జపం చేస్తే చాలు పూజలు పునస్కారాలు అక్కరలేదు అదేగొప్ప సాధన అని.
ఆత్మశుద్ధిలేని శివ పూజలేలరా? అన్న యోగి వేమన నీతిని ఇక్కడ గుర్తుచేసుకోవలసిందే. మనసులో
పక్కవాడంటే పడదు, కామవాసనలు తీరవు, డబ్బుయావ వదలదు ఇటువంటి మలినాలన్నింటినీ పెట్టుకొని
చేసే మంత్రజపం వలన ఏమి వస్తుంది? మంత్రజపం ఫలించాలంటే శుద్ధమైన మనస్సు ఉండాలి. మనస్సు
శుద్ధ పడడానికే పూజలు. మొదటగా పూజలవలన క్రమశిక్షణ అలవడుతుంది. ఆ తర్వాత మనస్సు ఆధ్యాత్మకతమీద
లగ్నమవుతుంది. అప్పుడు మంత్రం జపం ఫలిస్తుంది. అలాగని ఒక్క పూజలే చేస్తూ కూర్చోకూడదు.
సంధ్యావందనం, ఆరాధన, మంత్రజపం, స్తోత్రం ఇవ్వన్నీ రోజూ క్రమపద్ధతిలో చేయాలి. అప్పుడది
సాధన అనబడుతుంది. అదేకాదు ఒకజీవి తను ఆచరించే
క్రమబద్ధమైన జీవినవిధానమంతా సాధనే అవుతుంది. అంతేకాని ఏదో ఒక మంత్రజపం మాత్రమే సాధన
అవ్వదు.
1 కామెంట్:
మంచి విషయాన్ని తెలియజేశారు!
ధన్యవాదాలు!💐🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి